మరో పది రోజుల్లో బాక్సాఫీసు క్యాలెండర్ మారిపోతుంది. ఇక 2019 చరిత్ర. మరి టాలీవుడ్ సినిమాకి 2019 ఎలాంటి విజయాల్ని ఇచ్చింది? కాసుల వర్షం కురిపించిన సినిమాలేంటి ? థ్రిల్ చేసిన సినిమాలేవి? చరిత్ర సృష్టించిన సినిమాలేవైన ఉన్నాయా? ఒక్కసారి రివైండ్ చేసి చూస్తే..
ఎఫ్ 2 :
ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఎఫ్2’ అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. సాలిడ్ సంక్రాంతి సినిమాగా నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజులు కలసి చేసిన సందడి ప్రేక్షకులని కితకితలు పెట్టింది. వినోదం నిండిన ఈ సినిమా బాక్సాఫీసు వర్షం కూడా కురిపించింది. ”మా సినిమాల్లో ఎక్కవ లాభం తెచ్చిపెట్టిన సినిమా ఎఫ్ 2 నే”అని స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజీ క్లబ్ లో చేరాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా పట్టేశాడు. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో సందడి చేయడానికి సిద్ధంగా వున్నాడు. టోటల్ గా ఎఫ్ 2 ఈ ఏడాది మెమరబుల్ హిట్.
మహర్షి:
వరుసగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్.. ఈఏడాది కూడా వీకెండ్ వ్యవసాయం అంటూ ‘మహర్షి’ సినిమా చేశాడు. రైతుల గొంతు వినిపించాడు. మెసేజ్ కి కమర్షియల్ కొలతలు అద్దిన మహర్షి సినిమా ప్రేక్షులని బాగానే మెప్పించింది. సోషల్ మెసేజ్ వున్న థీమ్‌ని కమర్షియల్ పంథాలో చెప్పడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కి మంచి మార్కులే పడ్డాయి. పాటలు కూడా అలరించాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలోనే మహర్షి కూడా హిట్ ఫోల్డర్ లోకి వెళ్ళింది. నిర్మాతలు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే మహర్షి రూపాయి వెనక్కి వేసుకున్న సినిమాగానే నిలిచింది.
సైరా:
చిరంజీవికి చాలా హిట్లు వున్నాయి. బ్లాక్ బస్టర్ లు వున్నాయి. ఐతే కృష్ణకి అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లకు ‘మాయబజార్’ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చిరు ట్రాక్ లిస్ట్ లో లేవు. అలా ఎప్పటికీ నిలిచిపోయే హిస్టారికల్ సినిమా చేయాలని తెరపైకి తీసుకొచ్చారు ‘సైరా’. బిజినెస్ మాట పక్కన పెడితే చిరు కెరీర్ లో హిస్టారికల్ మూవీగా నిలిచింది సైరా. ప్రేక్షకులని సంతృప్తి పరచడంలో, నరసింహారెడ్డిని చిరస్మరణీయం చేయడంలో, ప్రేక్షకులని భావోద్వేగానికి లోను చేయడంలో, దేశభక్తిని ప్రబోధించి మరోమారు మహనీయులందరినీ స్మరించుకునేట్టు చేయడంలో విజయం సాధించింది సైరా. నటుడిగా చిరంజీవి ని మరో స్థాయిలో నిలబెట్టిన సినిమాగా నిలిచింది.
ఇస్మార్ట్ శంకర్:
పూరి జగన్నాధ్ సినిమాలో మాస్ కి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఐతే ఈసారి మాత్రం కేవలం మాస్ నే ద్రుష్టిలో పెట్టుకుని ఓ సినిమా తీశాడు.. అదే ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ ని ఊర మాస్ హీరోగా రెడీ చేసి.. బండికి బ్రేకులు తీసి పరిగెత్తించాడు. ఐతే ఆ బండి సేఫ్ పార్కింగ్ లోనే ఆగింది. టార్గెట్ ఆడియన్స్ కి నచ్చింది. పూరి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని కితాబిచ్చారు మాస్ ఆడియన్స్. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. నిర్మాతగా కూడా రిలాక్స్ అయ్యాడు పూరి. మొత్తానికి ఏడాది ఊరమాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్.
మజిలీ:
వెండితెరపై ప్రేమ కథ.. ఎవర్ గ్రీన్ ఫార్ముల. ఎన్ని ప్రేమ కధలు వచ్చినా మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రేక్షకులను ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. అలా ఈ ఏడాది వచ్చిన మరో మెచ్యూర్ లవ్ స్టోరీ మజిలీ. ప్రేయసికి దూరమైన ప్రేమికుడు, భర్త ప్రేమని పొందాలనుకున్న భార్య.. వీళ్ళ మధ్య జరిగిన కథ ప్రేక్షకులని అలరించింది. చైతు, సామ్ లది హిట్ జోడి అని మరోసారి రుజువు చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి కలసి నటించిన ఈ జంటకి ‘మజిలీ’ ఓ తీపి గురుతుగా మిలిగింది.
జెర్సీ:
కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటాయి. కొన్ని సినిమాలకి డబ్బులు వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలా ముద్ర వేసుకున్న సినిమా ‘జెర్సీ’. జేర్సీ కేవలం ఒక సినిమా కాదు. దర్శకుడు గౌతమ్ తెరపై జీవితాన్ని ఆవిష్కరిస్తే… నాని ‘అర్జున్’ పాత్రకి ప్రాణం పోసాడు. తెరపై నాని కాకుండా ఒక ఫెయిల్డ్ క్రికెటర్, కొడుకు కనీస అవసరాలు తీర్చలేకపోతున్న ఒక అసమర్ధపు తండ్రిగా కనిపించి మెప్పించాడు. కొడుకు కళ్లల్లో ఒక ఫెయిల్యూర్‌గా మిగిలిపోకుండా అతనికి ఎప్పటికీ హీరోలా నిలిచిపోవాలని తపించే ఓ తండ్రి కథగా వచ్చిన జెర్సీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
గద్దలకొండ గణేష్ :
‘దబాంగ్’ని తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ శంకర్.. ఈసారి ‘జిగర్తాండ’ అనే క్లాసిక్ క్రైమ్ కామెడీని ‘గద్దల కొండ గణేష్’గా రీమేక్ చేసాడు. ‘జిగర్తాండ’ ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ క్రైమ్ కామెడీ. తెలుగులో కూడా ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది. ఎప్పుడూ హీరో వేషాలే వేస్తూ వుంటే దాంట్లో ఛాలెంజ్ ఏముంటుంది? అందుకే .. తనని ఇంతవరకు జనం చూసిన దానికి భిన్నంగా కనిపించడానికి వరుణ్ సాహసించాడు. దిని కోసం విలన్ అయ్యాడు. అయితే అ విలనీ ప్రేక్షకులకి నచ్చింది. వెరసి.. వరుణ్ ఎఫ్ 2 తర్వాత ఈ ఏడాదే మరో హిట్ పడింది. వరుణ్ తేజ్ అద్భుతమైన అభినయం, కమర్షియల్ మీటర్లో సాగే సన్నివేశాలు, కాలక్షేపానికి లోటు లేని వినోదంతో ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పాసైపోయింది.
ఓ బేబీ
సమంత మంచి నటి అనేది ఇదివరకే పలు చిత్రాల్లో తెలిసింది. అయితే ఓ బేబీ ఆమెని మరో మెట్టు ఎక్కించింది. ఇరవై నాలుగేళ్ల యువతిగా అదే సమయంలో డెబ్బయ్ ఏళ్ల బామ్మలా అనిపించి మెప్పించింది. బామ్మ పాత్రలో సమంత పరకాయ ప్రవేశం చేసింది. తెరపై నిజంగా జీవితమే ఆవిష్కృతం అవుతోన్న భావన కలిగించడంలో బేబీ సక్సెస్ అయ్యింది. కొరియన్ చిత్రంకి రీమేక్ ఇది. ఆ సినిమా ఆత్మని క్యాచ్ చేసి ఎమోషన్స్‌ని అద్భుతంగా మళ్లీ పండించగలిగింది దర్శకురాలు నందిని రెడ్డి. ఇక ఈ సినిమా మాటలకి కూడా మంచి పేరొచ్చింది. బాక్సాఫీసు లెక్క కూడా బావుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ
చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. మిస్టరీ చేధించే డిటెక్టివ్ కథ ఇది. మిస్టరీ జోనర్లో సస్పెన్స్‌ని హోల్డ్ చేయడం కీలకం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈ విషయంలో సక్సెస్ అయ్యింది. నవీన్ పొలిశెట్టి అంతగా తెలియని నటుడయినా కానీ అతనిలో టాలెంట్‌కి లోటు లేదని ఈ సినిమాతో తెలిసింది. దర్శకుడు స్వరూప్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికి కొత్త వాళ్లతో తీసిన ఒక చిన్న సినిమాకి ఊహించిన విజయం ఇచ్చారు ప్రేక్షకులు.
వెంకీ మామ:
నిజ జీవితంలో మేనమామ-మేనల్లుడు అయిన వెంకటేష్, చైతన్య తెరపై కూడా అదే సంబంధంతో కనిపించారు ‘వెంకీ మామ’లో. వీరిద్దరికీ నప్పే కధని సెట్ చేశాడు దర్శకుడు బాబీ. అయితే ఈ కధ మరీ ఇంత గొప్పగా లేదు. చాలా మంది విమర్శకులు సినిమాపై పెదవి విరిచారు. అయితే వెంకీని, ఫ్యామిలీ సినిమాలు చూసే ఆడియన్స్ మనసు గెలుచుకుంది వెంకీమామా. ముఖ్యంగా వెంకీ నటన సినిమాకి మేజర్ హైలెట్. విలేజ్ నేపధ్యం, మాస్ కామెడీ ని ఇష్టపడే ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. వసుళ్ళూ కూడా బావున్నాయి.