2020 కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ సంవత్సరం చిత్రసీమకు కలసి రాలేదు. మార్చి నుంచి ఇప్పటి వరకూ కొత్త సినిమాలేం రాలేదు. థియేటర్లు తెరచుకునే అవకాశం ఇచ్చినా, నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. దాంతో డిసెంబరు నెల కూడా చప్పగా సాగిపోతోంది. కాకపోతే… 2021 సంక్రాంతికి కొత్త సినిమాల తాకిడి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కొన్ని సినిమాలు సంక్రాంతికి కర్చీఫ్ వేసుకున్నాయి. ఈ సంక్రాంతికి 4-5 సినిమాలు విడుదలయ్యే ఛాన్సుంది.
సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో `క్రాక్` ఒకటి. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన సినిమా ఇది. శ్రుతిహసన్ కథానాయిక. సినిమా పూర్తయ్యింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం డిసైడ్ అయిపోయింది. రానా `అరణ్య` కూడా ఈ సంక్రాంతికే రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన సినిమా ఇది. రానాకి తమిళ మార్కెట్ పెరగాలన్నా… ఈ సినిమాతో హిట్టు కొట్టడం అవశ్యం. పైగా ఈ సినిమా కోసం రానా చాలా కష్టపడ్డాడు. రామ్ `రెడ్` ఈ ముగ్గుల పండక్కే రెడీ అవుతోంది. ఎన్ని ఓటీటీ అవకాశాలు వచ్చినా, లొంగని నిర్మాతలు ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. సంక్రాంతికి మించిన సీజన్ ఈ సినిమాకి దొరకదు. ఎన్ని సినిమాలొచ్చినా సరే.. రెడ్ ని సంక్రాంతి బరిలో నిలపాలని చిత్రబృందం గట్టిగా తీర్మాణించుకుంది. ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత వస్తుంది. ఈ మూడు సినిమాలతో పాటు విజయ్ `మాస్టర్` కూడా పోటీ పడబోతోంది. ఇప్పటికే `మాస్టర్` రిలీజ్ డేట్ లాక్ చేసేశారు. `ఖైదీ`తో ఆకట్టుకున్నలోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్ కి మంచి స్పందన వచ్చింది. తెలుగు సినీ అభిమానులు ఈ డబ్బింగ్ సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నారు.
ఒక్కటే షరతు సినిమాల్ని విడుదల చేసే విషయంలో నిర్మాతల్ని ఆపుతోంది.. 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధనే. ఇప్పుడున్న నిబంధన మేరకు థియేటర్ లో 50 శాతం సీట్లనే అమ్ముకోవాలి. మిగిలినవి ఖాళీగా ఉంచాలి. స్టార్ హీరోల సినిమాలు హౌస్ ఫుల్స్ అయితే తప్ప, పెట్టుబడి తిరిగి రాబట్టుకోలేవు. 50 శాతం టికెట్లకే పరిమితమైతే ఆ మేరకు ఆదాయం కోల్పోయినట్టే. అందుకే.. నిర్మాతలు రిస్క్ చేయడం లేదు. సంక్రాంతికి వద్దామనుకుంటున్న సినిమాలు సైతం.. నిబంధనల్లో మార్పు కోరుకుంటున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇస్తే.. సంక్రాంతి సినిమాల విడుదలకు ఢోకా ఉండదు. ఆమాటకొస్తే… విడుదలయ్యే సినిమాల సంఖ్య మరింతగా పెరగొచ్చు. జనవరి 1 నుంచి నిబంధనల్లో మార్పు వస్తుందని నిర్మాతల నమ్మకం. అలా కాని పక్షంలో.. ఇందులో ఒకట్రెండు సినిమాలు వెనక్కి వెళ్లే ఛాన్సుంది. మరి కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.