2022 టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూపంలో దేశం మొత్తం తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడుకున్నప్పటికీ భారీ అంచనాలు వున్న కొన్ని చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. డిజాస్టర్లు గా మిగిలాయి. 2022 టాలీవుడ్ అపజయాల వివరాల్లోకి వెళితే..
రాధేశ్యామ్: బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో నిరాశ పరిచింది. ఇక రాధేశ్యామ్ పైనే బోలెడు అంచనాలు, ఆశలు పెట్టుకున్నాడు ప్రభాస్. సినిమాని చాలా గ్రాండ్ తీశారు. వింటేజ్ ఇటలీలో షూట్ చేశారు. అయితే ఈ ప్రేమ కథ ప్రభాస్ స్టార్ డమ్ కి సరిపోలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సినిమాపై పెదవి విరిచారు. ప్రభాస్ సినిమాకి కావాల్సిన ముడి సరుకు అందించలేకపోయింది రాధేశ్యామ్. సినిమా మొదటి నుండి షూటింగ్ ఆలస్యమౌతూ వచ్చింది. చాలా చోట్ల రాంగ్ ట్రాక్ పట్టింది. అనేక సార్లు రీషూట్లు చేశారు. ప్రభాస్ ముఖాన్ని గ్రాఫిక్స్ చేశారనే వార్తలూ వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా యూవీ క్రియేషన్ కి చాలా నష్టాలు మిగిలిచింది.
ఆచార్య: ఫ్లాఫ్ లేని దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి-రామ్ చరణ్.. అందరూ కోరుకునే కాంబినేషన్. ఈ ముగ్గురు స్టార్ కాంబినేషన్ లో తయారైన ‘ఆచార్య’ కి డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ కి కూడా సినిమా నచ్చలేదు. చిరంజీవి కెరీర్ లోనే అతితక్కువ ఓపెనింగ్స్ వచ్చిన అప్రతిష్ట ఆచార్య మూటకట్టుకుంది. ఈ సినిమా చుట్టూ వివాదాలు కూడా వచ్చాయి. కొరటాల ఆఫీస్ లో పంపీదారులు నష్టాలు పూడ్చమని నిరసన తెలిపారు. కొరటాల కొన్నాళ్ళు అజ్ఞాతంలో వున్నారనే వార్తలూ వినిపించాయి. చిరు చరణ్ రెమ్యునిరేషన్ల లో కొంత వెనక్కి ఇచ్చేశారని చెప్పుకున్నారు. దిని తర్వాత చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్ కొరటాల సినిమా కూడా ఆలస్యమైయింది. మొత్తానికి కెరీర్ లో ఫ్లాఫ్ ని కొరటాలకు ఆచార్య పెద్ద డిజాస్టర్ ని ఇవ్వగా,.. చిరు- చరణ్ లకు చేదు జ్ఞాపకంగా మిగిలింది.
లైగర్ : ‘దేశం మొత్తం సునామీ సృష్టించేస్తాం. ఆగ్ లగా దేంగే” అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న విజయ దేవరకొండ, పూరి జగన్నాథ్ కి కోలుకోలేని దెబ్బకొట్టింది లైగర్. పూరి జగన్నాథ్ కి చాలా ఫ్లాపులు వున్నాయి. కానీ లైగర్ లాంటి డిజాస్టర్ మాత్రం ఇదే మొదటిసారి. ఎవరికీ రుచించలేదు లైగర్. మార్షల్ ఆర్ట్స్, మైక్ టైసన్, అమెరికాలో షూటింగ్,బాలీవుడ్ సెటప్.. ఏ ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. అయితే అదంతా వృధా ప్రయాసగానే మిగిలింది. లైగర్ మిగిలిచిన నష్టాలు కూడా ఎక్కువ. బయ్యర్లకి, పూరికి మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. తనకి పోలీస్ ప్రొటక్షన్ కావాలని కోరారు పూరి. అలాగే లైగర్ కి సంబధించి ఏవో న్యాయపరమైన ఆర్ధిక చిక్కుల్లో కూడా పడ్డారు. లైగర్ టీం అంతా ఈడీ విచారణలకు హాజరయ్యారు. మొత్తానికి పూరి, విజయ్ ల పాన్ ఇండియా కల.. పీడకలగా మిగిలిపోయింది.
అక్కినేని డబుల్ డిజాస్టర్: ఈ ఏడాది అక్కినేని హీరోలకు కలసిరాలేదు. నాగచైతన్య ఎన్నో నమ్మకాలు పెట్టుకొని చేసిన ‘థాంక్ యూ’ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ‘వెరైటీ’ విక్రమ్ కుమార్, జాగ్రత్తపరుడైన దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది. కనీస ఓపెనింగ్స్ రాలేదు. సినిమా ఎలా వున్నా రిలీజ్ తర్వాత కాస్త హడావిడి చేస్తుంటారు దిల్ రాజు. కానీ సినిమా విషయంలో రెండో రోజుకే మర్చిపోయారు. దసరాకి వచ్చిన నాగార్జున ‘ఘోస్ట్’ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ లాంటి భారీ నిర్మాతలు సినిమాని భాగానే ప్రమోట్ చేశారు. ప్రవీణ్ సత్తార్ ట్రైలర్ ని ఇంట్రస్టింగా కట్ చేశాడు. తీరా సినిమా మాత్రం షాక్ ఇచ్చింది. మొదటి రోజు పూర్తి నెగిటివ్ టాక్ వచ్చింది. తర్వాత సినిమా కోలుకోలేకపోయింది.
రవితేజ డబుల్ డిజాస్టర్: రవితేజ రెండు సినిమాలని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ. రెండూ డిజాస్టర్ రిజల్ట్స్ ఇచ్చాయి. క్రాక్ తో ఫామ్ లోకి వచ్చిన రవితేజ, రాక్షకుడుతో ఫామ్ లోకి వచ్చిన రమేష్ వర్మ తో కలసి సినిమా ఖిలాడీ మెప్పించలేకపోయింది. దీని తర్వాత రామారావు ఆన్ డ్యూటీ కోసం కొత్త దర్శకుడు శరత్ మండవ కి అవకాశం ఇచ్చాడు రవితేజ. ఇది ఖిలాడీకి మించిన డిజాస్టర్ గా మిగిలింది. ఖిలాడీలో కనీసం రవితేజ మార్క్ కనిపించింది. రామారావు ఆన్ డ్యూటీ మాత్రం రవితేజ ఫ్యాన్స్ కి సైతం నచ్చలేదు. ఇప్పుడు ఆశలన్నీ ధమాకాపై పెట్టుకున్నాడు రవితేజ. ధమాకా విజయంతో యేడాది ని విజయవంతంగా ముగించాలని నమ్మకంగా వున్నాడు.
మరి కొన్ని: శర్వానంద్, రష్మిక, తిరుమల కిషోర్ కలసి చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా బాక్సఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సుధీర్ బాబు, కృతి శెట్టి కలసి చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా చాలా నిరాశపరిచింది. మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తాడని పేరున్న శ్రీవిష్ణు అల్లూరితో ఓ ఫ్లాఫ్ ఇచ్చాడు. మంచు విష్ణు ‘జిన్నా’ కి కనీస ఓపెనింగ్స్ రాలేదు. నితిన్ ‘మాచర్ల నియోజిక వర్గం’తో మరో ఫ్లాఫ్ మూటకట్టుకున్నాడు. రామ్ కి కూడా ఈ యేడాది కలిసి రాలేదు. లింగుస్వామితో చేసిన వారియర్ ఫెయిల్యూర్ గా నిలిచింది.