టాలీవుడ్లో ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఓ సీజన్లో ప్రేమకథలు వరుస కడితే, మరోసారి రీమేక్‌లు జోరుగా వస్తాయి. ఇప్పుడు బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అయితే అతి త్వరలో స్పోర్ట్స్ డ్రామాల సీజన్ మొదలవ్వబోతోంది.
స్పోర్ట్స్ డ్రామా అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. ఓ క్రికెటర్ జీవితం, ఓ కబడ్డీ వీరుడి కథ, ఓ బాక్సింగ్ యోధుడి అనుభవాలు తెలుసుకోవడంలో ప్రేక్షకుడికి ఆసక్తి ఉంటుంది. దానికి కొన్ని కమర్షియల్ హంగులు జోడిస్తే…సినిమా తయారైపోతుంది. అయితే.. తెలుగులో స్పోర్ట్స్ డ్రామాని వాడుకున్నది చాలా తక్కువనే చెప్పొచ్చు. హీరో సరదాగా క్రికెట్ ఆడడం చూపిస్తారేమో గానీ, దాన్ని సీరియస్ ప్రొఫెషన్ గా మార్చరు. కబడ్డీ కబడ్డీ, భీమిలి కబడ్డీ జట్టు.. ఇవి రెండూ కబడ్డీ నేపథ్యంలో సాగుతాయి. మహేష్ బాబు `ఒక్కడు` కీ కబడ్డీ టచ్ ఉంటుంది. వసంతంలో వెంకటేష్‌ని క్రికెటర్‌గా చూపించారు. ఇటీవల విడుదలైన వెంకటేష్ `గురు` బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ. గోల్కొండ హైస్కూల్ క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా అంటే ఇవే అనాలి.
2019లో మాత్రం స్పోర్ట్స్ డ్రామాలు వరుస కడుతున్నాయి. నాని, వరుణ్‌తేజ్, నాగచైతన్య, సందీప్‌కిషన్ ఈ తరహా కథల్ని ఎంచుకున్నారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `జెర్సీ`. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. రిటైర్ అయిపోవాల్సిన వయసులో క్రీడాకారుడిగా ఎదగాలని తపన పడే ఓ ఫెయిల్యూర్ క్రికెటర్ కథ ఇది. సినిమా మొత్దం క్రికెట్ నేపథ్యంలోనే సాగుతుంది. త్వరలోనే వరుణ్‌తేజ్ బాక్సింగ్ బరిలో దిగబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో వరుణ్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ ఓ బాక్సర్‌గా దర్శనమివ్వబోతున్నాడు. నాగచైతన్య – సమంత జంటగా నటిస్తున్న చిత్రం `మజిలి`. ఇదో ప్రేమకథ. అయితే కథానాయకుడ్ని మాత్రం క్రికెటర్‌గా చూపించబోతున్నారు.
సందీప్‌కిషన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సంతోష్ జాగర్లమూడి దర్శకుడు. ఇది కూడా స్పోర్ట్స్ డ్రామానే. గురు శిష్యుల అనుబంధం చాటే చిత్రమిది. సందీప్ గురువుగా ఓ ప్రముఖ నటుడు కనిపించనున్నాడు. అటు తమిళంలోనూ స్పోర్ట్స్ కథలు తయారవుతున్నాయి. అట్లీ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు. ఆ సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదల అవుతుంది.