తెలుగు సినిమా స్టామినా యేటా పెరుగుతూనే ఉంది. ఒకదాన్ని మంచి మరో సినిమా వస్తూనే ఉంది. ఇది వరకు వంద కోట్ల సినిమా అంటే.. దాన్నో అద్భుతంగా చూసేవాళ్లు. ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ఓ పెద్ద సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడం సర్వసాధారమైన విషయంగా మారిపోయింది. వంద దాటి, ఐదొందలు చూసి, వెయ్యి కోట్లపై విజయ పతాక ఎగరేసి, పది హేను వందల కోట్ల అంతు చూసి, రెండు వేల కోట్లపై దిగ్విజయంగా నిలబడిన ‘బాహుబలి 2’ మన తెలుగు సినిమా కావడం – తెలుగువాళ్లందరికీ గర్వకారణమైన విషయం. రెండు వేల కోట్ల అంచుని చూసిన తెలుగు సినిమా ముందు మిగిలిన ఫలితాలు, వసూళ్లూ చిన్నవిగానే కనిపించినా వాటి సత్తాని తక్కువ అంచనా వేయకూడదు. తెలుగు బాక్సాఫీసు దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించి భవిష్యత్తుపై ఆశలు చిగురింప జేశాయి. ఆ టాప్ బ్లాక్ బ్లస్టర్ హిట్స్ ఏమిటో మరోసారి గుర్తు చేసుకుంటే…
భారతీయ చలచ చిత్రసీమలో కొత్త అధ్యాయం సృష్టించిన చిత్రం బాహుబలి. దాదాపు వేయి కోట్లతో తొలి భాగం సంచలనం సృష్టిస్తే.. రెండో భాగం రెండాకులు ఎక్కువే చదివింది. ఏకంగా రూ.2వేల కోట్ల రూపాయలతో కనీ వినీ ఎరుగని రికార్డుల్ని తన ఖాతాలో వేసుకొంది. సినిమా విడుదలై రెండు నెలలు గడిచేదాకా… బాలీవుడ్ ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు సైతం బాహుబలి గురించే మాట్లాడుకున్నారు. ఇప్పటికీ బాహుబలి అంటే… అక్కడ ఓ బ్రాండ్! తెలుగునాట మరే చిత్రం ఈ రికార్డుల దరి దాపుల్లోకి కూడా వెళ్లదు.. వెళ్లలేదు అనే సంగతి రూఢీ అయిపోయింది. అందుకే ‘నాన్ బాహుబలి రికార్డులు’ అంటూ కొత్త పదం మొదలైంది. బాహుబలి రికార్డుల్ని ఎలాగూ కొట్టలేరు కాబట్టి.. రెండో స్థానంలో ఉండి, సంబరపడిపోతున్నాయి మిగిలిన సినిమాలు. ఇక ఈ సినిమా గురించి ఇంకేం చెప్పగలం..?
ఈయేడాది తొలి బ్లాక్ బ్లస్టర్ అందించిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. ఖైది నెం.150… అక్షరాలా రూ.150 కోట్లు సాధించి చిరంజీవి స్టామినాని మరోసారి తేటతెల్లం చేశాయి. చిరు క్రేజ్, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమాతో రుజువైపోయింది. ఖైది నెం.150 ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే ‘సైరా నరసింహారెడ్డి’కి శ్రీకారం చుట్టాడు చిరు. ఈ సినిమాపై రూ.150కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది కచ్చితంగా ఖైదీ రిజల్ట్ ఫలితమే. సంక్రాంతికే విడుదలైన బాలయ్య సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సూపర్ హిట్ ఖాతాలో వేసుకోవాల్సిందే. చారిత్రక నేపథ్యం ఉన్న కథ ఇది. దాన్ని క్రిష్ తెరపైకి తీసుకొచ్చిన విధానం, అందులోని బాలయ్య సంభాషణలు సాహోరే… అనిపించాయి. దాదాపు రూ.60 కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం.
చిన్న సినిమాలు.. పెద్ద విజయాలు. ఈ ట్యాగ్ లైన్ ‘ఫిదా’, ‘అర్జున్ రెడ్డి’లకు సరిపోతాయి. శేఖర్ కమ్ముల మ్యాజిక్ మరోసారి వెండి తెరపై చక్కటి ఫలితాన్ని అందుకొంది. రూ.15 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్లు తెచ్చుకుంది. నైజాంలో అయితే… ఓ అగ్ర కథానాయకుడి చిత్రానికి ధీటుగా వసూళ్లు అందుకొంది. ఇక అర్జున్ రెడ్డి గురించి ఏం చెబుతాం?? అదో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. రూ.4 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపు పాతిక కోట్లు ఆర్జించింది. విడుదలకు ముందే కాదు, తరవాత కూడా అర్జున్ రెడ్డి వార్తల్లోకి ఎక్కింది.
మొత్తానికి 2017 తెలుగు చిత్రసీమకు ఎన్నో మరపురాని విజయాల్ని అందించింది. స్టార్ హీరోలు తమ స్టామినా నిరూపిస్తే… కుర్ర హీరోలు సత్తా చాటారు. ఇదే జోరు 2018లోనూ కొనసాగితే… తెలుగు చిత్రసీమ పంట పండినట్టే.