కరోనాతో ప్రేక్షకులకు వెండి తెర దూరమైపోయింది. కాకపోతే.. ఆ వినోదం ఇంట్లో బుల్లి తెరలే అందిస్తున్నాయి. ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ పుణ్యమా అని – ఈ లాక్ డౌన్ కాలంలో టైమ్ పాస్ అయిపోతోంది. దీని వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతిన్నా, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ మాత్రం పుంజుకున్నాయి. రాబోయే రోజుల్లో ఓటీటీ నుంచి మరిన్ని వెబ్ సిరీస్‌లూ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ రాబోతున్నాయి. `ఆహా` ప్లానింగులూ భారీగా ఉన్నాయి. ఈ డిసెంబరు లోపు ఏకంగా 20 వెబ్ సిరీస్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తే చాలనుకుంది. కానీ… ఓటీటీ వేదికలకు ఉన్న డిమాండ్ గమనించిన అల్లు అరవింద్ ఆ సంఖ్యని 20కి పెంచారు. అంతేకాదు.. కొన్ని ఇండిపెండెంట్ సినిమాలూ తీస్తారట. లాక్ డౌన్ ఎత్తేశాక, విధించే నియమ నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని షూటింగ్‌లు చక చక పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కథల్ని, కొంతమంది దర్శకుల్ని `ఆహా` లాక్ చేసి పెట్టింది. లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే.. ఆహా తన పని ప్రారంభించబోతోంది. 20 వెబ్ సిరీస్‌లు అంటే మాటలు కాదు. కనీసం 2 వేల మందికి కావల్సినంత పని దొరుకుతుంది. సినిమాల మాటెలా ఉన్నా – వెబ్ సిరీస్ రంగం ఈ కరోనా వల్ల లాభపడుతోంది. ఇక రచయితలకు, దర్శకులకూ బోలెడంత పని.