ఈ సంక్రాంతి కి ఎప్పుడూ లేనంత హీట్ తగిలింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడం పండగని ముందే తెచ్చేసినంత సంబరాన్ని కలిగిస్తున్నా… సదరు హీరోల అభిమానులు మాత్రం `నువ్వా.. నేనా..` అనుకొంటూ సోషల్ మీడియాని అడ్డాగా చేసుకొని రెచ్చిపోతున్నారు. పరస్పరం కవ్వించుకొంటున్నారు. అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరూ `అన్ని సినిమాలూ బాగా ఆడాలి..` అని మొత్తుకొంటున్నా అభిమానులకు ఎక్కడం లేదు. దర్శకులు కూడా `ఈ పండగ అందరిదీ` అనే సంకేతాలు పంపుతున్నా.. చెవికి ఎక్కించుకోవడం లేదు. రెండు సినిమాలూ ఇంకా విడుదల కాలేదు.. అంతలోనే ఎన్నో నెగిటీవ్ టాక్‌లు పరస్పరం గుప్పించుకొంటున్నారు. రేపు సినిమా విడుదలయ్యాక ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం అవుతోంది. పోలీసు డిపార్ట్మెంట్కి ఇదో కొత్త తలనొప్పి. అందుకే `సోషల్ మీడియాలో సరస్పర దూషణలకు దిగితే.. చర్యలు తీసుకొంటాం` అంటూ వాళ్లూ హెచ్చరించేశారు. అయినా ఈ వాడినీ, వేడినీ కంట్రోల్ చేయడం కష్టమే అనిపిస్తోంది.
హీరోలు ఎన్ని చెప్పినా, పోలీసులు ఎన్ని విధాల హెచ్చరించినా మారాల్సింది అభిమానులే. ఇక్కడ సినిమా ముఖ్యం కాదు. అభిమానాన్ని ఎలా చూపించాం అన్నది ముఖ్యం కాదు. పరిశ్రమ ముఖ్యం. ఓ సినిమా హిట్టయితే పదిమందికి అన్నం దొరుకుతుంది. ఓ నిర్మాత మరో పది సినిమాలు తీయాలన్నంత ఉత్సాహం తెచ్చుకొంటాడు. పరిశ్రమలో తయారయ్యే ఒక్కో సినిమా వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. వాళ్లంతా పచ్చగా ఉండాలంటే సినిమా పరిశ్రమకి హిట్లూ సూపర్ హిట్లూ అవసరం. తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ని పెంచిన హీరోలు వాళ్లిద్దరూ. ఒకరు వంద సినిమాలు పూర్తి చేస్తే… మరొకరు ఏకంగా 150 సినిమాల మైలు రాయిని అందుకొంటున్నారు. దశాబ్దాలుగా తిరుగులేని ఎంటర్ టైన్మెంట్ అందించారు. ఈ పండక్కి… ప్రేక్షకుల్ని అలరించడానికే వస్తున్నారు. అలాంటి హీరోల్ని మనసారా స్వాగతించాల్సిందే. వాళ్లిద్దరినీ సాదరంగా ఆహ్వానించి.. మరోసారి ప్రోత్సహించాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులందరిదీ. నీ హీరో గొప్ప… నా హీరో గొప్ప.. అని కొట్టుకోకుండా.. సినిమాని సినిమాగా ప్రేమిద్దాం. సినిమా నచ్చితే చూడండి.. పది మందికి చెప్పండి. అంతేగానీ.. వెర్రి అభిమానం పేరుతో పరస్పరం దూషించుకోవడం ఎందుకు?? ఈ రెండే కాదు.. ఈ పండక్కి వస్తున్న మరో రెండు సినిమాల్నీ ఆదరిద్దాం.. ఈ సంక్రాంతి పండగని మరింత సంబరంగా చేసుకొందాం!!