2020 మొత్తాన్ని కరోనా దత్తత తీసుకుంది. ఎవ్వరినీ పని చేయనివ్వలేదు. షూటింగులు నిలిచిపోయాయి. అయితే ఈ విరామంలో కధలు, స్క్రిప్ట్ లు రెడీ అయ్యాయి. 2021కనుక అనుకున్నట్లు జరిగితే టాలీవుడ్ యమా బిజీగా వుంటుంది. ఇప్పటికే హీరోలు తమ డైరీని నింపేశారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి:
ఆచార్య సెట్స్ పై వుంది. కరోనా లేకపోతే ఈ పాటికి సినిమా పూర్తయిపోయేది. అయితే ఈ బ్రేక్ ని చిరంజీవి బాగానే ఉపయోగించారు. కొన్ని కధలు విన్నారు. కొన్ని సినిమాలు లాక్ చేశారు. ఆయన రీమేకులకే ఆశక్తి చూపారు. లూసిఫర్, వేదాలం రీమేకులని ఫిక్స్ చేసుకున్నారు. ఆల్రెడీ తెలుగు నేటివిటీ తగ్గట్టు రచన కూడా జరిగిపోతుంది. ఇందులో ముందుగా లూసిఫర్ సెట్స్ పైకి వెళ్లనుంది. మోహన్ రాజా దర్శకుడు. దర్శకుడు బాబీ కూడా చిరుకు ఓ కధ చెప్పాడు. అయితే ఈ రెండు సినిమాలు ముందు పూర్తవ్వాలి. 2021 మొత్తం ఈ రెండు రీమేకులకే కేటాయించారు చిరు. మధ్యలో ఏదైనా అద్భుతమైన కధ కుదిరితే వేదాలం వెనక్కి వెళ్ళొచ్చు గానీ లూసిఫర్ అయితే పండగ తర్వాత సెట్స్ పైకి వెళ్లిపోతుంది.
బాలకృష్ణ:
బాలయ్య బాగా బిజీ. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తుంటారాయన. కరోనా లేకపోతే ఆయన నుండి ఈ పాటికి ఏదో ఒక సినిమా వచ్చేసేది. అయితే 2021ని చాలా బిజీగా ప్లాన్ చేసుకున్నారు. బోయపాటి సినిమా ప్రదమార్ధంలో వచ్చేస్తుంది. తర్వాత చాలా కధలు సిద్దంగా వున్నాయి. సంతోష్ శ్రీనివాస్, శ్రీవాస్, కేఎస్ రవి కుమార్.. ఈ ముగ్గురు బాలయ్య సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడికి బాలయ్య అంటే విపరీతమైన అభిమానం. ఎప్పటి నుండో బాలయ్యతో సినిమా అంటున్నాడు. ఎఫ్ 3 పూర్తి చేసిన తర్వాత ఛాన్స్ వుంటే బాలయ్య తో సినిమా చేసేయడానికి అనిల్ రావిపూడి రెడీ. ఈ రకంగా బాలయ్య డైరీలో పేజీలు నిండిపోయాయి.
నాగార్జున:
నాగ్ వైల్డ్ డాగ్ విడుదలకు సిద్దంగా వుంది. అటు బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర సినిమా చేశాడు. ఇది కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. బంగార్రాజు ఎప్పటి నుండో చర్చల్లో వుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.
వెంకటేష్:
గురు తర్వాత వెంకటేష్ కొంచెం నెమ్మదించారు. ఒకేసారి కధలు ఓకే చేసి లైన్ లో పెట్టడం లేదు . ఎఫ్ 2 తర్వాత వెంకీ నుండి సినిమా రాలేదు. ఇప్పుడు నారప్ప సెట్స్ పై వుంది. ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా వుంది. దీని తర్వాత ఎమిటనేది ఇంకా అఫీషియల్ గా ప్లాన్ చేయలేదు. త్రివిక్రమ్ తో సినిమా ఎప్పటి నుండో చర్చల్లో వున్నా .. ఈ ఏడాది కూడా అది సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్:
వకీల్ సాబ్ ఏడాది ప్రదమర్ధంలోనే వచ్చేస్తుంది. తర్వాత అయ్యప్పనమ్ కోషియం రీమేక్. మధ్యలో క్రిష్ సినిమా వుంది. మార్చ్ లోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది ఓ సర్ ప్రైజ్ వచ్చే ఛాన్స్ కూడా వుంది. అదే త్రివిక్రమ్ సినిమా. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకూ లేదు కానీ .. పరిస్థితులు అనుకూలిస్తే రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసే ఓ కధ త్రివిక్రమ్ దగ్గర వుంది. పవన్ కి కూడా అది చేయాలని వుంది. ఏడాది చివర్లో ఆ సినిమా ప్రకటన వచ్చే అవకాశాలు వున్నాయి.
మహేష్ బాబు:
సర్కారి వారి పాట తర్వాత మహేష్ లైన్ చాలా క్లియర్ గా వుంది. రాజమౌళితో సినిమా ఫిక్స్ అయిపొయింది. వంశీ పైడిపల్లి కూడా మహేష్ కోసం ఓ కధని సిద్దం చేస్తున్నాడు. త్రివిక్రమ్ మరో సినిమా చేయాలని ఎప్పటి నుండో చర్చలు నడుస్తున్నాయి. అయితే ముందు రాజమౌళి సినిమా పుర్తవ్వాలి.
ఎన్టీఆర్ :
ఆర్ఆర్ఆర్ తో బిజీగా వున్నాడు తారక్. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళిపోతాడు. ఇప్పటికే త్రివిక్రమ్ బాండ్ స్క్రిప్ట్ తో రెడీగా వున్నాడు. త్రివిక్రమ్ తర్వాత మళ్ళీ కొరటాల ఓ సినిమా చేసే ఛాన్స్ వుంది. అయితే ముందు త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయాలి. మళ్ళీ కొరటాల దగ్గరి వచ్చేసరికి ఏడాది చివరి కావచ్చు.
ప్రభాస్ :
2021 కాదు 2023వరకూ ప్రభాస్ డైరీ నిండిపోయింది. రాధే శ్యామ్ సెట్స్ పై వుంది. ఆది పురుష్ పనులు జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ గ్యాప్ లో సలార్ ని కూడా తెరపైకి తెచ్చాడు ప్రభాస్. అంతేకాదు ఆది పురుష్ అంటే ముందు సలార్ సినిమానే పూర్తి చేస్తాడు. ఈ రెండిటి తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సిద్దం. అది పూర్తయ్యేప్పటికీ క్యాలెండర్ 2023కి వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
రామ్ చరణ్ :
ఆర్ఆర్ఆర్ తో బిజీ గా వున్నాడు చరణ్. ఆయన ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే వుంది. కరోనా బ్రేక్ లో తన కోసం పెద్దగా కధలు వినలేదు చరణ్. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా. ఆర్ఆర్ఆర్ కి వచ్చే రెస్పాన్స్ చూసి కొత్త కధని ఎన్నుకోవాలనేది చరణ్ ఆలోచన. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చేసినట్లు ఓ పెద్ద సినిమా చేయాలనేది ప్లాన్. ఈ మధ్య జెర్సీ దర్శకుడు గౌతమ్ కి చరణ్ ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. దీని సంగతి పక్కా కాలేదు కానీ చరణ్ ద్రుష్టి మాత్రం పాన్ ఇండియా సినిమా పై వుంది. చరణ్ లిస్టు లో సుకుమార్ కూడా వున్నారు. రంగస్థలం తర్వాత చరణ్, సుకుమార్ కి కొన్ని కధలు చర్చలోకి వచ్చాయి. చరణ్ కొత్త సినిమా సుకుమార్ తో అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అల్లు అర్జున్:
బన్నీ ఈ ఏడాది ఫుల్ బిజీ. సుకుమార్ తో చేస్తున్న పుష్ప సెట్స్ పై వుంది. దిని తర్వాత కొరటాలశివ సినిమా వుంటుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ ఆగిపోయింది. అయితే ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లో అదే బ్యానర్ లో మరో కధ బన్నీ చేసే అవకాశం వుంది. అయితే ముందు కొరటాల సినిమా పూర్తి కావాలి.
రవితేజ:
క్రాక్ విడుదలకు రెడీ అయ్యింది. ఖిలాడీ సెట్స్ పై వుంది. ఈ రెండు కాకుండా త్రినాద్ రావు నక్కిన తో కూడా ఓ కధ ఓకే అయ్యింది. ఖిలాడీ పూర్తయిన వెంటనే ఈ సినిమా వుంటుంది.
గోపిచంద్:
సీటిమార్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది ప్రదమార్ధంలో సినిమా థియేటర్ లోకి వస్తుంది. దీని తర్వాత మారుతితో సినిమా వుంటుంది. తేజ తో కూడా ఓ సినిమా చర్చలో వుంది.
వరుణ్, సాయి చెరో రెండు:
వరుణ్ తేజ్ ఎఫ్3 సెట్స్ పైకి వెళుతుంది. దీనితో పాటు బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా కూడా వుంది. సాయి ధరమ్ తేజ్ మొన్ననే ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. కార్తిక్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు.దీని తర్వాత దేవాకట్టాతో సినిమా వుంటుంది.
రానా రూటే వేరు :
రానా భిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా నటుడిగానే ఎదుగుతున్నాడు. ఈ ఏడాది కూడా రానా సందడి బాగానే వుండబోతుంది. ముందుగా విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హిరణ్య కశ్యప ఈ ఏడాది మొదలౌతుంది. దీని తర్వాత మాడై తిరంతు అనే ఓ తమిళ్ పిరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇక బాలీవుడ్లో రానా చేయాల్సిన పాత్రలు ఓ అరడజను వున్నాయి. ఈ మధ్యే ఓ వెబ్ సిరిస్ కి కూడా కమిట్ అయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ రీమేక్ లో కోషియం పాత్రని రానానే చేస్తున్నాడు. హీరోకి ధీటుగా సాగే పాత్ర ఇది. ఈ లెక్కన రానా నుండి ఈ ఏడాది బోలెడు వినోదం.
నాని:
ఈ ఏడాది నాని బాగా బిజీ. టక్ జగదీశ్ దాదాపు చివరి దశకు వచ్చింది. మొన్ననే శ్యామ్ సింగా రాయ్ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు. ‘అంటే సుందరానికీ” సినిమా కూడా ఫ్లోర్ మీదకి వెళ్ళింది. ఇంద్రగంటి, అవసరాల శ్రీనివాస్, నందిని రెడ్డి సినిమాలు చర్చలో వున్నాయి. అయితే ముందు శ్యామ్ సింగా రాయ్, ‘అంటే సుందరానికీ” ఫినిష్ చేయాలి.
విజయ దేవర కొండ:
పూరితో చేస్తున్న ఫైటర్ చివరి దశలో వుంది. ఈ సినిమా తర్వాత డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు రౌడీ. ఈ సినిమా విడుదల కూడా ఈ ఏడాదే వుంటుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా వుంటుంది.
అఖిల్, చైతు:
నాగ చైతన్య లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ విక్రమ్ కుమార్ తో జత కడుతున్నాడు. ఈ సినిమాకి థ్యాంక్ యూ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీని తర్వాత కొత్త కధలు విన్నాడు కానీ ఇంకా ఏదీ ఫిక్స్ చేయలేదు
నితిన్:
ఈ ఏడాది నితిన్ నుండి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందు రానున్నాయి. రంగ్ దే దాదాపు పుర్తయింది. చంద్రశేఖర్ ఏలేటీతో చేస్తున్న చెక్ సెట్స్ పైకి వెళ్ళింది. ఇది కాకుండా బాలీవుడ్ రీమేక్ అంధాధున్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.
రామ్, శర్వా, శౌర్య:
రామ్ ‘రెడ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైయింది. దిని తర్వాత మళ్ళీ పూరితోనే ఓ సినిమా చేస్తాడనే మాట వినిపిస్తుంది. శర్వానంద్ శ్రీకారం ఏడాది ప్రథమార్ధంలోనే వచ్చేస్తుంది. ‘మహా సముద్రం’ కూడా సెట్స్ పై వుంది. ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా కూడా లైన్ లో వుంది. నాగ శౌర్య లక్ష్య విడుదలకు సిద్దంగా వుంది. దిని తర్వాత వరుడు కావలెను సినిమా కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు శౌర్య. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే రానున్నాయి.