‘కష్టం మాత్రమే మా చేతుల్లో ఉంది.. జయాపజయాల్ని మేం శాశించలేం..’ – అనేది చిత్రసీమ తరచూ చెప్పేమాట. అది నిజమే కావొచ్చు. విజయాల్ని ఎవ్వరూ ప్లాన్ చేసుకోలేరు. అలా చేసుకోగలిగితే.. ప్రతీ సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల మోత మోగించేసేదే కదా? జయాపజయాలు దైవాదీనాలు. ఎప్పుడు ఏ సినిమా ఎవరెస్టుపై కూర్చోబెడుతుందో, ఎప్పుడు ఏది పాతాళానికి తొక్కేస్తుందో చెప్పలేం. హిట్టు కావల్సినంత బూస్ట్ ఇస్తే.. ఫ్లాపు నిరాశకు, నైరాశ్యానికీ గురి చేస్తుంది. ఒక్క ఫ్లాపు ఎంతోమంది కెరీర్లని ప్రభావితం చేస్తుంది. నిర్మాతల్ని, పంపిణీదారుల్ని రోడ్డున పడేస్తుంది. అలాంటి సినిమాలు 2028లోనూ ఎక్కువే వచ్చాయి. కారణాలు ఏమైనా సరే – ఈ పరాజయాలు పరిశ్రమని కుదిపేశాయి. టికెట్టు కొన్న ప్రేక్షకుడికి తలనొప్పి మిగిల్చాయి.
2018 ప్రారంభంలోనే ఓ బ్లాక్ బ్లస్టర్ ఫ్లాప్ తగిలింది. అజ్ఞాతవాసి రూపంలో. అత్తారింటికి దారేది తరవాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. పైగా టైటిల్, పోస్టర్లు, ట్రైలర్లు… ఇవన్నీ అభిమానుల్ని బాగా మురిపించాయి. విడుదలకు ముందే దాదాపుగా రూ.100 కోట్ల వ్యాపారం జరుపుకుందీ సినిమా. అయితే… బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. సరైన కథ లేకపోవడం, కథనం సాదా సీదాగా సాగడం, త్రివిక్రమ్ మ్యాజిక్ తెరపై కనిపించకపోవడం.. ఇవన్నీ కలసి ఈ సినిమాని డిజాస్టర్ చేశారు. తొలి రోజు వసూళ్లతో బాక్సాఫీసు దుమ్ము దులిపినా.. ఆ జోరు మరుసటి రోజు కనిపించలేదు. దాంతో పంపిణీదారులు తీవ్రంగా నష్టపోవాల్సివచ్చింది. ఆ నష్టాన్ని పవన్, త్రివిక్రమ్‌లు కూడా భరించారు.
జనవరిలో అజ్ఞాతవాసి ఫ్లాప్ అయితే.. ఫిబ్రవరిలో టచ్ చేసి చూడు… వాటాకొచ్చింది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏ వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ కథ, కథనాలతో విసిగించింది. పాటల్లోకూ కిక్ లేదు. ఈ సినిమాతోనూ బయ్యర్లు బాగా నష్టపోయారు. ఖైది నెం.150 తరవాత వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా.. ‘ఇంటిలిజెంట్‘. సాయిధరమ్ తేజ్ కెరీర్లో మరో అట్టర్ ఫ్లాప్ ఇది. వినాయక్ నుంచి ఇంత పేలవమైన సినిమా సగటు సినీ అభిమాని కూడా ఊహించలేడు. ఆ సినిమా తరవాత వినాయక్ మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లలేకపోయాడంటే… ఈ సినిమా పరిస్థితేంటో ఊహించుకోవొచ్చు. పవన్ నిర్మాత, త్రివిక్రమ్ కథ అంటూ ఊరించిన.. ‘ఛల్ మోహన రంగ‘ రెండో రోజుకే చల్లబడిపోయాడు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫ్లాపుల జాబితాలో చేరింది. ‘లై‘ తరవాత నితిన్ కెరీర్లో మరో అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని విజయ పరంపరకు బ్రేకులు వేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం‘. నాని రెండు పాత్రలు పోషించినా.. ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందివ్వలేకపోయాడు. ‘ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది’ అంటూ నానినే స్వయంగా ఒప్పుకోవడం.. ఈ సినిమా స్థాయికి నిదర్శనం. విష్ణు నటించిన `ఆచారి అమెరికా యాత్ర` ఎప్పుడు వచ్చిందో. ఎప్పుడు వెళ్లిందో కూడా చెప్పలేని పరిస్థితి.
చిత్రసీమకు కీలకమైన వేసవి సీజన్లో… ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా‘ రూపంలో ఓ పెద్ద దెబ్బ తగిలింది. ‘పాన్ ఇండియా’ అనే ఇమేజ్ కోసం తహతహలాడిన అల్లు అర్జున్ కెరీర్‌ని నాలుగు అడుగులు వెనక్కి వేసేలా చేసింది ఈ ఫ్లాప్. అయితే ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపిస్తూనే ఉన్నా – అభిమానులు సైతం కనికరించలేదు. ‘నేల టికెట్‘ రూపంలో రవితేజకు ఈ యేడాది మరో ఫ్లాప్ ఎదురైంది. తొలి సినిమాతో తెచ్చుకున్న క్రేజ్ మొత్తం కల్యాణ్ కృష్ణ.. ఈ సినిమాతో పాడు చేసుకున్నాడు. రవితేజ సినిమా అంటే మాస్లో మంచి క్రేజ్. అక్కడ కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది. కల్యాణ్ రామ్ నుంచి వచ్చిన ‘నా నువ్వే‘, నాగ్ – వర్మల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆఫీసర్‘ డిజాస్టర్ల లిస్టులో చేరిపోయాయి. గోపీచంద్ కెరీర్లో ఈ యేడాదీ మార్పు లేదు. ‘తేజ్ ఐ లవ్ యూ‘, ‘సాక్ష్యం‘ చిత్రాలూ.. నిర్మాతలకు చేదు అనుభవాల్ని మిగిల్చాయి. నితిన్ కెరీర్లో మరో భారీ ఫ్లాపుగా ‘శ్రీనివాస కల్యాణం‘ నిలిచింది. దిల్‌రాజు ఈసారి ఓ టీవీ సీరియల్‌ని తలపించే సినిమా తీశాడు. ఇది దిల్ రాజు బ్యానర్‌కే పెద్ద ఎదురు దెబ్బలా నిలిచింది. నాగశౌర్య ‘నర్తనశాల‘ కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు ఈ సినిమాతో బాగా నష్టపోయారు. విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా కాపాడలేకపోయిన సినిమా ‘నోటా‘. ‘అమర్ అక్బర్ ఆంటోనీ‘, ‘సవ్యసాచి‘, ‘కవచం‘ ఇలా… యేడాది చివర్లోనూ భారీ పరాజయాలు పరిశ్రమకు షాక్‌కి గురి చేశాయి. విడుదలకు ముందు బాగా హడావుడి చేసిన సినిమాలు సైతం… కనీస ఓపెనింగ్స్ లేక డీలా పడ్డాయి. చాలామంది హ్యాట్రిక్ ఫ్లాపులు చవి చూశారు. ఈ పరాజయాల వల్ల… పరిశ్రమ తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సివచ్చింది.