తెలుగు సినిమా అంటే స్టార్ హీరోలే అనుకోవడానికి వీల్లేదు. యువ కథానాయకులూ అప్పుడప్పుడూ సంచలనాలు సృష్టిస్తుంటారు. బడా సినిమాలకు సైతం చుక్కలు చూపిస్తుంటారు. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. హీరో ఎవరైనా వాళ్లకు అభ్యంతరం లేదు.. సినిమా బాగుంటే చాలు. చూస్తున్నారు, కాసుల వర్షం కురిపించుకొంటున్నారు. మనకున్న అగ్ర హీరోలు ఓ అరడజనుమందే! సంవత్సరానికి 150 సినిమాలు తయారవుతుంటాయి. అన్ని సినిమాలూ.. అన్ని కథలూ టాప్ హీరోల కోసమే కాదు కదా? చిన్న, మీడియం రేంజు సినిమాలూ పరిశ్రమకు కీలకమే. ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమ కళకళలాడుతూ సాగాలంటే మీడియం రేంజు హీరోలు ఫామ్‌లో ఉండాల్సిందే. కాబట్టి నాని, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్.. ఇలాంటి వాళ్ల చేతుల్లో ఎప్పుడూ సినిమాలుంటూనే ఉంటాయి. వాళ్లూ… తమ దూకుడుని చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఈ యేడాది యంగ్ హీరోల పరిస్థితేంటి? ఎవరికి ప్లస్ అయ్యింది..? ఎవరికి మైనస్ అయ్యింది? ఒక్కసారి రివైండ్ చేసుకొంటే…
యంగ్ హీరోల్లో ఈ యేడాది సూపర్ ఫామ్ లో ఉన్నది నానినే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్ను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ మూడూ డీసెంట్‌గానే ఆడాయి. జ్యో అత్యుతానందలో అతిథి పాత్రలో మెరిశాడు నాని. నేను లోకల్ కూడా ఈ యేడాదే రిలీజ్ అవ్వాల్సింది. కానీ.. వాయిదా పడింది. ఆ సినిమా కూడా వచ్చేసుంటే నాని ఖాతాలో ఈ యేడాది 5 సినిమాలు చేరేవి. హీరో రామ్ నుంచి ఈ యేడాది రెండు సినిమాలొచ్చాయి. నేను శైలజతో చాలా కాలం తరవాత ఓ డీసెంట్ హిట్ అందుకొన్నాడు రామ్. హైపర్కీ మంచి టాకే వచ్చినా.. ఆ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. గత యేడాది సూపర్ ఫామ్ లో ఉన్న సాయిధరమ్ తేజ్ నుంచి 2016లో రెండు సినిమాలొచ్చాయి. సుప్రీమ్ హిట్ లిస్టులో చేరితే, తిక్క అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2016 లో ఎక్కువ సినిమాలు చేసింది.. నారా రోహిత్. ఈ శుక్రవారం విడుదలవుతున్న అప్పట్లో ఒకడుండేవాడుతో కలుపుకొంటే అతన్నుంచి ఆరు సినిమాలొచ్చినట్టు. అందులో జ్యో అత్యుతానంద ఒక్కటే బాగా ఆడింది. సావిత్రి, శంకర, రాజా చేయివేస్తే.. ఇలా రోహిత్ ఏ సినిమా చేసినా కలసి రాలేదు.
నాగచైతన్యకీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆనందమే. ఎందుకంటే తన నుంచి వచ్చిన ప్రేమమ్ హిట్టయితే – సాహసం శ్వాసగా సాగిపో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలా ఓ హిట్టూ ఓ ఫ్లాపుతో లెక్క సరిపోయింది. నాగశౌర్యకు 2016 ఏమాత్రం కలసి రాలేదు. అబ్బాయితో అమ్మాయి, ఒక మనసు ఫ్లాప్ అయ్యాయి. జ్యో అచ్చుతానంద క్రిడిట్ అవసరాల శ్రీనివాస్ ఖాతాలో చేరిపోయింది. మంచు మనోజ్‌కీ ఏమాత్రం కలసి రాలేదు. ఎటాక్, శౌర్య బాక్సాఫీసు దగ్గర పల్టీలు కొట్టాయి. విష్ణు సినిమా ఆడోరకం ఈడోరకం ఓకే అనిపించుకొంది. రాజ్ తరుణ్కీ మిశ్రమ ఫలితాలొచ్చాయి. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తరుణ్ వేగానికి బ్రేకులు వేసింది. ఆడోరకం – ఈడోరకం హిట్‌తో తేరుకొన్నాడు. నాన్న – నేను – నా బోయ్‌ఫ్రెండ్స్ సినిమాలో గెస్ట్ రోల్లో మెరిశాడు తరుణ్.
వరుణ్ తేజ్ నుంచి సినిమా ఏదీ రాలేదు. కాకపోతే తాను మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ యేడాది సంక్రాంతికి పెద్ద హీరోలతో పోటీ పడి ఓ విజయాన్ని అందుకొన్నాడు శర్వానంద్. తన ఎక్స్‌ప్రెస్ రాజా.. హిట్ ఖాతాలో చేరిపోయింది. ఏళ్ల తరబడి వాయిదాలు పడుతూ విడుదలైన రాజాధిరాజా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో ఎవ్వరికీ తెలీదు. నరేష్, సునీల్లకూ 2016 ఏమాత్రం కలసి రాలేదు. నరేష్ సినిమా సెల్ఫీ రాజా కూడా హ్యాండిచ్చేసింది. సునీల్ నటించిన కృష్ణాష్టమి, ఈడు గోల్డెహె ఫ్లాప్ అయ్యాయి. జక్కన్నకు ఓ మాదిరి వసూళ్లు దక్కాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడాతో నిఖిల్, శ్రీరస్తు శుభమస్తు సినిమాతో అల్లు శిరీష్ విజయాల్ని అందుకొన్నారు. పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ… హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పుడు నిర్మాతల చూపు అతనిపై పడింది.
ఓవరాల్‌గా చూసుకొంటే.. యంగ్ హీరోల పరిస్థితి ఈ యేడు జస్ట్ యావరేజ్‌గా నడిచినట్టు. మరీ గొప్ప విజయాలేం సాధించలేదు. అలాగని తీసికట్టు సినిమాల్లో నటించలేదు. అయితే కొంతమంది కథల ఎంపికలో తప్పులు చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఫ్లాపుల నుంచి గుణపాఠాలు నేర్చుకొంటే.. భవిష్యత్తులో వీళ్లూ స్టార్ హీరోల జాబితాలో చేరొచ్చు. ఆ ప్రయాణానికి 2017 నాంది పలుకుతుందని ఆశిద్దాం.