సాధారణంగా సినిమాకి 72 సీన్లు వుంటాయని చెబుతుంటారు. అనాదిగా వస్తున్న లెక్క ఇదే! కొత్తతరం దర్శకులు వచ్చాక… సన్నివేశాల నిడివిని కుదించి, సీన్ల సంఖ్యను కొంచెం పెంచారని అనుకుందాం! ఎంత పెంచినా సినిమాలో రెండొందల సీన్లు పడతాయా? రెండున్నర గంటల సినిమాలో 242 సీన్లు అంటే… నిమిషానికి ఒక సన్నివేశం స్ర్కీన్‌పై వచ్చి వెళ్తుండాలి. హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈరోజు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఫొటో ప్రకారం అయితే… ‘సాహో’లో 242 సీన్లు కచ్చితంగా వుండి తీరాలి. అంతకన్నా ఎక్కువ వున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. శ్రద్ధా కపూర్ ఈ రోజు సెట్స్‌లో జాయిన్ అయ్యారు. సీన్ నెం. 242, షాట్ నెం 1 తీస్తున్నార్ట! అప్పటికే నాలుగు టేకులు తీసినా సరిగా రాలేదు. ఐదో టేక్‌కి అందరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే బడ్జెట్ భారీగా ఖర్చు చేశారని, నిర్మాతలు 300 కోట్టు ఖర్చు చేయడానికి సిద్ధంగా వున్నారని వినికిడి. హాలీవుడ్ రేంజ్లో సినిమా తీస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2019లో విడుదల చేయాలనుకుంటున్నార్ట!