తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ఈ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం. తెలుగు వారికి సంవత్సరంలో వచ్చే తొలి పండగ. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగ. అందుకే ఈ ఉగాది పర్వదినాన జీవిత సారాన్ని తెలిపే ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ అన్ని రుచులను అనుభవిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఉగాది పండుగ సూచిస్తుంది.
కష్టనష్టాలు జీవితంలో భాగం. ఎప్పుడూ ఉండవు. కష్టాలు పూర్తిగా మన వెన్నంటే ఉన్నాయని మనం అనుకుంటాం… కానీ ప్రతి ఒక్కరికీ ఈ కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ వాటిని తీసుకునే విధానం… పరిష్కరించుకునే సమర్థత జీవితంలో అలవర్చుకుంటేనే ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లగలుగుతాం. ఉగాది రోజున చెప్పే రాశీ ఫలాల్లో ఆదాయ – వ్యయాల సూచికలను చూసి ఆదాయం వస్తుందని ముందే ఖర్చు చేసుకుంటే రాశులు.. గ్రహాలు కూడా కష్టాల్ని తప్పించలేవు. ఇక్కడ నమ్మాల్సింది కష్టాన్ని, శ్రమను.. తెలివి తేటల్ని… అంతకు మించి పరిస్థితులను బట్టి నడుచుకోవడాన్ని.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం కామన్. ఎవరికి తగ్గట్లుగా వారు తమ పంచాంగాన్ని చెప్పించుకుంటూ ఉంటారు. రాజకీయ నేతలే కాదు అందరూ అలాగే ఉంటారు. తమకు మంచి జరిగేలా పంచాంగాన్ని చెప్పించుకుంటారు. ఇలా చెప్పించుకున్నంత మాత్రాన వారికి మంచి జరగదు. వారు చేసే పనులను బట్టే ఉంటుంది. కొత్త ఆరంభానికి సూచికగా ఉగాది చెప్పే అర్థం అదే.
తెలుగు సంవత్సరాది మొదటి రోజున కొత్త పనులు ఆరంభించడం, విద్యార్థులు కొత్త పాఠాలను ప్రారంభించడం, కళాకారులు కొత్త కళను ప్రారంభించడం వంటివి చేస్తూంటారు. ఇక నుంచి అంతా శోభకృత నామ సంవత్సరం, శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్థము. ఈ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగును నింపేది అని చెప్పడమైనది. నిజంగానే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం.