తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ని ఇంకా దూకుడుగా కొనసాగిస్తోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా మాజీ ఎంపీ వివేక్ చేరిన సంగతి తెలిసిందే. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర భాజపా వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీ నుంచి మరిన్ని వలసల్ని ప్రోత్సహించే పనిలో పడింది భాజపా. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు వస్తుండటం, కేంద్రంలో మోడీ సర్కారు కాశ్మీరు అంశంపై తీసుకున్న నిర్ణయాలకు దేశవ్యాప్తంగా మద్దతు రావడం.. ఈ నేపథ్యంలో తెలంగాణలో వలసలకిది సరైన సమయం అనుకుని జోరు పెంచే పనిలోపడ్డట్టుంది. అందుకే, ఈ నెల 18న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను రాష్ట్ర భాజపా నిర్వహించనుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాకి చెప్పారు.
భాజపా రాష్ట్రంలో ఎక్కడా లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారనీ, ఆయన ఒక్కసారి నిజామాబాద్ కి వెళ్తే ఎక్కడుందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. కాంగ్రెస్ ని కూడా విమర్శిస్తూ… ఆ పార్టీ త్వరలో పూర్తిగా ఖాళీ అయిపోతుందనీ, గాంధీభవన్ ని అమ్మకానికి పెట్టెయ్యొచ్చంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ వివేక్ తో గంటసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయిందనీ, చివరికి ఆయన భాజపాలో చేరారన్నారు. విమోచన దినం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిందినీ, దీన్ని వచ్చే నెలలో పెద్ద ఎత్తున జరుపుతామని మరోసారి చెప్పారు. ఈనెల 18న హైదరాబాద్ లో నిర్వహించబోయే సభకు భాజపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నట్టు చెప్పారు. ఆయన సమక్షంలో చాలామంది పార్టీలో చేరబోతున్నారన్నారు. ఈ సభకి కేంద్ర హోం మంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా వచ్చే అవకాశం ఉందనీ కథనాలు వస్తున్నాయి.
ఈ నెల 18న నిర్వహించబోయే సభలో దాదాపు 20 మంది నేతల చేరిక ఉంటుందని సమాచారం! టీడీపీ నేత గరికపాటితో సహా, వివిధ పార్టీలకు చెందిన నాయకుల చేరిక ఆరోజే ఉంటుందని భాజపా వర్గాలు అంటున్నాయి. ఇకపై, తెలంగాణలో చేరికల్ని ఇలానే పెద్ద ఎత్తున నిర్వహించాలనీ, సభలు పెట్టి పెద్ద సంఖ్యలో వలసల్ని ప్రోత్సాహించాలనే ఉద్దేశంలో భాజపా ఉన్నట్టుంది. 20 మంది ఒక్కసారి చేరడమంటే… రాజకీయంగా ఆ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ 20 మందీ ఎవరు అనేదీ ఇప్పుడు కొంత ఆసక్తికరమే కదా. ఇతర పార్టీలపై కూడా దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే అని చాటి చెప్పుకోవడం కోసం భాజపా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.