ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం “రంగుల మిషన్” ప్రారంభించింది. కనిపించిన ప్రతీ దానికి వైసీపీ రంగులు వేస్తున్నారు, గుడి,బడి తేడా లేదు. ఇంకా జాతీయ పతాకం.. జాతిపితనూ వదిలి పెట్టడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో… పేదలకు ఇచ్చే ఇళ్లకు.. పైన.. పిట్టగోడ మీద.. కాంగ్రెస్ పార్టీ గుర్తులను పోలి ఉండేలా.. మూడు రంగులు వేసేవారు. అలా వేసినందుకే.. విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. సొంత సొమ్ముతో కట్టారా.. అని నిలదీశారు. వివాదాలు అవుతాయని.. ఆ తర్వాత అలాంటి రంగుల హడావుడి వైఎస్ హయంలో పెద్దగా సాగలేదు. కానీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు.. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆ రంగులు వేయడాన్ని ఓ ఉద్యమంలా ప్రారంభించారు. ఈ సారి మొహమాటలు పెట్టుకోలేదు. గుడి, బడి తేడా కూడా చూపించడం లేదు.
వైసీపీ సర్కార్ అధికారం చేపట్టిన మొదట్లో గత ప్రభుత్వం కట్టించిన అభివృద్ధి పనులకు.. నీళ్ల ట్యాంకులు, గోడలు.. వంటి వాటికి వైసీపీ రంగులేశారు. అలాంటి పనులు ఎక్కువగా టీడీపీ ప్రజాప్రతినిధులు కట్టించినవి కావడంతో పసుపు రంగులేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే.. ఆ పసుపు రంగుల్ని .. తమ పార్టీ రంగులతో ముంచెత్తడం ప్రారంభించారు. ప్రభుత్వం మాది కాబట్టి… మా రంగులు వేసుకుంటామని.. వైసీపీ నేతలు.. వాదించడం ప్రారంభించారు తర్వాత గ్రామ సచివాలాయలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాలు ఎలా ఉండాలో చూపిస్తూ.. ప్రత్యేకంగా ఫోటో జత చేసి మరీ జీవో జారీ చేసింది. ఆ ఆదేశాల్లో స్పష్టంగా… వైసీపీ రంగులు.. వేయాలని.. ఉంది. అంతే.. కట్టు తెగినట్లయింది. ఆ రంగులన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే వేశారు. గ్రామ సచివాలయాన్నింటికీ.. వైసీపీ రంగు పడిపోయింది…
ఇప్పుడు వైసీపీ రంగులతో అవన్నీ వైసీపీ పార్టీ కార్యాలయాలుగా కనిపిస్తున్నాయి. ఈ రంగులు వేయడానికి 2వేల కోట్లుకుపైగా ఖర్చు పెడుతున్నారన్న ఆరోపమలు వినిపిస్తున్నాయి. ఎంత ఖర్చుపెడుతున్నామో ప్రభుత్వం మాత్రం చెప్పడం లేదు కానీ.. చాలా పెద్ద మొత్తమే దీని కోసం వెచ్చిస్తున్నట్లుగా.. ఊరూవాడా కనిపిస్తున్న రంగులే నిరూపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఆదేశించిన ప్రకారం… గ్రామసచివాలయాలకు.. రంగులు వేయడానికి ఒక్కో భవనికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. చాలా వరకూ భారాన్ని స్థానిక సంస్థలపైనే నెట్టేస్తున్నారు. అసలే నిధుల్లేక నీరసపడిన స్థానిక సంస్థలు ఈ రంగుల భారం అదనం అయింది. కొత్తగా వైసీపీ సర్కార్… ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేసి.. వాటికి రంగులేసుకుంటే.. ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పేవారు కాదేమో కానీ..కనిపించిన ప్రతీదానికి రంగులద్దడమే.. వివాదాస్పదమవుతోంది. ఇప్పుడు.. ఎవరు ఏం చెప్పినా… వినే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేరు.