దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్..అని మొన్నామధ్య స్వయంగా ప్రధానమమంత్రి నరేంద్రమోడీ…తెలుగు వైతాళికుని పద్యం పాడారు. ఆయనకు తెలుగు రాకపోయినా హిందీలోనో… గుజరాతీలోనే రాసుకుని చదివేసి ఉంటారు. ప్రజల్ని “ప్లీజ్” చేయడానికి ప్రధాని మోడీ… రోమ్‌కి వెళ్తే రోమన్‌లాగా ఉండాలన్న సూచనను పక్కాగా పాటిస్తారు. ఇంకా చెప్పాలంటే ఆయన మరింత ఎక్కువేచేస్తారు. ఎక్కడకు వెళ్తే అక్కడి సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఏ రాష్ట్రం వారితో మాట్లాడాలనుకున్నప్పుడు వారి ప్రముఖుల రచనలు.. కొటేషన్లను హిందీలోనో.. గుజరాతీలోనేరాసుకుని చదివేస్తారు. అప్పుడు మీడియా అహో.. ఓహోఅని పొగిడిస్త్తుంది.కానీ అలా వైతాళికులు చెప్పిన మాటల్లోని సారాంశం ఆయనకు అర్థం అవుతుందో లేదో.. అలా అయితే.. తమ విధానాలను పోల్చి చూసుకుంటున్నారో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే.. కేంద్రం తీసుకుంటున్న ఏ ఒక్క నిర్ణయమూ మోడీ చెప్పే… మహాగొప్ప సూక్తులకు సూటవ్వడం లేదు. దేశమంటే ప్రజలు… ఆ ప్రజల్ని వీలైనంత వరకూ కష్టాలు లేకుండా చూసుకోవాలి. కానీ వారి ఆదాయాన్నంత పన్నుల రూపంలో పిండేసుకోవడానికి అన్నిరకాల ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ఆదాయపు పన్ను … ఖర్చు చేసిన దానిపై పన్ను..!
దేశంలో ఆదాయపు పన్ను కట్టే వారు స్వల్పమే. ఇప్పుడు అంతా ఆన్ లైన్ అయిపోయింది. ఎవరికెంత ఆదాయం వస్తుందో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం… ఐదు లక్షల ఆదాయం దాటిన వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారు నాలుగైదు శాతం మంది కూడా లేరని ప్రభుత్వం బాధపడుతోంది. దేశం అలా వెనుకబడిపోయిందని బాధపడాల్సిన కేంద్రం.. పన్నులు ఎగ్గొడుతున్నారని ప్రజలనే అనుమానిస్తోంది. నిజానికి వారు పన్ను కట్టాల్సినంత సంపాదించడం లేదు. మరి నిజంగా పన్ను కట్టడం లేదా అంటే.. తమ ఆదాయంలో 30శాతం వరకూ కడుతున్నారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద పన్ను కడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే పన్నెండు శాతానికిపైగా జీఎస్టీ పడుతుంది. నిజానికి ఆ కొనుగోలు చేసే వస్తువుల్లోనే టాక్స్‌ల మీద టాక్సులు ఉంటాయి. ముడి సరుకు నుంచి ఉత్పత్తి అయ్యే వరకూ ప్రతి దశలోనూ పన్నులు ఉంటాయి. చివరికి ప్రజలు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసినందుకు పన్నులు చెల్లించాలి. ఎన్ని రకాల లెక్కలు వేసుకున్నా… ఆదాయం ఉన్నా లేకపోయినా… చిన్న వాటర్ బాటిల్ కొనుక్కున్నా.. రోడ్డు పక్కన టీ తాగినా… దాంట్లో 30శాతం పన్నులు ప్రజలు కడుతున్నట్లే.
సరిపోనట్లుగా పెట్రో, డీజిల్‌పై బాదుడు..!
దేశంలో లీటర్ పెట్రోలు ధర ఇప్పటికే రూ.100కు చేరువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వంద దాటింది. పెట్రో మంటల్లో కాలిపోతున్నా మరో మార్గం లేదుకాబట్టి సామాన్యుడు పంటి బిగువున ఈ భారాన్ని భరిస్తున్నాడు. దీనినే అలుసుగా తీసుకున్న నరేంద్రమోడీ ప్రభుత్వం మరింతగా వడ్డిస్తోంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014 నాటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఎంతగానో తగ్గాయి. ఫలితంగా అనేక దేశాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి. కానీ మన దేశంలో మాత్రం దానికి భిన్నం! అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గేకొద్దీ, దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. మోడీ అధికారం చేపట్టిన నాటికి పెట్రోలు బేసిక్ ప్రైస్ సుమారుగా రూ.47 ఉండగా, ఇప్పుడు రూ.29.34కు పడిపోయింది. అదే సమయంలో అమ్మకం ధర మాత్రం రూ.71.40 నుండి దేశవ్యాప్తంగా సగటున రూ.95కు చేరింది. అంటే లీటర్ పెట్రోల్ మీద అరవై ఐదు రూపాయల పన్నులు వసూలు చేస్తున్నారన్నమాట.
దేశమంటే ప్రజలే..ఆ ప్రజల ఆర్థిక పరిస్థితి తెలియదా..!?
కరోనా సమయంలో దేశ ప్రజలు చితికిపోయారు. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు తప్ప అందరూ ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో ప్రజల ఆదాయం పెంచడానికి .. వారి ఖర్చు చేసే సామర్థ్యం పెంచడానికి పన్నుల భారాన్ని తగ్గించాల్సిన కేంద్రం… పన్నుల భారం మోపుతూ.. పోతోంది. ఫలితంగా.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటేలా చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గడిచిన 14 నెలల కాలంలో డాలర్‌ను ప్రామాణికంగా తీసుకుంటే ముడి చమురు ధరలు 5 శాతం తగ్గాయి. దేశంలో పెట్రోలు, డీజల్ ధరలు ఆ మేరకు తగ్గకు పోగా జనవరి 2020తో పోలిస్తే 20 శాతం పెరిగాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలతో పాటు అమెరికాలో ఈ కాలంలో 5 నుండి 7 శాతం ధరలు తగ్గాయి. తిలా పాపం తలా పిడికెడన్నట్లు కేంద్రం వసూలు చేసే పన్నుల్లో వాటా కోసం వెంపర్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న ఈ భారాన్ని నామమాత్రంగా కూడా ప్రశ్నించడంలేదు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వడ్డించిన ఎక్సైజ్ భారం దేశవ్యాప్తంగా రూ.14 లక్షల కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.3.20 లక్షల కోట్ల పెట్రో అమ్మకాల ద్వారా కేంద్ర ఖజానాకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు మరో రెండున్నర లక్షల కోట్లు ఉంటుంది. పెట్రో ధరల పెంపుతో అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. లాక్ డౌన్ కు ముందు.. లాక్ డౌన్ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు కనీసం 30శాతం వరకూ పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వానికి పన్నుల ఆదాయం వస్తే అభివృద్ధి కాదు..! ఆర్థిక వ్యవస్థ పతనం..!
జీఎస్టీతో పాటు పెట్రో పన్నుల ఆదాయం లక్షల కోట్లు వస్తుందని.. అది ఆర్థికాభివృద్ధికి సూచికగా.. ప్రభుత్వం చెబుతోంది.నిజానికి అది ఆర్థిక వ్యవస్థ పతనం. కరోనా లాక్డౌన్ వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినడంతో అన్‌లాక్ 1.0 నుంచి తిరిగి మళ్లీ అది వృద్ధి చెందుతుందని భావించారు. కానీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఆర్థిక వ్యవస్థ ఒకేసారి వృద్ధి చెందడం కుదరదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరల వల్ల పరిశ్రమలు అంతంతమాత్రంగానే కార్యకలాపాలు నిర్వహించేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు చూస్తున్నాయి. ఇది దేశ జీడీపీపై ప్రభావం పడుతుంది. కరోనా వల్ల పతమైన దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం తిరిగి పునరుద్ధరించాలనుకున్నా.. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఆ లక్ష్యం నెరవేరడం లేదు.
ప్రజలపై పన్నుల మీద పన్నులు వేసి.. వారిలో నిరాశా నిస్పృహల్ని పెంచితే.. నష్టపోయేది దేశమే. దేశమంటే మట్టి కాదు.. మనుషులే. నిజంగాఈ మాటలను మోడీ మనసావాచా నమ్మితే.. ప్రగతి శీల సూత్రాలనే పాటిస్తారు.. పన్నుల మోతను కాదు..!