హైదరాబాద్ వరద బాధితులకు ప్రకటించిన విరాళాన్ని ఇచ్చేందుకు చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్కు వెళ్లారు. చెక్కులిచ్చారు. ఏం మాట్లాడారో కానీ అధికారిక ప్రకటనలో మాత్రం… ప్రభుత్వం వైపు నుంచి భారీ తనం కన్పించింది. రాష్ట్ర రాజధాని శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణానికి 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని … సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా ప్రకటనలో ఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ సిటీలో విమానాలు దిగే ఎయిర్ స్టిప్తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని కేసీఆర్ చెప్పినట్లుగా అ ప్రకటన ఉంది.
అయితే అచ్చంగా ఇలాంటి ప్రకటనే ఎప్పుడో వినిపించిందే అని చాలా మంది అనుకున్నారు. అది నిజమే. 2014లో అంటే.. ఆరేళ్ల కిందటే.. కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.మళ్లీ ఆరేళ్ల తర్వాత గుర్తు చేసుకున్నారన్నమాట. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాచకొండ గుట్టల్లో ఫిల్మ్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం తలపించింది. “వాయు వేగం”తో అడుగులు వేస్తున్నట్లుగా హడావుడి చేసింది. నాలుగు హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే కూడా చేశారు. రాచకొండ గుట్టల ప్రాంతంలో 2,500 ఎకరాల్లో సినీ పరిశ్రమ కోసం “చిత్ర నగరి”కి రంగం సిద్ధమయిందని ప్రభుత్వం చెప్పేసింది. ఆ తర్వాత సౌండ్ లేదు. ఇప్పటికి ఆరేళ్లయింది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రకటనే వచ్చింది. కాకపోతే.. ఈ సారి రాచకొండ గుట్టల ప్రస్తావన లేదు.
విరాళం ఇవ్వడానికి వెళ్లిన చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్.. భూములిస్తామని.. స్టూడియోలు కట్టుకోవాలనే ప్రతిపాదన తెచ్చారు. నిజంగా పదిహేను వందల ఎకరాలు కేటాయించి కట్టుకోమని భూములిస్తే.. సినీ పెద్దలు ఖచ్చితంగా కట్టుకునే అవకాశం ఉంది. ఆ భూముల్లో సెట్టింగ్లు వేసి.. స్టూడియోలుగా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భూమి శాశ్వతం. ఈ విషయంలో కేసీఆర్ ఆరేళ్ల తర్వాత రెండో సారి స్పందించారు. మళ్లీ ముందడుగు ఎప్పటికే పడుతుందో.. ఎవరికీ తెలియదు.