టాలీవుడ్ ఇప్పుడు యువ హీరోలతో మెరుస్తుంది. బడా హీరోలు ఏడాదికి ఒక సినిమాతో సరిపెట్టుకునే పరిస్థితి. అయితే సినిమాలు అందించే లోటును యవ హీరోలు తీరుస్తున్నారు. వైవిధ్యం వైపు అడుగులు వేస్తూ.. కొన్ని విజయాలు, అపజయాలు, ఇంకొన్ని పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ ఏడాది కూడా యువ హీరోల సందడి బాగానే వుంది. ఒక్కసారి.. 2019 యువ హీరోల ట్రాక్ లిస్టు లోకి వెళితే..
నాని :
నానికి 2019 మెమరబుల్ ఇయర్. నాని కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు వున్నాయి. కానీ ఈ ఏడాది చేసిన ‘జెర్సీ’ సినిమా ఒకరకంగా క్లాసిక్ అనుకోవాలి. నటుడిగా వంద శాతం ఆనందపడ్డాడు నాని. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘నాని సూపర్’ అని కితాబిచ్చారు. హృదయాన్ని తాకే సినిమాగా నిలిచింది జెర్సీ. ఐతే ఈ సినిమా తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ మాత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ మెరుపులు ‘గ్యాంగ్ లీడర్’ లో కనిపించలేదు. దీంతో చాలా సాదాసీదా సినిమాగా నిలించింది. ఐతే జెర్సీకి, గ్యాంగ్ లీడర్ కి మధ్య చాలా వైవిధ్యం చూపించాడు నాని. నటుడిగా ఈ ఏడాది నానికి గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే.
విజయదేవర కొండ:
ఈ ఏడాది కూడా ‘గీత గోవిందం’ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేస్తాడని అనుకున్నారు విజయ్ ఫాన్స్. విజయ్- రష్మిక జంట. పాటలు హిట్. ప్రమోషన్ ఇంకా హిట్. కానీ ‘డియర్ కామ్రేడ్’ మాత్రం దయ తలచలేదు. చాలా అంచనాల మధ్య వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ డిస్సపాయింట్ చేసింది. కధనంలో వేగం తగ్గడం, ప్రేమ కధని కాస్త ‘మీటూ’ పాయింట్ పైవు మళ్లించడంతో ప్రేక్షకులు ఎందుకో కనెక్ట్ కాలేదు. విమర్శించడానికి ఏమీ లేదు కానీ జనాలని మెప్పించే చిత్రం కాలేకపోయింది. టోటల్ గా ఈ ఏడాది విజయ్ కి హిట్ లేకుండా పోయింది. అయితే 2020 ప్రధమార్ధంలోనే విజయ్ నుండి రెండు సినిమాలు వచ్చే అవకాశం వుంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగ్ చివరి దశకు వచ్చింది. అలాగే పూరి సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలపై మంచి అంచనాలు వున్నాయి.
నితిన్ :
2019 నితిన్ కి జీరో ఇయర్. ఒక్క సినిమా కూడా రాలేదు. చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం బాక్ టు బ్యాక్ ఫ్లాపులతో బండికి బ్రేకులు వేశేశాడు నితిన్. 2019ని ఖాళీగా వదిలేశాడు. నేను ఇండస్ట్రీలోనే వున్నానని గుర్తు చేయడానికి ‘గద్దల కొండ’లో చిన్న గెస్ట్ రోల్ చేసి ”వున్నాను” అనిపించుకోవడం తప్పితే నితిన్ నుండి మరో సినిమా రాలేదు. ఐతే మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. భీష్మ, రంగ్ దే, చంద్రశేఖర్ ఎలేటి తో చేస్తున్న మరో మూవీ.. ఈ మూడు కూడా లైన్ లో వున్నాయి. సో 2020లో ఖాళీని బ్యాలన్స్ చేయడానికి రెడీగా వున్నాడు నితిన్ .
వరుణ్ తేజ్:
వరుణ్ తేజ్ కి ఇది హిట్ ఇయర్. రెండు హిట్లు ఖాతాలో వేసుకున్నాడు. వెంకటేష్ తో కలసి చేసిన ఎఫ్ 2 ని క్లాస్ మాస్ ఫ్యామిలీ అనే తేడాలు లేకుండా తెలుగు ప్రేక్షకులంతా ఆదరించారు. పండక్కి వచ్చిన ఈ సినిమా అసలు సిసలు పండగ సినిమాగా నిలించింది. అటు వసుళ్ళూ పరంగా కూడా వరుణ్ కెరీర్ లో హయ్యస్ట్ రికార్డ్ గా నిలించింది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘గద్దల కొండ గణేష్’ కూడ మంచి విజయం సాధించింది. అటు నటుడిగా కూడ వరుణ్ కి మంచి మార్కులు పడ్డాయి. వరుణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ప్రజంట్ చేసిన సినిమాగా గద్దల కొండ గణేష్ నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత వరుణ్ ఇంకా కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. బహుసా పండక్కి వరుణ్ కొత్త సినిమా ప్రకటన ఉండొచ్చు.
నాగచైతన్య:
ఈ ఏడాది చైతు ‘మజిలీ’ బావుంది. పెళ్లి తర్వాత శ్రీమతి సమంతతో కలసి చేసిన మజిలీ సినిమా మంచి ప్రేమ కధగా నిలిచింది. మౌనరాగం, రాజారాణి ప్లావర్ లో ‘మజిలీ’ సినిమా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి ఫ్లాపులతో నిరాశగా వున్న చైతన్యకు మజిలీ కొత్త ఊపు ఇచ్చింది. అయితే ఏడాది చివర్లో వచ్చిన ‘వెంకీమామా’ మాత్రం మురిపించలేకపోయింది మామ వెంకీతో వెండితెర పంచుకున్న చైతుకి అనుకున్న ఫలితం ఇవ్వలేకపోయింది. కధ, కధనంలో కొత్తదనం చూపించలేక చతికిలపడింది. అయితే 2020లో మాత్రం క్రేజీ సినిమాలతో రెడీ అవుతున్నాడు చైతు. శేఖర్ కమ్ముల, పరశురాం సినిమాలు లైన్ లో వున్నాయి.
అఖిల్:
అఖిల్ జాతకం ఏం బాలేదు. ఈ అక్కినేని వారసుడికి ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా లేదు. ఈ ఏడాది కూడా కలసిరాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ మజ్ను’ మరో ఫ్లాఫ్ ఇవ్వడం తప్పితే ఏం చేయలేదు. ఈ సినిమా తర్వాత ఏం చేయాలో తెలియక గ్యాప్ ఇచ్చేశాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ సినిమా జరుగుతుంది. వచ్చే ఏడాది మిడిల్ లో సినిమా వచ్చే అవకాశం వుంది. హిట్ కూడా రావాలని కోరుకుందాం.
సాయి ధరమ్ తేజ్:
సింగెల్ సినిమాతో సరిపెట్టుకున్నాడు సాయి. చిత్రలహరి చేశాడు. అయితే సినిమా ఫలితం మాత్రం సోసో గానే మిగిలింది. డైలాగులు తప్పితే సినిమాలో విషయం లేదని తేల్చేశారు ప్రేక్షకులు. అయితే మరీ తీసిపారేసిన సినిమా మాత్రం కాదు. అలాగని హిట్ కాదు. డబ్బులు కూడా రాలేదు. టోటల్ గా యావరేజ్ కి కొంచెం దూరంలో ఆగిపోయింది చిత్రలహరి. అయితే పండగ ముందు పండగలాంటి సినిమాతో రేపే( డిసెంబర్ 20) వస్తున్నాడు సాయి. ట్రైలర్ బాగానే వుంది. రిజల్ట్ రేపు తేలుతుంది.
నిఖిల్:
2019 నిఖిల్ కి లేజీ ఇయర్. షూటింగులు లేవు. అర్జున్ సురవరం ఎప్పుడో పూర్తయింది. వాయిదాల పర్వం కొనసాగిస్తూ ఎట్టకేలకు మొన్న వచ్చింది. సినిమా ఓకే. అయితే సెకెండ్ హాఫ్ మాత్రం దెబ్బకొట్టింది. మొదటి సగంలో వున్న వేగం, మెరుపు రెండో సగంలో లేకుండా పోయింది. దీంతో యావరేజ్ గానే ఆగిపోయింది అర్జున్ సురవరం. అయితే గీతా ఆర్ట్స్ లో సినిమా దక్కించుకున్నాడు నిఖిల్. 2020 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా వచ్చే ఛాన్స్ వుంది.
రామ్:
రామ్ మాస్ హీరో అయిపోయాడు. పూరి దయవల్ల. రామ్ ఇది వరకూ చాలా మాస్ ప్రయత్నాలు చేశాడు. కానీ టార్గెట్ రీచ్ అవ్వలేదు. కానీ ఈ ఏడాది పూరి తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం ఊరమాస్ సినిమాగా నిలిచింది. ఫస్ట్ షాట్ నుండే మాస్ కి హైపర్ మీనింగ్ చెబుతూ నడిచిన ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ కి బాగానే నచ్చేసింది. ఊర మాస్ ని ఆదరించే జనాలు రెడీగా వున్నారని ఈ సినిమా రుజువుచేసింది. మొత్తంగా రామ్ ఈ ఏడాది ఊరమాస్ హీరో.
కార్తికేయ:
ఆర్ ఎక్స్ 100 ఇమేజ్ ని పాడు చేసుకున్నాడు కార్తికేయ. కధల ఎంపికలో బొక్కబోర్లా పడ్డాడు. వరుసపెట్టి మూడు సినిమాలు చేశాడు. వెరసి హ్యాట్రిక్ ఫ్లాఫ్ మూటకట్టుకున్నాడు. హిప్పీ, గుణ 360, 90ml,.. మూడు ఫ్లాపులే. ఇది చాలదన్నట్లు ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ గా కూడా చేశాడు. ఈ సినిమా కూడా కార్తికేయకి నెగిటివ్ ఫలితం ఇచ్చింది. మొత్తంగా 2019 కార్తికేయకి అసల్స్ కలసిరాలేదు.
బెల్లంకొండ శ్రీనివాస్:
బెల్లంకొండకి ఈ ఏడాది ఆదాయం 1 వ్యయం 1 అన్నట్టుగా వుంది. తేజ తో చేసిన ‘సీత’ సినిమా ఫ్లాఫ్. కాజల్ హీరోయినిజం ప్రమోట్ చేయడానికి తప్పితే ఈ సినిమా ఎందుకూ పనికి రాలేదు. అయితే తమిళ రీమేక్ ‘రాక్షసుడు’ మాత్రం హిట్ ఇచ్చింది. డబ్బులూ వచ్చాయి. శ్రీనివాస్ కి నటుడిగా కూడా మంచి మార్కులు పడ్డాయి. మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ చుశామన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది.