స్వతంత్ర భారతానికి 75వ ఏడు వచ్చింది. కాలగమనంలో 74 ఏళ్లు గడిచిపోయాయి. సంబరాలను ప్రజలంతా జరుపుకుంటున్నారు. జెండా పండుగను చేసుకుంటున్నారు. దేశభక్తిని చాటుకుంటున్నారు. కానీ స్వతంత్ర భారత ప్రస్థానంలో ప్రజలకు ఆర్థిక, కుల, మత అసమానతల నుంచి అసలైన స్వాతంత్ర్యం లభించిందా అంటే .. సమాధానం చెప్పడానికి ముందూ వెనుకా ఆలోచించాల్సిందే. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని కొంత మంది చెబుతూ ఉంటారు. బ్రిటిష్ వారిని వెళ్లగొట్టి స్వయం పాలన తెచ్చుకున్న తర్వాత ప్రజల జీవితాల్లో ఊహించినంత వేగంగా మార్పులు రాలేకపోయాయి. దానికి కారణం రాజకీయ వ్యవస్థ.
పరిపాలన చేతికి అందిన ప్రతి పార్టీ .. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రక్రియలకు చేపట్టడం… దేశ అభివృద్ధిపై ప్రభావం చూపింది అందుకే భారత్ కన్నా ఎక్కువ జనాభా ఉండి .. ప్రజాస్వామ్యం లేని చైనా ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటి. అమెరికా తర్వాత ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది చైనానే. త్వరలో అమెరికాను అధిగమించవచ్చని చెబుతున్నారు. కానీ జనాభాలో రేపోమాపో చైనాను దాటిపోతామని భావిస్తున్న భారత్ మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. దీనికి కారణం ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పాలకులు.. ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి సమయం వెచ్చించడం. నిర్ణయాలు తీసుకోవడమే. అందుకే భారత్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది.
దేశ ప్రజల్లో అత్యధిక మందికి విద్య, వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షల్లాగే ఉన్నాయి. కరోనా సమయంలో వైద్యం అందక పిట్టల్లా రాలిపోయిన ప్రజలు ఈ దుస్థితికి బాధితులు. అయితే దేశం ఈ 75 ఏళ్ల కాలంలో పురోగమించింది. అభివృద్ది చెందింది. ఆశించినంతగా కాకపోయినా మన దేశం అభివృద్ధి బాటలోనే నడుస్తోంది. అది అది చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఆ అభివృద్ధి దేశ ప్రజల రాతల్ని మార్చడం లేదు.చాలా కొద్ది మంది రాతలే మారుస్తోంది. దీనికి పాలకులతో పాటు ప్రజలూ కారణమే. ప్రజలు ఎప్పుడైతే కుల, మత, ప్రాంతీయత తత్వాలను వదిలేసి.. పురోభివృద్ధినే అజెండాగా చేసుకుని పాలకుల్ని ఎన్నుకోవడం ప్రారంభిస్తారో అప్పుడే భారత్కు నిజమైన స్వాతంత్ర్యం ప్రారంభమవుతుంది. ఆ దిశగా ప్రయత్నించడం మరో స్వాతంత్ర్య సమరం అవుతుంది. జరిగిపోయిన వాటిని చూసి బాధపడటం కన్నా.., జరగాల్సిన వాటి కోసం ఆలోచించడం.. కార్యోన్ముఖులు కావడమే నిజమైన దేశభక్తి.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే