2022లో సగం రోజులు గడిచిపోయాయి. టాలీవుడ్ క్యాలెండర్లో సగం పేజీలు ఎగిరిపోయాయి. గత రెండేళ్లూ కరోనా దెబ్బకు అల్లాడిపోయిన టాలీవుడ్… ఈ యేడాది తొలి సగంలో కొంత కోలుకొన్నట్టే కనిపిస్తోంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఈ యేడాదిలోనూ కొన్ని సూపర్ హిట్లు చూసింది టాలీవుడ్. భారీ ఆశలు పెట్టుకొన్న కొన్ని చిత్రాలు అనూహ్యమైన పరాజయాల్ని ఎదుర్కొన్నాయి. చిన్న సినిమాలు ఒకటీ అరా మెరిశాయి తప్ప పూర్తి స్థాయిలో కాదు. ఓటీటీ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థమైపోయింది. టికెట్ రేట్లు తగ్గించడం, మళ్లీ పెంచడం, ఆ తరవాత…`తగ్గింపు రేట్లకు మా సినిమా చూపిస్తున్నాం` అని నిర్మాతలు డప్పు కొట్టి మరీ.. ప్రేక్షకుల్ని పిలవడం.. ఆనవాయితీగా మారింది. ఈ ఆరు నెలల చిత్రసీమ పోగ్రెస్ రిపోర్ట్ ఓసారి పరిశీలిస్తే…
జనవరి నెల ఆశావాహంగా మొదలవ్వలేదు. ఈ నెలలో దాదాపు డజను సినిమాలొచ్చాయి. సంక్రాంతిరి బంగార్రాజు, రౌడీ బోయ్స్, హీరో, సూపర్ మచ్చీ చిత్రాలు బరిలో దిగాయి. వీటిలో బంగార్రాజుకి మాత్రమే వసూళ్లు దక్కాయి. అలాగని బంగార్రాజు ని హిట్ చిత్రాల్లో చేర్చలేం. ఆ సినిమాలోనూ బోలెడన్ని లోపాలున్నాయి. కేవలం సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోగలిగిందంతే. మిగిలిన సినిమాలు అదీ చేసుకోలేకపోయాయి. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రాకుండా వాయిదా పడడం.. పెద్ద దెబ్బ అనుకోవాలి.
ఫిబ్రవరిలో ఏకంగా 22 సినిమాలొచ్చాయి. ఇందులో ఖిలాడీ పెద్ద సినిమా. రవితేజకు ఇది మరో డిజాస్టర్. దాదాపు 50 కోట్లు పెట్టి తీసిన సినిమా ఇది. బాక్సాఫీసు దగ్గర రూ.10 కోట్లు కూడా రాలేదు. ఈనెలలో హిట్టు సినిమా పడిందంటే.. అది భీమ్లా నాయక్, డీజే టిల్లు చలవే. పవన్ కల్యాణ్ స్టామినా బాక్సాఫీసుకు మరోసారి తెలిసొచ్చింది. కేవలం పవన్ క్రేజ్ వల్లే ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. టికెట్ రేట్లని ఏపీ ప్రభుత్వం తగ్గించినా దాదాపు రూ.90 కోట్ల వరకూ రాబట్టింది. డీజేటిట్లు చిన్న సినిమాగా విడుదలై.. భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా తయారవుతోంది. మోహన్ బాబు ప్రయోగాత్మకంగా తీసిన `సన్నాఫ్ ఇండియా` ఇదే నెలలో విడుదలైంది. ఈ సినిమా బీభత్సమైన ట్రోలింగ్ కి గురైంది.
మార్చిలో విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్, ఈటీ, స్టాండప్ రాహుల్… ఇవేం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. భారీ ఆశలు పెట్టుకొని వచ్చిన `రాధే శ్యామ్` అభిమానుల్ని మెప్పించడంలో విఫలమైంది. ఇదే నెలలో విడుదలైన ఆర్.ఆర్.ఆర్ మరోసారి రాజమౌళి మార్క్ చూపించింది. దేశ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఆర్.ఆర్.ఆర్ నిలిచింది. అప్పటికే టికెట్ రేట్లు పెంచడం… రాజమౌళి సినిమాకి బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహపడినట్టు కనిపించినా… నటుడిగా ఎన్టీఆర్‌కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలోని విజువల్స్ గురించి ఇప్పటికీ జనం మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఏప్రిల్ కూడా టాలీవుడ్ ని పూర్తిగా నిరాశ పరిచింది. మిషన్ ఇంపాజిబుల్, గని.. సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక ఆచార్య సంగతి చెప్పాల్సిన పనిలేదు. భారీ ఆశలు పెట్టుకొన్న ఈ మెగా మల్టీస్టారర్ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. చిరంజీవి సినిమా అనేసరికి ఎలాగున్నా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అయితే ఆచార్యకి అదీ దక్కలేదు. పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 అనుకొన్నట్టే అద్భుతాలు సృష్టించింది. బాక్సాఫీసు దగ్గర తిరుగులేని వసూళ్లు దక్కించుకొంది. తెలుగులో ఈ సినిమాకి అదిరిపోయే కలక్షన్లు వచ్చాయి.
ఈ సమ్మర్ సీజన్‌ని క్యాష్ చేసుకున్న సినిమాలు సర్కారు వారి పాట, ఎఫ్ 3 మాత్రమే. మేలో ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మేలో చాలా సినిమాలే విడుదలైనా.. ఈ రెండింటికి మాత్రమే వసూళ్లు దక్కాయి. సర్కారు వారి పాటకు రివ్యూలేం సరిగా రాలేదు. కానీ.. మహేష్ స్టామినాతో వసూళ్లు మాత్రం దక్కించుకొంది. ఎఫ్ 3… లో ఫన్ వర్కవుట్ అవ్వడంతో వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమా విషయంలో దిల్‌రాజు ప్లానింగ్ కూడా గట్టిగానే పనిచేసింది.
జూన్ కూడా చిత్రసీమకు ఏమాత్రం కలసి రాలేదు. మేజర్ ఒకటే… మంచి వసూళ్లతో పాటు రివ్యూలు కూడా అందుకొంది. నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న అంటే సుందరానికి వర్కవుట్ అవ్వలేదు. గత వారం 9 సినిమాలొస్తే… అందులో ఒక్కటీ హిట్ కాలేదు. జూన్‌లో మేజర్ తప్ప.. మరే సినిమాకీ డబ్బులు రాలేదు.
ఈమధ్య చిన్న సినిమాలు విరివిగా వస్తున్నాయి. మీడియం రేంజు సినిమాలూ పెరిగాయి. అయితే జనం వాటిని పట్టించుకోవడం మానేశారు. ఓటీటీ ప్రభావం విపరీతంగా పడిపోయింది. `మూడు వారాలు ఆగితే.. సినిమాని ఇంట్లోనే చూడొచ్చు కదా` అనుకుంటున్నారు ప్రేక్షకులు. దాంతో.. బాక్సాఫీసు దగ్గర జనాలు కనిపించడం లేదు. పైగా పెరిగిన టికెట్ రేట్లు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నిర్మాతలే స్వయంగా రంగంలోకి దిగి.. `మా సినిమా రేట్లు తగ్గించేశాం` అని చెప్పుకోవాల్సివస్తోంది. ప్రస్తుతానికైతే.. ఫస్టాఫ్ బొటాబొటీగా గడిచినట్టే. సెకండాఫ్‌లోనూ క్రేజీ సినిమాలు వస్తున్నాయి. 2022 లో బొమ్మ అదిరింది అని చెప్పుకోవాలంటే.. సెకండాఫ్‌లో వస్తున్న సినిమాలు క్లిక్ కావాల్సిందే.