సాధారణంగా సంక్రాంతికి చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ గత కొన్నేళ్లుగా పెద్ద సినిమాలు కూడా ఓకేసారి సంక్రాంతి బరిలోకి దిగడం మామూలైపోయింది. దీనివల్ల కొన్ని సమస్యలు, సినిమాలకు నష్టాలు తప్పడం లేదు. ఇప్పటి నుంచి తయారువుతున్న సినిమాలు, వాటి తీరు తెన్నులు చూస్తుంటే రాబోయే 2020 సంక్రాంతికి కూడా ఇలాంటి సమస్య తప్పదేమో అనిపిస్తోంది.
2020 సంక్రాంతి టార్గెట్ గా దిల్ రాజు-అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమా ప్రారంభం కాబోతోంది. దిల్ రాజుకు ఓ సంక్రాంతి సినిమా అన్నది ఎప్పుడూ వుంటుంది.
మెగాక్యాంప్ నుంచి చిరంజీవి సైరా కానీ, బన్నీ-తివిక్రమ్ సినిమా కానీ, ఏదో ఒకటి సంక్రాంతికి మస్ట్ అంటున్నారు.
జూన్ లో బోయపాటి-బాలయ్య సినిమా మొదలవుతుంది. దానికి కూడా సంక్రాంతి తప్ప మరో డేట్ వుండకపోవచ్చు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ఎక్కువ.
నాగార్జున కూడా సంక్రాంతికి సక్సెస్ లు కొట్టి వున్నారు. ఆయన కూడా తన రామరాజు సినిమాను జూన్ లో మొదలు పెట్టి సంక్రాంతి దిశగా రెడీ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది
మిడ్ రేంజ్ హీరోల సినిమాలు వున్నాయి కానీ అవన్నీ కూడా దాదాపు పెద్ద సినిమాలు చేస్తున్న బ్యానర్లోనే కాబట్టి వాటితో సమస్య రాదు. ఎన్టీఆర్. ప్రభాస్, చరణ్ ఈ సంక్రాంతి రేస్ కు దూరంగా వున్నారు. అందువల్ల అక్కడా సమస్య లేదు. వీటిని మినహాయిస్తే, పైన చెప్పుకున్న నాలుగు సినిమాల్లో మూడు అయితే పక్కాగా సంక్రాంతికి తప్పవు అని టాలీవుడ్ లో వినిపిస్తోంది.