పన్నుల ద్వారా ఆదాయం పిండుకోవడం… పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరింత ఆదాయం పొందడాన్నే అభివృద్ధిగా చెప్పుకుంటూ… ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పాత ఆర్థిక లక్ష్యాలనే కొత్తగా చెబుతూ… పద్దులు ప్రవేశ పెట్టారు. ఆమె ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఎన్నికలు ఉన్న బెంగాల్, అసోం, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు కాస్త తాయిలాలు ప్రకటించినా… మిగతా మిగిలిన ఏ రాష్ట్రమూ.. ఏ వర్గమూ హమ్మయ్య అని అనుకునే పరిస్థితి కల్పించలేదు. విచిత్రం ఏమిటంటే.. తమిళనాడులో రోడ్లు ఏకంగా లక్ష కోట్లు ప్రకటించేశారు. అది ఏడాదిలో ఇస్తారా.. పదేళ్లలో ఇస్తారా అన్నది వేచి చూడాలి.
ఇన్‌కంట్యాక్స్ శ్లాబుల్లో మార్పు లేదు..!
కేంద్ర బడ్జెట్ అంటే.. ముందుగా వేతన జీవులు ఎదురు చూసేది ఇన్‌కంట్యాక్స్ శ్లాబుల్లో వెసులుబాటు. కానీ ఈ సారి కూడా… శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి.. మధ్యతరగతి ప్రజల ఖర్చులు అమాంతం పెరిగిపోయినా… వారి రోజువారీ ఖర్చుల్లో ప్రతీదానిపైనా పన్నులు వసూలు చేస్తున్నా.. ఆదాయపు పన్ను పరిమితి పెంచకుండా.. అంతే ఉంచేశారు. స్టాండర్డ్ డిడక్షన్ ఎంతో కొంత పెంచుతారని అదే పనిగా మీడియాలో వచ్చేలా చేసుకున్నా.. చివరికి హ్యాండిచ్చారు. అంటే మధ్య తరగతి జీవులు.. పెరిగిన రేట్లకు తోడు.. పన్నులు… దానికి తోడు ఇన్‌కంట్యాక్స్ కూడా వదిలించుకోవాల్సిందే. అయితే ఇక్కడో చమత్కారం నిర్మలా సీతారామన్ చేశారు. ఏమిటంటే… 75 ఏళ్లు దాటిన వారు రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదట. ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్‌పై రూ. నాలుగు వరకూ బాదుడు..!
పెట్రోల్ ధరలు సెంచరీకి దగ్గరకా వస్తున్నాయి. ఈ సమయంలో రేట్లు తగ్గిస్తారని అనుకున్నారు. కానీ పెట్రోల్‌పై కొత్తగా వడ్డించారు. పెట్రోల్‌పై రెండున్నర అగ్రిఫ్రా సెస్ విధించారు. డీజీల్‌పై ఇది నాలుగు రూపాయలుగా ఉంది. దీన్ని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రస్తావించలేదు. గతంలో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఎక్సైజ్ పన్నును అదే పనిగా పెంచుకుంటూ పోయారు. ఇటీవల ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత లీటర్ పెట్రోల్‌పై దాదాపుగా రూ. పదిహేను వడ్డించారు. దీంతో ఎక్సైజ్ ట్యాక్స్‌ను తగ్గిస్తారని ప్రచారం చేశారు. కానీ ఆ ఊరట కూడా లభించలేదు. దీన్ని బట్టి చూస్తే.. మరో వారంలోనే పెట్రోల్ రేటు సెంచరీ దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రజలు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సిందే.
ఎల్ఐసీ సహా లాభాలు తెచ్చే కంపెనీలన్నీ అమ్మకానికి..!
ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్మి.. సొమ్ము చేసుకోవడానికి నిర్మలాసీతారామన్ చాలా పట్టుదలగా ఉన్నట్లుగా బడ్జెట్ ప్రసంగమే స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత లాభదాయకమైన ఎల్ఐసీని ఈ ఏడాదే లిస్టింగ్ కు తీసుకురాబోతున్నారు. పెట్టుబడులను ఉపసంహరించుకునే ఐపీవోను ప్రవేశ పెట్టారు. అలాగే ఇతర నవరత్న కంపెనీల్లోనూ.. పెట్టుబడుల ఉపసంహరణకు భారీ ప్రణాళిక ప్రకటించారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు రూ. పన్నెండు లక్షల కోట్ల అప్పులు కూడా తేవాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ప్రభుత్వానికి కాదు ప్రజలకు విపత్కర బడ్జెట్..!
ఇక బడ్జెట్ ప్రాధాన్యతా రంగాల ప్రకారం.. ఎప్పట్లానే కేటాయింపులు చేశారు. బీజేపీ విధానం ప్రకారం… ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక కేటాయింపులు చేశారు. అవి నిజంగా ఇస్తారో లేదో.. ఇంత వరకూ స్పష్టత లేదు. గతంలో బీహార్ లాంటి రాష్ట్రాలకు అంత కంటే ఎక్కువగానే ప్రకటించారు. అయితే.. బంగారం, వెండి వంటి వాటిపై కాస్త పన్నులు తగ్గించే సంస్కరణలు చేపట్టారు. వాటి విలువ కాస్త తగ్గే అకాశం ఉంది. విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. నిజానికి విపత్కర పరస్థితి ప్రజలది. జనవరి నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ టాక్స్ వసూళ్లు రూ. లక్షా ఇరవై వేల కోట్లు దాటాయి. గతంలో ఎప్పుడూ ఒక్క నెలలో ఇంత రాలేదు.ఈ పన్నునే అభివృద్ధిగా కేంద్ర ఆర్థిక మంత్రి భావించినట్లుగా ఉన్నారు. అందుకే మరింత రెట్టించిన ఉత్సాహంతో పన్నుల వసూలుకు సిద్ధమయ్యారు.
ప్రజలకు ఆదాయం ఉంటేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఖర్చు పెడితేనే… ప్రజలకు ఆదాయం వస్తుంది. ప్రజల వద్ద పిండుకుని…దాన్ని రుణాల రూపంలో బడాబాబుల పాలు చేస్తే.. అభివృద్ధి రాదు. దేశంలో అసమానతలు పెరిగిపోతాయి. ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఆ హెచ్చరికలేమీ ఆర్థిక మంత్రి చెవికి ఎక్కించుకున్నట్లుగా లేదని బడ్జెట్లో తేలిపోయింది.