2021లో అన్నీ చేదు జ్ఞాపకాలే. దాదాపు సగం రోజులు థియేటర్లు తెరచుకోలేదు. 50 శాతం ఆక్యుపెన్సీ గండాన్ని దాటుకుని వచ్చింది చిత్రసీమ. అన్నీ ఒక ఎత్తయితే, ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం మరో ఎత్తు. కొన్ని థియేటర్లలో పాప్ కార్న్ కంటే… సినిమా టికెట్ చీప్ అయిపోవడం విడ్డూరంగా కనిపించింది. దాంతో… కొన్ని థియేటర్లకు తాళాలు పడ్డాయి. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారన్న కారణంగా ఇంకొన్ని థియేటర్లన్ని ప్రభుత్వమే సీజ్ చేసింది. వరుస పరాజయాలు సైతం చిత్రసీమని కృంగదీశాయి. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో డిసెంబరు… చిత్రసీమని ఆదుకుంది. ఈనెలలో విడుదలైన మూడు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం, వసూళ్ల పండగ చేసుకోవడం… టాలీవుడ్‌కి ఊపిరినిచ్చింది.
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో రూపొందిన `అఖండ` టాలీవుడ్ కి మర్చిపోలేని విజయాన్ని అందించింది. విడుదలైన ప్రతీ చోటా… హౌస్ ఫుల్కలక్షన్లతో హోరెత్తించింది. బాలయ్య గత చిత్రాల రికార్డులన్నీ.. అఖండ తిరగరాసింది. ఎప్పుడూ లేనిది, ఓవర్సీస్ లోనూ డాలర్ల వర్షం కురిసింది. ఈ విజయం… చిత్రసీమకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. డివైడ్ టాక్ లో సైతం.. `పుష్ప` తన తడాఖాని చూపించగలిగింది. విడుదలైన రోజు దగ్గర్నుంచి ఇప్పటి వరకూ పుష్ప హంగామా కొనసాగుతూనే ఉంది. ఏపీలో టికెట్ రేట్లు భారీగా తగ్గించినా, పుష్ప నిలబడగలిగింది. ఈ శుక్రవారం విడుదలైన… శ్యామ్ సింగరాయ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఏపీలో తక్కువ థియేటర్లే దొరికినా.. అక్కడ సైతం మంచి వసూళ్లే దక్కించుకుంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. దానికి తగ్గట్టుగానే వసూళ్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ డిసెంబరులో మూడు హిట్లు చూసింది చిత్రసీమ. డిసెంబరు 31న కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి. మరో హిట్టు పడితే.. 2021కి ఘనంగా వీడ్కోలు పలికి.. 2022ని సాదరంగా ఆహ్వానించుకోవచ్చు.