2011లో వన్డే ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకుంది. లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలుకు.. ఆ ప్రపంచకప్ విజయం గొప్పగా ఉందని అందరూ అనుకున్నారు. అప్పుడు.. ఫైనల్లో భారత్.. శ్రీలంకపై గెలిచింది. అప్పుడు.. సైలెంట్‌గా ఉండిపోయిన… శ్రీలంక క్రికెట్ పెద్దలు.. దాదాపుగా పదేళ్ల తర్వాత అప్పటి ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ.. కొత్త రాగం అందుకుంటున్నారు. మాజీ క్రీడా మంత్రి మహిదానంద చేసిన ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మహిదానంద క్రీడా మంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రపంచకప్ ఫైనల్ జరిగింది. అప్పుడు సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం శ్రీలంక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ దేశ లెజెండరీ క్రికెటర్ అర్జున రణతుంగ.. ప్రపంచకప్ తుదిపోరుపై విచారణ జరుపాలంటూ డిమాండ్ చేశాడు. అప్పటి ఫైనల్ మ్యాచ్‌కు రణతుంగా కామెంటేటర్‌గా కూడా వ్యవహరించారు. ఫైనల్ మ్యాచ్ పూర్తయిన ఆరేళ్ల తర్వాత రణతుంగ విచారణకు డిమాండ్ చేశారు. మళ్లీ సైలెంటయిపోయారు. ఇప్పుడు మాజీ క్రీడా మంత్రి తెరపైకి వచ్చారు. ఆయన మాటలకు రణతుంగ వంత పడుతున్నారు. ఆటగాళ్లకు ఫిక్సింగ్‌తో సంబంధం లేదని… శ్రీలంక క్రీడా మంత్రి చెబుతున్నారు..కానీ ఎటు తిరిగి తమ మీదకే వస్తుందని శ్రీలంక ఆటగాళ్లు భయపడుతున్నారు. అప్పటి జట్టులో కీలకంగా ఉన్న మహేళ జయవర్ధనె, కుమార సంగక్కర ఈ ఆరోపణల్ని ఖండించారు. ఆధారాలు ఉంటే ఐసీసీకి సమర్పించాలన్నారు.
అయితే.. శ్రీలంకలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని… రాజకీయ పార్టీలకు సంబంధం ఉందంటూ.. కొత్త అనుమానాలను ప్రజల్లోకి పంపి.. అధికార పార్టీపై అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీలంక అంతర్గత రాజకీయాల కారణంగా… ఈ పరిస్థితి వస్తుందని అంటున్నారు. ‘ఎన్నికలు రాబోతున్నాయా?. సర్కస్ మళ్లీ మొదలైనట్లుంది. వాళ్ల పేర్లు, ఆధారాలు ఎక్కడ?’ అని మాజీ క్రికెటర్ జయవర్దన్ ప్రకటించడమే దీనికి నిదర్శనం. శ్రీలంక అంతర్గత రాజకీయాలతో భారత్ గెల్చుకున్న ప్రపంచకప్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నారు లంకేయులు.