ఈ యేడాది అప్పుడే నాలుగు నెలలు గడిచిపోయాయి. కీలకమైన వేసవి సీజన్ సగానికి వచ్చేశాం. సంక్రాంతిలో మినహాయిస్తే స్టార్ హీరోల సినిమాలేం బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ వేసవి చాలా చప్పగా, నీరసంగా, నిస్తేజంగా గడిచిపోతోంది. రాబోయే రెండు నెలల్లో పెద్దగా సినిమాలేం కనిపించడం లేదు. అయితే ఇదంతా ఫస్టాఫ్ మాత్రమే. ఈ క్యాలెండర్లో 7 నెలలు మిగిలే ఉన్నాయి. జూన్ నుంచి… సరికొత్త సినిమాల హంగామా మొదలు కాబోతోంది. స్టార్ల సినిమాలు వచ్చేది కూడా ఈ ద్వితీయార్థంలోనే. ఫస్టాఫ్ కాస్త అటూ ఇటూ అయినా, సెకండాఫ్ బాక్స్ బద్దలైపోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ప్రతీసారి వేసవి సీజన్లో బడా సినిమాలు వరుస కడుతుంటాయి. గత రెండు మూడేళ్లుగా ఈ సీజన్ ఆశాజనకంగా లేదు. ప్రతీసారీ ఐపీఎల్ వల్ల, స్టార్ హీరోల సినిమాలకు గండి పడిపోతోంది. ఈసారి ఎన్నికల వేడితో… ఆ ప్రభావం మరింతగా కనిపించింది. పైగా.. సినిమాల చిత్రీకరణలు ఆలస్యమవ్వడం, విడుదల తేదీల్లో స్పష్టత రాకపోవడం వల్ల వేసవిని చిత్రసీమ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. అయితే వేసవిలో రావాల్సిన సినిమాలు మెల్లగా సెకండాఫ్‌కు షిఫ్ట్ అయిపోయాయి.
‘కల్కి’తో అసలైన హడావుడి మొదలు కానుంది. మేలో విడుదల కావాల్సిన సినిమా ఇది. ఇప్పటికైతే రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేదు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లో ఈ సినిమా రావడం ఖాయం. ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ విషయంలో ఓ స్పష్టత వస్తుంది. ‘ఇండియన్ 2’ కూడా జూన్‌లో రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది చిత్రబృందం. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ష 2’ ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. అదే నెలలో నాని ‘సరిపోదా శనివారం’ ని రంగంలోకి దించబోతున్నాడు. సెప్టెంబరులో ‘ఓజీ’ ఉంది. ఈ రిలీజ్ డేట్ ఎప్పుడో ఖాయం చేసేసింది చిత్రబృందం. శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబరు లేదా, అక్టోబరులో వస్తుందని స్వయంగా.. రామ్ చరణ్ ప్రకటించారు. ఎన్టీఆర్ `దేవర` దసరాకు వస్తోంది. బాలకృష్ణ – బాబి కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం కూడా దసరాకే వస్తుందని సమాచారం. కాస్త అటూ ఇటూ అయినా ఈ యేడాది చివరి నాటికి రిలీజ్ అవ్వడం ఖాయం.
డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే విజయ్ నటించిన ‘గోట్’ సెప్టెంబరులో రాబోతోంది. రజనీకాంత్ ‘వేట్టయాన్’, సూర్య ‘తంగలన్’ కూడా ఈ ద్వితీయార్థంలోనే రాబోతున్నాయి. మొత్తానికి జూన్,. జూలై నుంచి అసలైన సినీ సంగ్రామం మొదలు కానుంది. ఆ ఆరు నెలల్లో నెలకు రెండు చొప్పున కనీసం 12 క్రేజీ చిత్రాలు బాక్సాఫీసుని పలకరించబోతున్నాయి. అందులో సగం హిట్టయినా ఈ యేడాది పాస్ అయిపోయినట్టే.