ఈ సమ్మర్ స్పెషల్‌గా ప్లాన్ చేసుకొన్నారు మన స్టార్ హీరోలు. ఈసారి పెద్ద సినిమాల కొరత ఏమాత్రం ఉండడం లేదు. ఎందుకంటే నెలకో స్టార్ హీరో సినిమా బాక్సాఫీసు దగ్గర సందడి చేయబోతోంది. పెద్ద హీరో సినిమా అంటే మినిమం మూడు వారాలైనా హంగామా ఉంటుంది. సో.. ప్లానింగ్ పక్కానే ఉందన్నమాట. మార్చి 24న పవన్ కల్యాణ్ (కాటమరాయుడు) వస్తున్నాడు. ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదల అవుతోంది. మేలో 19న దువ్వాడ జగన్నాథమ్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక జూన్ సంగతి.. మహేష్ బాబు చూసుకొంటున్నాడు. 23న మహేష్ – మురుగదాస్‌ల సినిమా విడుదల కానుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్….ఇలా నెలలన్నీ స్టార్ హీరోలు పంచేసుకొన్నారన్నమాట. ఈమధ్యలో మీడియం రేంజు సినిమాలు ఎలాగూ హడావుడి చేస్తాయి. విడుదలకు ముందుగానే రిలీజ్ డేట్ చెప్పడం, చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేయడం టాలీవుడ్ లో కొత్త సంప్రదాయమే. దానివల్ల బయ్యర్లకు ఓ క్లారిటీ వస్తుంది.
సినిమా సినిమాకి మధ్య కనీసం రెండు వారాల సమయం ఉండడం ఆరోగ్యకరమైన పరిణామం. బాహుబలి లాంటి సినిమా వస్తోందటే… పెద్ద సినిమాలు సైతం వెనుకంజ వేయక తప్పదు. బాహుబలి 2 వల్లే.. మిగిలిన సినిమాలు పక్కా ప్లానింగ్‌తో వస్తున్నాయోమో అనిపిస్తోంది. ఎందుకంటే బాహుబలి సెగ తగలకూడదంటే.. దానికి ముందో, తరవాతో రావాలి. ఏప్రిల్ 28న బాహుబలి ఫిక్సయ్యింది కాబట్టి, అందుకు తగ్గట్టుగా తమ సినిమాల విడుదల తేదీ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశాయి మిగిలిన సినిమాలు. గతేడాది.. ఐపీఎల్ వేడిలో పెద్ద సినిమాల హంగామా అంతగా కనిపించలేదు. అయితే ఈసారి మాత్రం.. సినీ విందుకు ఏమాత్రం కొరత ఉండకపోవొచ్చు.