అగ్ర, స్టార్ హీరో సినిమాల సందడే వేరు. థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్ లు, బాక్సాఫీసు వసూళ్లు… ఇవన్నీ వాళ్ళ సినిమాలతోనే సాధ్యపడతాయి. ఈ ఏడాది కూడా ఆ వెలుగులు చూసే అవకాశం దక్కింది.
2023 సంక్రాంతి కళతో బాక్సాఫీసు దగ్గర సందడి ప్రారంభమైంది. పరిశ్రమకు రెండు స్తంభాల్లాంటి అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ ఒక్క రోజు గ్యాప్ లో తమ సినిమాతో బాక్సాఫీసు ముందుకు వచ్చారు. బాలకృష్ణ వీరసింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాలతో సందడి చేశారు. ఈ రెండు చిత్రాలూ ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం విశేషం. ఈ రెండింటిలో హీరోయిన్ కూడా ఒకరే కావడం ఇంకో విశేషం. ఇన్ని విశేషాలతో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు ముందు సత్తా చాటాయి. వీరసింహలో సిస్టర్, వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్లు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఈ రెండూ వందకోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
అన్నట్టు ఈ ఏడాది బాలయ్య డబుల్ ధమాకా చూపించారు. వీరసింహరెడ్డి తర్వాత ఆయన నుంచి వచ్చిన భగవంత్ కేసరి కూడా ఘన విజయాన్ని అందుకుంది. బాలయ్యని సరికొత్తగా చూపించాడు అనిల్ రావిపూడి. లోకేష్ కనకరాజ్, విజయ్ క్రేజీ సినిమా లియోతో పాటుగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీసు వార్ లో పై చేయి సాధించింది. సినిమా కథాంశం కుటుంబ ప్రేక్షకులకు కూడా ఆకట్టుకోవడంతో సినిమా లాంగ్ రన్ సాధించింది. ఈ చిత్రం కూడా వందకోట్లు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ప్రభాస్ స్టామినాకి తగ్గ సినిమా పడాలని అందరూ ఎదురుచూశారు. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్ సినిమా 400కోట్లుకు పైగా లెక్ట్ చేసిందని ట్రేట్ వర్గాలు లెక్కకట్టాయి. అలాంటిది… హిట్ పడితే ఆ విజయం ఏ రేంజ్ లో వుంటుందో అని ఫ్యాన్స్ ఆశగా చూశారు. ‘సలార్’ తో ఆ విజయం దక్కేసింది. అగ్ర హీరో సినిమాకి వున్న అసలు సిసలు రుచిని చూపించింది సలార్. ఈ సినిమా కోసం రెండు రోజుల ముందు నుంచే థియటర్ వద్ద టికెట్ల కోసం క్యూ కట్టారు జనాలు. నిజానికి అలాంటి క్యూలని చూసి చాలా కాలం అయ్యింది. ఇక అన్ లైన్ లో టికెట్లు పెడితే సర్వర్లు డౌన్ అయిపోయాయి. ఆ క్రేజ్ కి తగ్గట్టే సినిమా మాస్ హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ లోని హీరోయిజం నెక్స్ట్ లెవల్ లో ఎలివేట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లార్జర్ దెన్ లైఫ్ గా తీర్చిదిద్దాడు. ఇవన్నీ ప్రేక్షకులకు నచ్చాయి. బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టాయి. సలార్ వారంలోనే 500 కోట్ల గ్రాస్ దాటేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొత్తానికి ఈ ఏడాది బిగ్ పంచ్ తో ముగించాడు ప్రభాస్
ఈ ఏడాది వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలంతా గ్యాప్ ఇచ్చారు. వీళ్ళ సినిమాలు షూటింగ్ లోనే వుండిపోయాయి. అయితే నాని, సాయి ధరమ్ తేజ్ లాంటి యువ స్టార్ హీరోలు గ్యాప్ ని ఫిల్ చేసే విజయాలు నమోదు చేశారు. నాని దసరా, హాయ్ నాన్న చిత్రాలు చేశాడు. ఈ రెండు దేనికవే ప్రత్యేకమైననవి. దసరా మాస్ సినిమా. నానిని కొత్తగా చూపించింది. హాయ్ నాన్న ఎమోషనల్ జర్నీ. ఈ రెండు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని రాబట్టాయి. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత విరూపాక్ష సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు సాయి తేజ్. నిజానికి హారర్ థ్రిల్లర్స్ కి క్రౌడ్ పుల్లింగ్ తక్కువ. కానీ విరూపాక్ష మాత్రం ఆ సెంటిమెంట్ ని తుడిచేస్తూ పెద్ద విజయాన్ని సాధించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.