కరోనా కారణంగా పరిస్థితులు అల్లకల్లోలమైపోయాయి. ముఖ్యంగా చిత్రసీమ చిదికిపోయింది. సినిమాలకు మళ్లీ హుషారు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినీ రంగానికి పునరుత్తేజం కల్పించడానికి `ప్రొడ్యూసర్ గిల్డ్` కొన్ని సూచనలు చేసింది. స్టార్లంతా పారితోషికాలు తగ్గించుకోవాలని, కనీసం 20 శాతం కోత విధించాలని కోరింది. ప్రొడ్యూసర్ గిల్డ్ లో ఉన్నవాళ్లంతా బడా నిర్మాతలే. వాళ్లంతా యాక్టీవ్ ప్రొడ్యూసర్లు. వాళ్లు అనుకుంటే అయిపోతుంది. కానీ.. పారితోషికాల తగ్గింపు మాత్రం అనుకున్నంత సులభం కాదని సినీ విశ్లేషకులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. డిమాండ్ ని బట్టే పారితోషికమని, మరీ ముఖ్యంగా స్టార్లు పారితోషికం తగ్గించుకోవడానికి ఏమాత్రం ఉత్సాహం చూపించరని చెబుతూనే ఉన్నారు. 20 శాతం కోత అనేది నోటి మాటలకే పరిమితమని తేల్చేశారు.
ఇప్పుడు అమితాబ్ విషయంలోనూ ఇదే జరిగిందనిపిస్తోంది. ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు గానూ అమితాబ్ కి ఏకంగా 25 కోట్ల పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. అమితాబ్ రేంజ్ అది. బిగ్ బీ ఉంటే సినిమా రూపు రేఖలు మారిపోతాయి. మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి.. అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందే. అయితే… ఇక్కడ కూడా 20 శాతం కోత ఉందా? అన్నదే ప్రశ్న. అమితాబ్ పారితోషికం ఇంత అని ఎక్కడా ఫిక్స్ అయి ఉండదు. `నాకింత కావాలి` అని అమితాబ్ అడగడమే ఆలస్యం. బేరసారాలు చేయకుండా ఇచ్చేయాల్సిందే. ఈ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.
ఇక్కడ `20 శాతం తగ్గింపు` అనే ప్రస్తావనే రాకపోవొచ్చు. అమితాబ్ అనే కాదు, ఏ స్టార్ దగ్గరా `మా కొత్త రూల్స్ ప్రకారం మీ పారితోషికం తగ్గించుకుంటారా` అని అడిగే ధైర్యం ఏ నిర్మాతకీ ఉండదు. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. టాలీవుడ్ లో.. పారితోషికా తగ్గింపు (అందునా పెద్ద స్టార్ల దగ్గర) కుదరదు అని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంతే. భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుంది కూడా. చిన్నా చితకా ఆర్టిస్టుల దగ్గర `కొత్త రూల్స్` పేరుతో పారితోషికాలు తగ్గించుకోవడానికి నిర్మాతలు ప్రయత్నించొచ్చు. స్టార్ల దగ్గర మాత్రం ఈ పప్పులు ఉడకవు. వాళ్లేదో దయ తలచి `నేను పారితోషికం తగ్గించుకుంటున్నా` అని చెప్పి, రిబేటు ఇవ్వాలి తప్ప, నిర్మాతలే అడిగే సాహసం చేయరు. చేయలేరు.