2017 క్యాలెండర్లో అప్పుడే మూడు నెలలు వెళ్లిపోయాయి. జనవరిలో సంక్రాంతి సినిమాలతో హడావుడి చేసిన టాలీవుడ్‌కి ఫిబ్రవరిలో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మార్చిలో అయితే ఏకంగా డింకీ కొట్టేసింది. తొలి రెండు నెలలతో పోలిస్తే… టాలీవుడ్ తీరు అధ్వానంగా తయారైంది. ఈనెలలో దాదాపుగా 20 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక్కటంటే ఒక్క హిట్టూ లేదు. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త కాస్త హడావుడి చేసినా.. అనుకొన్నంత మేర వసూళ్లు సాధించలేక పోయింది. గురుకి మాత్రం కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిందంతే.
ద్వారక, గుంటూరోడు, చిత్రాంగద, లక్ష్మీ బాంబ్, మా అబ్బాయి, నేనోరకం, పిచ్చగా నచ్చావ్, కన్నయ్య, సినీ మహాల్… ఇలా రావడానికైతే చాలా సినిమాలొచ్చాయి. వీటిలో అల్మోస్ట్ అన్నీ డిజాస్టర్లే. పవన్ కల్యాణ్ అభిమానులు ఆశలు పెంచుకొన్న కాటమరాయుడు కూడా బాక్సాఫీసుని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. తొలిరోజు వసూళ్లతో దుమ్ము రేపినా.. ఆ జోరు కొనసాగించలేకపోయింది. ఈ వారం గురు, రోగ్ వచ్చాయి. గురుకి పాజిటీవ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం నిలబడగలదు? ఎన్ని వసూళ్లు తెచ్చుకోగలదన్నది అనుమానమే. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా కాబట్టి… వసూళ్ల పరంగా గట్టెక్కొచ్చు. ఇక రోగ్‌కి బీభత్సమైన నెగిటీవ్ టాక్ వచ్చింది. బీ, సీ సెంటర్లలోనూ ఈ సినిమా ప్రభావం అంతంత మాత్రమే. మొత్తానికి మార్చిలో చిత్రపరిశ్రమ భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సివచ్చింది. మరీ ముఖ్యంగా కాటమరాయుడు ఎఫెక్ట్ నుంచి తేరుకోవడానికి బయ్యర్లకు చాలా టైమ్ పట్టేయొచ్చు.
ఏప్రిల్‌లో బాహుబలి 2దే హవా. బాహుబలిని దృష్టి లో ఉంచుకోవడం వల్ల.. పెద్ద సినిమాలేవీ బాహుబలికి ముందు 15 రోజులు.. తరవాత 15 రోజులు విరామం తీసుకొన్నాయి. అంటే.. బాహుబలి తప్ప ఈమధ్య కాలంలో పెద్ద సినిమా ఏదీ విడుదల కాకపోవొచ్చు. చెలియ, మిస్టర్ ఈ రెండు సినిమాలపై కాస్తో కూస్తో ఆశలున్నాయి. మణిరత్నం – కార్తిల చెలియా ఈనెల 7న రాబోతోంది. మిస్టర్ 14న వస్తున్నాడు. ఇక బాహుబలి 28న విడుదలకు సమాయాత్తం అవుతోంది. సో… బాక్సాఫీసు దగ్గర మెరుపులు చూడాలంటే.. బాహుబలి రావాల్సిందే.