రీమేక్ అంటే చాలామందికి చిన్నచూపు. కొత్తగా ఏం చేస్తారు? అక్కడ ఉన్నదేగా ఇక్కడ తీసేది. సీడీ ఉంటే చాలు క్రియేటివిటీతో పనిలేదు.. అనుకుంటారు. కానీ రీమేక్ ని ఎలా చేయొచ్చో.. అందులో మనదైన ముద్ర ఎంతగా వెయొచ్చో.. చెప్పే సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. అలాంటి కథల్లో `నువ్వే కావాలి` ఒకటి.
మలయాళ చిత్రం `నీరమ్`కి రీమేక్.. `నువ్వే కావాలి`. నిజానికి `నీరమ్`, `నువ్వే కావాలి` చూసిన ప్రేక్షకులకు రెండూ వేర్వేరు కథలేమో అన్న భ్రమ కలుగుతుంది. మాతృకని ఆ స్థాయిలో మార్చుకున్నారు. కథలో చిన్న లైన్మాత్రమే తీసుకుని, దానికి చక్కటి సంభాషణలు, సన్నివేశాలు, పాత్రలూ జోడించి – మరో స్థాయికి తీసుకెళ్లారు. విజయ్ భాస్కర్ని దర్శకుడిగా నిలబెట్టిన సినిమా. త్రివిక్రమ్ ని స్టార్ రైటర్‌గా మార్చిన సినిమా. చిత్రసీమకు తరుణ్ అనే కుర్రాడిని హీరోగా పనిచయం చేసిన సినిమా. రిచా గురించి కొన్నాళ్ల పాటు మాట్లాడుకునేలా చేసిన సినిమా. కోటి మ్యూజిక్ మ్యాజిక్ గురించి పాటలు పాటలుగా చెప్పుకునే సినిమా.. `నువ్వే కావాలి`.
నిజానికి `నీరమ్` హక్కులు స్రవంతి రవికిషోర్ చేజిక్కించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే రీమేక్ పనులూ మొదలైపోయాయి. కాకపోతే.. సినిమా తీయడానికి కావల్సినంత ఆర్థిక వనరులు ఆయన దగ్గర లేకపోవడంతో ఉషాకిరణ్ మూవీస్ తో టై అప్ అవ్వాల్సివచ్చింది. ఈ కలయిక స్రవంతి మూవీస్ కంటే.. ఉషాకిరణ్ మూవీస్ కే ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టిందనుకోవాలి. అప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైన ఓ హిట్ సినిమా స్క్రిప్టు.. ఉషాకిరణ్ చేతికి వచ్చినట్టైంది. చాలా పరిమితమైన బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇది. ఆ రోజుల్లోనే దాదాపు 30 కోట్ల వరకూవసూలు చేసి రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. నువ్వే కావాలి… ప్రభావం టాలీవుడ్ పై చాలా కాలం ఉంది. స్నేహితులు ప్రేమికులు గా మారడం లాంటి కథలు చాలా పుట్టుకొచ్చాయి.
కోటి పాటలన్నీ సూపర్ హిట్టే. అనగనగా ఆకాశం ఉంది.. కుర్రకారుని ఊపేస్తే… కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు.. కన్నీళ్లు పెట్టించింది. ఇక త్రివిక్రమ్ మాటల గారడీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సరదా సంభాషణల్ని ఎంత బాగా రాశాడో… లోతైన భావాల్ని కూడా అంతే బాగా పలికించాడు. “గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం. కానీ, గుండెల్లో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పాలి“ లాంటి గొప్ప మాటలెన్నో రాయగలిగాడు.