2020 ఒక రకంగా సినీ పరిశ్రమ కి ఒక పీడకల. కరోనా కారణంగా పరిశ్రమ స్తంభించిపోయింది. కొత్త సినిమాలు థియేటర్ లోకి రాలేదు. ఇక ఆడియో వేడుకల ఊసే లేదు. అయితే ఏడాది ఆరంభం బాగానే జరిగింది. తర్వాత ఓటీటీల ద్వారా కొన్ని సినిమాలు ప్రేక్షకులని పలకరించాయి. అయితే ఈ కొన్ని సినిమాల్లోనే ఆకట్టుకున్న పాటలు వినగాలిగారు తెలుగు శ్రోతలు. ఈ ఏడాది మ్యూజికల్ హిట్స్ వున్నాయి. పదేపదే పాడుకున్న పాటలు అరడజను వరకూ వున్నాయి. అందులో కొన్ని చార్ట్ బస్టర్స్ గా కూడా నిలిచాయి. ఒక్కసారి ఆ రివ్యూ లోకి వెళితే…
అల.. ఓ అద్భుతం:
2020 సినీ పాటలు అవార్డ్ లు ఇస్తే.. అందులో సింహ భాగం అల వైకుంఠ పురంలో సినిమాకి వెళ్ళిపోతాయి. నిజంగా తమన్ నుండి ఇలాంటి ఓ ఆల్బమ్ వస్తుందని ఎవరూ ఊహించివుండరు. దర్శకుడు త్రివిక్రమ్ ఊహకందని ఆల్బమ్ ఇది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. ”పాటలు బావున్నాయని అనుకున్నాను కానీ అవి ఇలా చార్ట్ బస్టర్స్ అయిపోతాయని అనుకోలేదు. నా డైలాగులోనే చెప్పాలంటే.. ఉహించనిది జరగడమే అద్భుతం”అని ఓ సందర్భంలో నవ్వేశారు త్రివిక్రమ్. నిజమే.. అల వైకుంఠపురంలో ఆల్బమ్ … 2020 సినీ పాటకి కొత్త గ్లామర్ తెచ్చింది. పాటకు మించి పాట .. పాటకు మించి పాట.. ఇలా దుమ్మురేపేసింది.
మొదట సామజవరగమనా పాట రిలీజ్ చేశారు. యువత ఈ పాట విని ఉర్రూతలూగింది. తమన్ నుండి ఇలాంటి సౌండింగ్ తో పాట రావడం బహుసా ఇదే మొదటిసారి. ట్యూన్ ని ఆర్కెస్ట్రాతో నాశనం చేసేస్తాడని తమన్ మీద ఓ కంప్లైంట్ వుంది. సామజవరగమనాతో అది మాఫీ అయిపొయింది. సిద్ శ్రీ రామ్ వాయిస్ అదనపు హంగుని తెచ్చిపెట్టింది. పాట విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్ కి చేరింది. దేశ విదేశాల్లో పాట వీర విహారం చేసింది.
రెండో పాటగా ‘రాములో రాములా’ వచ్చింది. రెండోని బంతిని కూడా సిక్స్ గా మలిచినట్లు ఈ పాటని కూడా అదరగొట్టేశాడు తమన్. మొదటి పాట కేవలం పాడి ఊరుకున్నారు. కానీ రాములో రాములాకి మాత్రం శ్రోతల కాళ్ళు కూడా కదిలాయి. మాస్ బీట్ హిట్ అయితే దాని రేంజ్ వేరు. అలా రాములో రాములా.. కొత్త ఊపుని తెచ్చింది.
మూడో బంతికి కూడా సిక్సరే. ఈసారి బుట్టబొమ్మ. అంతకుమించి అన్నట్లు .. ఆ రెండు పాటలని బీట్ చేస్తూ వచ్చిన బుట్ట బొమ్మ .. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దేశ విదేశాల్లో సెలబ్రేటీలు ఈ పాటకు ఫిదా అయిపోయారు. టిక్ టాక్ ఉదృతంగా నడుస్తున్న కాలంలో వచ్చిన ఈ పాట బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి మొదలకొని ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వరకూ బొట్టబొమ్మతో కాళ్ళు కదిపారు. ఇక సినిమా విడుదల అయిన తర్వాత విజువల్ గా కూడా బుట్టబొమ్మాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ తనకే సాధ్యమైన క్లాసీ టచ్ తో పాటని మరో రేంజ్ కి తీసుకెళ్ళాడు.
నీలి సముద్రంతో దేవిశ్రీ మ్యాజిక్:
దేవిశ్రీ ప్రసాద్ నుండి ప్రతి ఏడాది ఓ మ్యూజికల్ హిట్ వుంటుంది. మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వ”రు పై చాలా అంచనాలు పెరిగాయి. కానీ ఆల్బమ్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ”మైండ్ బ్లాక్” పాట థియేటర్ లో పేలింది గానీ.. పదేపదే పాడుకున్న పాట కాలేకపోయింది. అయితే లోటు .. ఉప్పెనతో తీర్చేశాడు దేవి. ‘నీ కన్ను నీలీ సముద్రం” అంటూ ఉప్పెన నుండి ఓ పాటని వదిలారు. అదిరిపోయిందీ పాట. సూఫీ స్టయిల్ లో మొదలై .. పల్లెటూరు ప్రేమికుడు పాడుకునే పాటగా ట్యూన్ ని మలచిన తీరు దేవిశ్రీ ప్రసాద్ కే చెల్లింది. శ్రీమణి రాసిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది. ఈ ఒక్క పాటతో ఉప్పెనపై అంచనాలు పెరిగిపోయాయి.
ఎవరూ ఊహించని నీలి నీలి ఆకాశం:
యాంకర్ ప్రదీప్ హీరోగా ”ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా గురించి తెలిసింది మాత్రం ..నీలి నీలి ఆకాశం పాట విన్న తర్వాతే.. అదే సంగీతానికి వున్న గొప్పదనం. సిద్ శ్రీరాం వాయిస్ లో నీలినీలి ఆకాశం.. పాట ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై ఈ పాట విపరీతంగా వైరల్ అయ్యింది. అనూప్ రుబెన్స్ నుండి చాలా రోజుల తర్వాత ఇలాంటి మెలోడి వచ్చింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా అద్భుతంగా కుదిరింది.
బాలు గారికి నమస్కారం..
తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. బాలు గారు లేరు. కానీ ఆయన పాట వుంది. ఆరు దశాబ్దాలు గా వింటున్న ఆ స్వరం.. 2020లో కూడా ఎవర్ గ్రీన్. రవితేజ ‘డిస్కో రాజా’లో ”నీవు నాతో ఏమన్నావో’ పాట .. బాలుగారి స్వర ఝారి. రిట్రో స్టయిల్ లో తమన్ స్వరపరిచిన ఈ పాట డిస్కో రాజాలో మేజర్ హైలెట్. ఎక్కడ విన్నా ఈ పాట వినిపించింది. ఇప్పటికీ కొందరి కాలర్ ట్యూన్ గా వుంది. సినిమా సరిగ్గా ఆడలేదు కానీ ఈ పాట మాత్రం సీనీ సంగీత ప్రేమికుల మెమొరీ కార్డులో వుంది.
నకిలీసు గొలుసు లాంటి పాట :
పలాస. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా లేకపోతే మౌత్ టాక్ తో థియేటర్ లో జనం పెరిగేవారు. కానీ సరిగ్గా అదే సమయానికి కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. అయితే ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. రఘు కుంచెకి మంచి మాస్ టచ్ వుంది. ఎందుకే రవణమ్మ లాంటి ఊరమాస్ పాట చేసిన ట్రాక్ రికార్డ్ ఆయనది. ఆ పాట తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో నాదీ నక్కిలీసు పాట చేశారు రఘు. ఇందులో వినిపించిన ఉత్తరాంధ్ర మాండలికం పాటకు కొత్త సొగసు తీసుకొచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా, డ్యాన్స్ షోలలో ఈ పాట వీపరీతంగా వినిపించింది.
‘వి’ ఫర్ వస్తున్న వచ్చేస్తున్నా”
ఇంద్రగంటి మోహన్ కృష్ణది క్లాస్ టచ్. ఆయన ఆల్బమ్స్ లో హాయిగా వినగలిగే పాటలు వుంటాయి. ఈ ఏడాది చేసిన ‘వి’లో కూడా అలాంటి ప్ పాట వుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదితో వి ఆల్బం చేయించారు ఇంద్రగంటి. ఇందులో వస్తున్నా వచ్చేస్తున్నా పాట వినడానికి హాయిగా వుంటుంది. శ్రేయ స్వరం .. సిరివెన్నల అక్షరం.. ఈ పాటకు అదనపు ఆకర్షణ.
వాట్టే సాంగ్:
సాగర్ మహతి ఈ ఏడాది కూడా ఓ హిట్ ఇచ్చాడు. ‘ఛలో’ లో చూసి చుడంగానే అంత కాకపోయే వాట్టే బ్యూటీ తో అదరగొట్టాడు. నితిన్ భీష్మాలో ఈ పాట ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. రింగ్స్ టోన్స్ లో కూడా ఆ పాట మోత మోగించింది. కాసర్ల శ్యామ్ అదించిన ఫంకీ సాహిత్యం క్యాచిగా సాగింది. బుట్టబొమ్మ స్టయిల్ చేసిన పాట చిత్రీకరణ కూడా బావుంది.
సిత్తూరు సిన్నబ్బ :
మాండలికంలో వున్న మజానే వేరు. తెలుగు సినిమాలో చిత్తూరు మాండలికం ఇప్పుడు చక్కగా కుదురుతుంది. నాని ‘కృష్ణార్జున యుద్ధం’లో దారి చూడు పాట ఎంతటి హిట్టో తెలిసిందే. ఇప్పుడు అదే యాసలో శర్వానంద్ ”శ్రీకారం’లో ఓ పాట చేశారు. ఈ ఏడాది బాగా వినిపించిన పాటలో ”బాగుంది బాలా” కూడ వుంది. సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ పాట మాత్రం అప్పుడే అంచనాలు పెంచింది. పాట మాట రెండూ పెంచల్ దాస్ కావడం ఇంకొంచెం పెక్యులర్ అయ్యింది. మిక్కీ జే మేయర్ కూడా క్లాస్ టచ్ తో మాస్ సాంగ్స్ చేయగలరని ఈ పాట మరోసారి రుజువు చేసింది.
లైఫ్ అఫ్ రామ్ :
96తమిళ్ లో మ్యూజికల్ హిట్ కూడా. తమిళ్ ఆల్బమ్ లో ప్రతి పాటకు కోట్ల వ్యూస్. కానీ తెలుగు వచ్చేసరికి ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు. కానీ అందులో ‘లైఫ్ అఫ్ రామ్” మాత్రం బాగానే అలరించింది. మ్యూజికల్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. విజువల్స్ కూడా అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా సిరివెన్నల సాహిత్యం. ”నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు.. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది..నా యద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి..”’ ఇలా కధకు తగ్గట్టు చాలా లోతైన సాహిత్యం వినిపించగలిగారు సిరివెన్నెల.
ఆకు పచ్చని అరకు:
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. సత్యదేవ్ కధానాయకుడిగా ఒటీటీలో విడుదలైన ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. పాటలు కూడా బావున్నాయి. ముఖ్యంగా నింగీ చుట్టే పాట .. పదేపదే వినగలిగే పాటగా నిలించింది. అరకులో పచ్చనైన ప్రకృతిలో కెమరా తిరుగుతూ ఓ ఆకుపచ్చని పాటని చూపించి, వినిపించగలిగిందీ. ఇందులో వినిపించే సాహిత్యం కూడా బావుటుంది. అచ్చతెలుగు పదాలు వినిపించాయి. ఓ సాయంత్రం పూట వేడివేడి కాఫీ తాగుతున్నప్పుడు ఓ అచ్చమైన తెలుగు పాట వినాలంటే .. ఎలాంటి అభ్యంతరం లేకుండ ఈ పాట పెట్టుకోవచ్చు.
భలే గుంటూరు:
మిడిల్ క్లాస్ మేలోడిస్. ఒటీటీ లో చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించింది. బాంబే చట్నీ మాట ఏమో గానీ ఈ సినిమాలో గుంటూరు పాట బావుంది. గుంటూరు మొత్తన్ని చూపిస్తూ.. చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంది. గుంటూరు స్పెషల్స్ ని చూపిస్తూ రాసుకున్న సాహిత్యం కూడా బావుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ చక్కగా కుదిరింది.
తమన్, సిద్ .. మళ్ళీ
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఓ పాట వదిలారు. వుమెన్స్ డే స్పెషల్ గా వచ్చిన మగువా పాట .. మైమరపించింది. సూపర్ ఫామ్ లో వున్న బ్యాట్స్ మెన్స్ ఎలాంటి బంతినైనా బాదేసినట్లు తమన్ సంగీతం లో వచ్చిన ఈ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది. స్త్రీ ఔనత్యం చాటే పాట సాహిత్యం ఉన్నతంగా కుదిరింది. సిద్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు.