కాలం ఎంత బలమైనదో నిరూపించిన సంవత్సరం 2024. అహంకారంతో విర్రవీగే వారికి కర్రు కాల్చి వాత పెట్టింది. ఏటికి ఎదురీదిన వారికి విజయాలను చేకూర్చిపెట్టింది. తమవి ఓడలు అనుకున్న వారివి బండ్లు అయిపోయాయి. తమవి బండ్లు అనుకున్నవారివి ఓడలు అయిపోయాయి. అందుకే 2024 రిమార్కబుల్ ఇయర్. కాలంలో కలసిపోతున్న 2024 చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను లిఖించిందని అనుకోవచ్చు.
పిల్ల నియంతలకు గుణపాఠాలు – విర్రవీగిన వారికి విశ్రాంతి
చరిత్రలో నియంతలు ఎంతో మంది ఉంటారు. అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఈ విషయం తెలిసి కూడా పిల్ల నియంతలూ అదే పని చేస్తూ ఉంటారు. వారందరికీ ఎంతో కాలం వేచి చూడకుండానే 2024 బుద్ది చెప్పింది. ఎక్కడో పాతాళానికి పడేసింది. కష్టపడి పని చేయడమే తెలిసిన వారికి ఫలితాల గురించి బెంగ అవసరం లేదని భరోసా ఇచ్చి ముందుకు నడిపించింది 2024. తెలుగు రాష్ట్రాలను చూస్తే .. ఈ ఏడాది ఆరంభం.. ముగింపు ఎంత భిన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఏపీ ఓ మాఫియా మినీ సామ్రాజ్యంగా ఉండేది. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి కలిసినట్లయింది. తెలంగాణలో ఏకపక్ష పాలనకు అవకాశం లేదని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరి సగం సీట్లు ఇచ్చారు. బీఆర్ఎస్కు విశ్రాంతి ఇచ్చారు.
ఎవరెస్ట్ పైకి చంద్రబాబు, పవన్ – బయటకు రాలేని పరిస్థితుల్లోని కేసీఆర్, జగన్
రాజకీయాల్లో కాల మహిమ చాలా ఎక్కువ అని 2024 నిరూపించింది. అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఈ ఏడాది ఎవరెస్ట్ పైన నిలుచోబెట్టింది. అదే సమయంలో కిరీటాలు పోగోట్టుకుని కేసీఆర్, జగన్ బయటకు రాలేని పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్ని రాజకీయాలుగా చేసే వారు.. ఆటుపోట్లను సులువుగా తట్టుకుంటారు. కానీ రాజకీయాలను అర్థం చేసుకోలేక అయాచితంగా లభించిన విజయాలతో శత్రువుల్ని పెంచుకునేవారికి 2024 గట్టిగా బుద్దిగా చెప్పింది.
మోదీకి హెచ్చరికలు పంపిన 2024
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా మోదీని ఎదుర్కొని విజయం సాధించేంత శ్రమించలేదని ప్రజలు తీర్పిచ్చారు. నిరంతరం రాజకీయం చేసే మోదీ ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్నారన్న విషయం స్పష్టం. స్వయంగా బీజేపీ ఓడిపోతే తప్ప కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎంత మాత్రం లేవని క్లారిటీ వస్తోంది. కాంగ్రెస్ గెలవాలి అన్న భావన తీసుకు వచ్చేవిషయంలో రాహుల్ విఫలం కావడంతో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ ఉన్నది అక్కడే అన్నట్లుగా మారిపోయింది. బీజేపీ మూడోసారి అత్యధిక సీట్లు గెలిచి చివరి దశలో కూటమిలో చేర్చుకున్న పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే బీజేపీకి కూడా 2024 గట్టి హెచ్చరికలను పంపినట్లే అనుకోవచ్చు.
మిడిమాలం ట్రంప్‌కు మళ్లీ పగ్గాలు – 2025కి డేంజర్ బెల్స్
2024 ఏడాది ప్రపంచగతిని మార్చడానికి ఓ అడుగుపడింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. 2025 జనవరిలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన ప్రకటనలు ఇప్పటికే అగ్రరాజ్య అధ్యక్షుడి స్థాయికి లేవని తేలిపోతోంది. ఇతర దేశాలను కలుపుకుంటానని రెచ్చిపోవడం.. తన సొంత దేశంలో ప్రజల మధ్య రేసిజం పెంచుకునేలా చేయడం వంటివి పెనుసవాళ్లు తెచ్చిపెట్టనున్నాయి. అందుకే 2025 కి డేంజర్ బెల్స్ గట్టిగానే మోగుతున్నాయి. అంతా మంచి జరగాలనే ఆశిద్దాం..!