ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా ముగిశాయి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. ఎన్నికలు పార్టీలకు అతీతం. అయితే ఏపీలో పొలిటికల్ సూపర్ యాక్టివిజం ఉంది. ఈ కారణంగా మైనర్ గ్రామాల్లోనూ పార్టీలున్నాయి. గ్రూపున్నాయి. దీంతో పార్టీ సానుభూతి పరుల వారీగానే ఎన్నికలు జరిగాయి. లోకల్ క్యాడర్ స్ట్రెంత్‌ను పంచాయతీ ఎన్నికలు బలోపేతం చేస్తాయి. అందుకే ఏపీలో అధికార, విపక్ష పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయం చేసేశాయి. కౌంటింగ్ ప్రారంభమవక ముందే గెలుపు తమదంటే తమదని చెప్పుకోవడం ప్రారంభించాయి. ఎవరు ఉద్ధృతంగా ప్రచారం చేసుకుంటే వారిదే విజయమన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పోను… నాలుగు విడుతల్లోనూ దాదాపుగా పదకొండు వేల పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మూడు వేల పై చిలుకు పంచాయతీల ఓటర్లు తాము ఓటు హక్కు వినియోగించుకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ పదకొండు వేల పంచాయతీల్లో తమ ఊరు బాగు కోసం ఎవరు ఉపయోగపడతారో ప్రజలు వారినే ఎన్నుకున్నారు. గ్రామ స్థాయిలో తమకు మేలు చేసేవారినే ప్రజలు ఎన్నుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి కాని.. ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ఏమీ చేయలేరు. ఈ లాజిక్ తెలిసి కూడా… గెలుపు తమదంటే తమదని వైసీపీ, టీడీపీ రచ్చ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కువ మంది ఏది నమ్మితే అదే నిజం. ఈ విషయాన్ని టీడీపీ, వైసీపీ రెండూ గుర్తించాయి. అందుకే… నిజంగా గ్రౌండ్లో ఎంత గెలుస్తామన్న దాని కన్నా… ప్రచారం మాత్రం పీక్స్‌లో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. పంచాయతీ కిరీటం తమదంటే తమదని ప్రచారం చేసుకున్నారు. ఎవరైనా ముఖ్య నేత స్వగ్రామంలో ఓడిపోయతే ఇక పండగ చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందని తేల్చేస్తున్నారు.
పార్టీల గుర్తులతోటే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరగనుంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటి, నగర పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. పధ్నాలుగో తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. నిజానికి ఇప్పుడు గెలుపెవరిదో వారు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే బ్యాలెట్ తీర్పు ద్వారా వెల్లడిస్తారు. కానీ అప్పటి వరకూ ఆగకుండా… పంచాయతీల్లోనే గెలిచేశామని రెండు పార్టీల నేతలు సంబరపడిపోతున్నారు.