గడిచిన కాలం ఓ జ్ఞాపకం. అందులో తీపీ ఉంటుంది. చేదూ ఉంటుంది. చేదు విషయాల్ని మర్చిపోయి, తీపి జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితమైపోతుంది. కానీ కొన్ని విషాదాల్ని మర్చిపోదామనుకున్నా, మర్చిపోలేం. వెంటాడుతూనే ఉంటాయి. 2020లోనూ… చిత్రసీమ చాలా చేదుని భరించింది. కొంతమంది దిగ్గజాల్ని కోల్పోయింది. అశేష అభిమానుల్ని విషాదంలో ముంచుతూ…. కొంతమంది సెలబ్రెటీలు తుది వీడ్కోలు పలికేశారు. వాళ్లందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే…
ఈ యేడాది.. మర్చిపోలేని విషాదం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం. కోట్లాది అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారాయన. కరోనా బారీన పడిన బాలు.. దాని నుంచి కోలుకున్నా – ఇతర సమస్యలు చుట్టు ముట్టాయి. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే పోరాటం చేసి.. సెప్టెంబరు 25న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. దాదాపు 40 వేల పాటలు పాడిన బాలు… సంగీత అభిమానుల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బాలు మరణం.. చిత్రసీమకు నిజంగానే తీరని లోటు. కాకపోతే.. బాలుకి సంబంధించిన సంస్మరణ సభని ఇంత వరకూ టాలీవుడ్ చేయలేదు. కరోనా భయాలతో తొలుత ఎవ్వరూ ధైర్యం చేయలేదు. కాకపోతే.. ఇప్పుడు ఆ భయాలు కాస్త తగ్గాయి. బాలుని స్మరించుకుంటూ, గౌరవించుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ పై ఉంది. మరి.. అదెప్పుడు జరుగుతుందో?
2020లో టాలీవుడ్ కోల్పోయిన మరో నటుడు… జయ ప్రకాష్‌రెడ్డి. ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇచ్చి, కమెడియన్ గా మారి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో మంచి పాత్రలు చేసిన జేపీ గుండెపోటుతో గుంటూరులోని తన నివాసంలో సెప్టెంబర్ 8న ఆయన కన్నుమూశారు. రాయలసీమ మండలికంపై పట్టున్న జేపీకి, రంగస్థల అనుభవం కలిసొచ్చింది. విలన్‌గానే ఎక్కువ పేరు సంపాదించినా, హాస్య నటుడిగానూ తనదైన ముద్ర వేయగలిగారు. నటుడిగా ఎంత ఎత్తు ఎదిగినా, నాటక రంగాన్ని మర్చిపోలేదు. చివరికి అదే నాటకాల కోసం గుంటూరు వెళ్లి అక్కడే కన్ను మూశారు.
2020లో దేశం మొత్తాన్ని కుదిపేసిన ఘటన.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య. 2020 జూన్ 14న సుశాంత్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్య వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. ఎన్నో కోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ.. ఈ కేసు నడుస్తూనే ఉంది. ఎంతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న సుశాంత్ ఆకస్మిక మరణం.. ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయమే.
ఇర్ఫాన్ ఖాన్. ప్రయోగాత్మక చిత్రాలకు, పాత్రలకు పెట్టింది పేరు. సమాంతర చిత్రాల్లో తనదైన నటనతో… ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ అత్యంత సహజ సిద్ధమైన నటుడు న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 29న కన్నుమూశారు. ఈ యేడాది ఏప్రిల్ 30 బాలీవుడ్ దిగ్గజం.. రిషి కపూర్ కన్ను మూశారు.
చాలామంది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రెటీల్ని కరోనా మహమ్మారి సోకి ఇబ్బంది పెట్టింది. వాళ్ల ఆరోగ్య సమాచారం విషయంలో అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ.. వాళ్లంతా కోలుకుని, యధావిధిగా షూటింగులు మొదలెట్టేశారు.