భారత రాజకీయాల్లో ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా ఢీకొట్టబోయేది ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలే. బెంగళూరులో ప్రాంతీయ పార్టీల అధినేత చూపించిన పట్టుదలే దీనికి సాక్ష్యం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రాంతీయ పార్టీల కూటమికి బెంగుళూరులో మొదటి అడుగు పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రాంతీయ పార్టీలన్నీ… తమ బలాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించాయి.
ప్రాంతీయ పార్టీలన్నీ ఓ కూటమిలా ఏర్పడాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాంతీయ పార్టీల అధినేతలను చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఉండాలని అందరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. రాష్ట్రాల హక్కుల కోసం అందరూ పోరాడాలని నిర్ణయించారు. మోదీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల నేతలంతా ఏకమయ్యారన్న సూచనలు దేశ ప్రజల్లోకి పంపేందుకు వ్యూహాత్మకంగా నేతలంతా ఈ వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రయత్నం ప్రస్తుతానికి మంచి ఫలితాలే ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెట్టి.. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే బాగుంటుదన్న అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లోనూ వచ్చింది. ఎన్నికల సమయానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసేందుకు తమ కార్యాచరణ కొనసాగుతుందని మమతాబెనర్జీ, చంద్రబాబు ప్రకటించారు.
కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరు కాని ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్, బీజేడీ, శివసేన ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేడీ మాత్రం… కేంద్రంతో కొన్ని అంతర్గత ఒప్పందాల వల్ల హాజరు కాలేకపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇక శివసేన.. నేరుగానే బీజేపీపై తిరుగుబాటు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం..మోదీకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట… మాత్రం అడ్వాంటేజ్ ఎవరికి వస్తుందన్నది కీలకంగా మారబోతోంది.