కేసీఆర్ మార్పు గురించి మాట్లాడినప్పుడు గుణాత్మక మార్పు గురించి చెబుతూ ఉంటారు. అలాంటి గుణాత్మక మార్పు 2020లో తెలంగాణలో కనిపిస్తోంది.2020 ఏడాది పూర్తి అవుతోంది. ఈ ఏడాది.. తెలుగు రాష్ట్రాలకే కాదు..ప్రపంచం మొత్తానికి ఓ పీడ కల లాంటిది. దాదాపుగా ఏడాది మొత్తం లాక్ డౌన్‌తో… ఆంక్షలతో గడిపేశారు. దానికి తెలంగాణ కూడా మినహాయింపు కాదు. కానీ తెలంగాణలో రాజకీయంలో గుణాత్మకమైన మార్పు కనిపించింది. ఎదురులేదనుకున్న టీఆర్ఎస్ బేలగా మారిపోయింది. అక్కడక్కడా తప్ప పట్టులేదనుకున్న బీజేపీ..,బలీయమైన శక్తిగా అవతరించింది. అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్‌లో ఉండి ఇతర పార్టీలకు పని చేసేవారితో… ఆ పార్టీ కునారిల్లిపోయిది. 2020 ముగింపు సందర్భంగా.. తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన గుణాత్మక మార్పులపై తెలుగు360 రివ్యూ.
మున్సిపల్ గెలుపుతో ప్రారంభం… గ్రేటర్ ఓటమితో పతనం..!
మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించి ఈ యేడాదిని అద్భుతంగా ఆరంభించిన టిఆర్ఎస్ కారుకు.. తర్వాత పంక్చర్లు పడ్డాయి. ఇంజిన్ ఓవర్ హాలింగ్‌కు వచ్చిన పరిస్థితులు చివరికి వచ్చే సరికి ఏర్పడ్డాయి. 2020 ప్రారంభంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో 98 శాతం మున్సిపాల్టీలను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలు కనీసపోటీ కూడా ఇవ్వలేక చతికిల పడ్డాయి. దీంతో తెలంగాణలో కొన్నేళ్ల వరకు టీఆర్ఎస్కు తిరుగుండదనుకున్నారు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. మధ్యలో ఒక్క నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించడం మాత్రమే కొంతలో కొంత టీఆర్ఎస్కు ఊరటనిచ్చింది. నామ మాత్రపు ప్రతిపక్ష పార్టీ గా కాంగ్రెస్ ను నిలబెట్టడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. కానీ బీజేపీ రూపంలో మరింత ప్రమాదకరమైన ప్రత్యర్థిని సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది కనీవినీ ఎరగని స్థాయిలో హైదరాబాద్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సాయంలో రాజకీయం చేయడంత ఆ ప్రభావం బల్దియా ఎన్నికలపై స్పష్టంగా కనపడింది.
ప్రజల్లో వ్యతిరేకత పెంచిన ప్రభుత్వ పనితీరు..!
2020లో ప్రభుత్వం అసలు ప్రజల్ని పట్టించుకోకపోవడంతో.. వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేదు . డబుల్ బెడ్ రూం, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, గొర్రెల పంపిణీ, ఉద్యోగ ప్రకటనలు వంటి హామీలను కేసీఆర్ నెరవేర్చలేకపోయారు . వర్షాలతో రైతాంగం నష్టపోతే ఆదుకునే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ లో వరదలు వస్తే ఒక్క కాలనీలోనూ పర్యటించలేదు. ధరణి పోర్టల్ అంటూ చేసిన హడావుడి చివరకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే పడుతూ లేస్తూ నడుస్తోంది. వంద రోజులకు పైగా రిజిష్ట్రేషన్లను నిలిపివేయడంతో.. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగింది. కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఆదుకోలేకపోయారు. అదే సమయంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ జనాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు నిర్ణయాలు మార్చుకుంటున్నారు కానీ.. సానుకూలత వస్తుందన్న గ్యారంటీ లేదు.
కాంగ్రెస్ మరింత పతనం..!
గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీలను గెలిచింది. కానీ కాంగ్రెస్ బలపడిందేమీ లేదు. తిరిగి పుంజుకుంటామన్న ధీమాను ప్రదర్శించినా.. ఫలితాల్లో మాత్రం వెనకబడిపోయింది. యేడాది ఆరంభంలోజరిగిన మున్సిపల్ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని పదేపదే చెప్పే కాంగ్రెస్.. మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ముఖ్య నేతల నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలను సైతం నిలబెట్టుకోలేకపోయింది. దుబ్బాకలో డిపాజిట్ రాలేదు. గ్రేటర్లో పునాదులు కదిలిపోయాయి. ఉత్తమ్ రాజీనామాతో కొత్త అధ్యక్షుడికోసం వేట మొదలైంది. ఏ క్షణమైనా పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇందులోనూ.. వాళ్ల రాజకీయాలు.. ఆ పార్టీని మళ్లీ కోలుకోకుండా చేస్తున్నాయి.
2020 విన్నర్ బీజేపీనే..!
తెలంగాణలో బీజేపీకి ఈ యేడాది బాగా కలిసొచ్చింది. ఏడాది ప్రారంభంలో మూడో స్థానంలో ఉన్న కాషాయ పార్టీ .. ఆ తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసింది. అనూహ్య ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. బీజేపీ నాయకులు సైతం ఊహించని విధంగా ఈ యేడాది బీజేపీకి కలిసొచ్చింది. లక్ష్మణ్ హయాంలోనే జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ఎదుర్కొంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటలేకపోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన 20 శాతం ఓట్ షేర్ ను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. మార్చి 11న కరీంనగర్ ఎంపీ సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బీజేపీ దూకుడు పెంచింది. దుబ్బాక ఉపఎన్నికల దగ్గర్నుంచి బీజేపీ రాత మారిపోయింది. గెలుపులతో పాటు ప్రముఖుల్ని చేర్చుకుంటూ… ఉత్సాహంగా ముందుకెళ్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపుకు కొనసాగించాలని బీజేపీ ఉత్సాహంగా కనిపిస్తోంది.
అందరికీ 2021 పెను సవాళ్లనే తీసుకొస్తోంది.