నిర్మాత పరిస్థితి ముందు నుయ్యి – వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. సినిమాని విడుదల చేయాలంటే థియేటర్లు లేవు. ఓటీటీకి వెళ్లబోతుంటే మంచి రేట్లు రావు. ఓటీటీ ఇచ్చే రేటుకీ, బడ్జెట్కీ పొంతన లేకుండా పోతోంది. దాంతో.. నిర్మాతలు వేచి చూడడమే బెటర్ అనుకుంటున్నారు.
అయితే చిన్న సినిమాలూ, విడుదలకు నోచుకోని సినిమాలకూ ఈ ఇబ్బంది లేదు. తమ సినిమాని చూపించుకోవడానికి వాళ్లకో వేదిక దొరికితే సరిపోతుంది. అందుకే ఓటీటీ వాళ్లకు మంచి ఆప్షన్. సెన్సార్ కూడా పూర్తయి, విడుదలకు నోచుకోకుండా వందల సినిమాలు ఉండిపోయాయి. ఇప్పటి వరకూ ఆ సినిమాల్ని కొనేవాడు లేడు. అలాంటి సినిమాల్ని వెదికే పనిలో పడుతున్నాయి ఓటీటీ సంస్థలు. ఆ సినిమాల్ని వీలైనంత చవగ్గా కొనేయడమో లేదంటే 50 – 50 బేసెస్ మీద విడుదల చేసి, తద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడమే చేయాలని చూస్తున్నారు. వ్యూకి ఇంత అని రేటు గట్టి, ఎంతమంది చూస్తే అంత డబ్బు ఇచ్చేందుకు ఓ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ వేదికలకు కంటెంట్ అత్యవసరం. వారానికి ఒకటో రెండో కొత్త సినిమాల్ని చూపించుకోవాల్సిందే. ఎలాగూ పెద్ద సినిమాలు రావడం లేదు. దాంతో చిన్న సినిమాలపై గురి పెట్టాయి ఓటీటీ సంస్థలు. స్టార్లు ఉన్నా లేకున్నా, పూర్తిగా కొత్త వాళ్లతో తీసినా, అసలు ఆ సినిమాకి బజ్ ఉన్నా లేకున్నా – ఇవేం పట్టించుకోకుండా టోకున సినిమాల్ని కొనడానికి `ఆహా`, `జీ 5` లాంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. `ఆహా` త్వరలోనే ఇరవై చిన్న సినిమాల్ని స్ట్రీమింగ్కి ఉంచబోతోందని టాక్. వ్యూకి ఇంత అంటూ రేటు ఫిక్స్ చేసి, సదరు నిర్మాతలతో ఆహా ఎగ్రిమెంట్లు కుదుర్చుకుందని టాక్. అవన్నీ థియేటర్లు లేక, బయ్యర్లు లేక ఆగిపోయినవే. వారానికి ఒక సినిమా చొప్పున ఆ సినిమాలన్నీ విడుదల చేయాలని ఆహా భావిస్తోంది. సో.. ఆహా, జీ 5 లలో త్వరలోనే మరిన్ని సినిమాలు చూడబోతున్నామన్నమాట.