2018 వెళ్లిపోయింది. ఇక ఆశలలు అంచనాలన్నీ 2019పైనే. ఇప్పటికే ప్రేక్షకుల చూపుని తమ వైపుకు లాగేసుకున్నాయి కొన్ని సినిమాలు. అవన్నీ అద్భుతాలు సృష్టిస్తాయని, అఖండ విజయాల్ని అందుకుంటాయని సినీ అభిమానుల ఆశ. 2019లో విడుదల కాబోతున్న కీలక చిత్రాలేంటి..? వాటిపై ఉన్న అంచనాలేంటి? వాటి బలాబలాలేంటి? అనేది ఓసారి పరిశీలిస్తే…
ఎన్టీఆర్ బయోపిక్
2019లో బయోపిక్‌ల జాతర జరగబోతోంది. ఒక్క ఎన్టీఆర్ పేరుతోనే రెండు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. వాటిలో అందరి దృష్టి.. `ఎన్టీఆర్` (కథానాయకుడు, మహానాయకుడు) పైనే. ఒకేసారి రెండు భాగాలు పూర్తి చేయడం ఈ బయోపిక్ప్రత్యేకత. ఇప్పటి వరకూ ఎవరి బయోపిక్ ఇలా రెండు భాగాలుగా తీర్చిదిద్దలేదేమో. క్రిష్ దర్శకుడు కావడం, ఎన్టీఆర్ పాత్రని బాలయ్య పోషించడం, అటు సినీ, ఇటు రాజకీయం రెండు జీవితాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వడం, టాలీవుడ్లో పేరెన్న దగిన నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడం.. ఇలా ఎలా చూసినా.. `ఎన్టీఆర్` బయోపిక్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఎన్టీఆర్‌ని తెలుగువాళ్ల ఆత్మ గౌరవానికి ప్రతీకగా చూస్తారు అభిమానులు. ఆయన కథంటే కచ్చితంగా ఆసక్తి కరబరుస్తారు. ఇంటిల్లిపాదీ మళ్లీ సినిమాల తరలిరావడం.. ఈ సినిమాతో చూడొచ్చన్నది చిత్రబృందం నమ్మకం. పైగా బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్లో ఈ సినిమా విడుదల అవుతోంది. ఏ రకంగా చూసినా… `ఎన్టీఆర్` బయోపిక్… సంచలనాలకు కేంద్ర బిందువు అవ్వబోతోందని చెప్పొచ్చు.
లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఇది రెండో కోణం. క్రిష్ తెరకెక్కిస్తున్న బయోపిక్‌లో లేనిది.. `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో ఉంటుందన్నది వర్మ చెబుతున్న మాట. సంచలనం ఎక్కడుంటే అక్కడ వర్మ ఉంటాడు. తన సినిమాలోనూ అలాంటి అంశాలే ఉంటాయి. వర్మ ఫామ్ కోల్పోయి చాలా కాలం అయ్యింది. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో స్టార్లకు చోటు లేదు. కేవలం వర్మ కోసమో, లేదంటే.. ఎన్టీఆర్‌ని వర్మ ఏ కోణంలో చూపించాడన్న ఆసక్తితోనో ఈ సినిమా చూస్తారు. కాబట్టి.. ఆ రకంగా ప్రేక్షకుల దృష్టిని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆకర్షించబోతోంది.
సాహో
బాహుబలి తరవాత ప్రభాస్ రేంజ్ ఆకాశాన్ని తాకింది. బాహుబలి తరవాత తన నుంచి సినిమా ఏదీ రాలేదు. 2018 క్యాలెండర్ మొత్తం ఖాళీగా పంపేశాడు ప్రభాస్. కానీ 2019లో మాత్రం ఆ బాకీ తీర్చేయడానికి సిద్ధం అవుతున్నాడు. సాహో ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఇదో యాక్షన్ డ్రామా. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఘట్టాల్ని తీర్చిదిద్దారు. ఈ సినిమాకి 200 కోట్ల బడ్జెట్ కేటాయించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ తన ఫామ్ ని ఏ రకంగా కంటిన్యూ చేస్తాడన్నది కీలకంగా మారింది. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. `సాహో`తోనూ ప్రభాస్ నిరూపించుకుంటే, బాహుబలిలా మ్యాజిక్ చేయగలిగితే.. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ స్టార్ రేంజ్‌కి ఎదిగిపోవడం ఖాయం.
సైరా
ఖైది నెంబర్ 150తో చిరంజీవితో ఆత్మవిశ్వాసం పెరిగింది. తన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ బాక్సాఫీసు దగ్గర షేక్ చేసే సత్తా చిరులో ఉందని ఈ సినిమా నిరూపించింది. అందుకే `సైరా`కి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి చిరు `సై` అనేశాడు. బాహుబలి తరవాత తెలుగులో ఆస్థాయి సాంకేతిక విలువలు, బడ్జెట్‌తో తీర్చిదిద్దుతున్న సినిమా ఇదే. అమితాబ్ బచ్చన్ లాంటి మెరుపు కూడా సైరాకి తోడైంది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరవాత ఆగస్టు 15 కి విడుదల చేద్దామనుకున్నారు. దసరాకి ఈ సినిమా షిఫ్ట్ అయ్యే ఛాన్సుంది. అంతగా కాకుండా.. 2020 సంక్రాంతికి విడుదల చేస్తారు. కాకపోతే చిరు మాత్రం ఈ చిత్రాన్ని 2019లోనే విడుదల చేయాలని భావిస్తున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం లేకపోతే ఈ యేడాదే సైరాని చూడొచ్చు.
మహర్షి
భరత్ అనే నేనుతో మహేష్ బాబు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. వరుస పరాజయాలకు భరత్ బ్రేక్ ఇచ్చింది. వంద కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. 2019లో మహేష్ నుంచి రాబోతున్న సినిమా ‘మహర్షి’. సామాజిక నేపథ్యంతో సాగే కమర్షియల్ సినిమా ఇది. ఈ ఫార్ములా మహేష్‌కి బాగా అచ్చొచ్చింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను.. ఇలాంటి కథలే కదా..? వంశీ పైడి పల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేసవి సీజన్లో విడుదలయ్యే భారీ చిత్రమిదే కావడం విశేషం.