‘కంటెంట్ బావుంటే చాలు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాని ఆదరించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులది” సినిమా ప్రమోషన్స్ లో పరభాషా నటీనటులు చెప్పేమాటిది. గౌరవార్థం ఏదో మెప్పు కోసం చెప్పే మాటకాదిది. ఇది అక్షర సత్యం. సినిమా బావుంటే చాలు. స్టార్ట్ ఎవరు? అభిమాన హీరోనా కాదా? ట్రాక్ రికార్డ్ ఏమిటి? ఇలాంటి లెక్కలేవి లేకుండా డబ్బింగ్ సినిమాల్ని సైతం సూపర్ హిట్ చేస్తుంటారు తెలుగు ఆడియన్స్. అందుకే ఒక సినిమా డబ్ చేయాలంటే మొదటి ఆప్షన్ గా తెలుగు భాషనే ఎంచుకొని ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఫిల్మ్ మేకర్స్. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో డబ్బింగ్ బొమ్ములు వచ్చాయి, ఇందులో కొన్ని హిట్లు కొట్టాయి, మరికొన్ని భారీ అంచనాలు రేపి దెబ్బతిన్నాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
తమిళ సినిమాకి తెలుగు పెద్ద మార్కెట్. ఇప్పుడు దాదాపు హీరోలు తెలుగు మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ధనుష్ కెప్టన్ మిల్లర్, రాయన్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ‘కెప్టన్ మిల్లర్’ ఇక్కడ పట్టలేదు కానీ ‘రాయన్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వయంగా ధనుష్ డైరెక్ట్ చేసి నటించి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
విజయ్ సేతుపతికి చాలా రోజుల తర్వాత సాలిడ్ సినిమా పడింది. ‘మహారాజా’కి తెలుగులో చాలా మంచి స్పందన లభించింది. కథ, స్క్రీన్ ప్లే, విజయ్, అనురాగ్ కశ్యప్ నటన.. ఇవన్నీ మహారాజకు మంచి విజయాన్ని చేకూర్చాయి. బాక్సాఫీసు వద్ద సినిమా బలంగా నిలబడింది. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కాయి. ఇదే ఏడాది విజయ్ సేతుపతి నుంచి వచ్చిన `విడుదల 2`కి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు సందడి కనిపించలేదు.
శంకర్ కమల్ హసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’ డిజాస్టర్ గా మిగిలింది. ఎంతోకాలంగా ఊరిస్తూ వచ్చిన ఈ సీక్వెల్ కమల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని సైతం మెప్పించలేకపోయింది. విక్రమ్, పా రంజిత్ ‘తంగలాన్’ సినిమాకి విమర్శకులు ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఆశించినంత వసూళ్లు దక్కలేదు కానీ విక్రమ్ నటనకు అందరూ మెస్మరైజ్ అయ్యారు. కథ చెప్పడంలో పా రంజిత్ స్టయిల్ పై మరోసారి అభినందనలు జల్లు కురిసింది. ఈ సినిమాకి ఖచ్చితంగా అవార్డులు దక్కే అవకాశం వుంది. కార్తి అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’ తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. స్వచ్చమైన సినిమా అనే కితాబు అందుకుంది. 96 ఫేం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తీసిన ఈ సినిమా హార్ట్ వార్మింగ్ మూవీగా నిలిచింది.
రజనీకాంత్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చాయి. లాల్ సలాం, వేట్టయన్. ఇందులో లాల్ సలాం డిజాస్టర్. రజనీ కుమార్తె డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతమాత్రం ప్రభావం చూపలేదు. వేట్టయన్ కొంతలో కొంత బెటర్. అయితే రజనీ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా కాలేకపోయింది. అమరన్ తో శివకార్తికేయన్ మరో హిట్టు కొట్టాడు. మేజర్ ముకుంద్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి, శివ నటన ప్రత్యేకంగా నిలిచింది. సాయి పల్లవి ఫ్యాక్టర్ తెలుగులో మంచి వసూళ్ళకు దోహాదపడింది.
ఈ ఏడాది విజయ్, సూర్య భారీ డిజాస్టర్లు చూశారు. పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ ఆఖరి సినిమా అనే ప్రచారంతో వచ్చింది ‘గోట్’. అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. విజయ్ డబుల్ యాక్షన్ బెడిసికొట్టింది. టీజర్ రిలీజ్ నుంచే ఎన్నో భారీ అంచనాలు రేపిన సూర్య ‘కంగువా’ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. బేసిక్ గా సినిమా ఫలితం ఎలా వున్నా సూర్య నటనకు మంచి మార్కులు పడతాయి. ఈ సినిమాలో అదీ జరగలేదు. డియర్, లవర్, సైరన్, విశాల్ రత్నం .. ఈ సినిమాన్నీ నిరాశ పరిచాయి.
ఈ ఏడాది మలయాళం సినిమాలకు బాగా కలిసొచ్చింది. ‘ప్రేమలు’ సినిమా ఊహించని విజయం సాధించింది. ఈ లైటర్ వెయిన్ రొమాంటిక్ కామెడీని ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ లో చూసిన రొమాంటిక్ కామెడీ ఇదే కావచ్చు. మమ్ముట్టి భ్రమయుగంకు వసూళ్లు దక్కలేదు కానీ సినిమాని లోతుగా ఇష్టపడే వారికి థ్రిల్ ఇవ్వగలిగింది.
సర్వైవల్ థ్రిల్లర్ మంజుముల్ బాయ్స్ కి ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కాయి. మలయాళం నుంచి వచ్చిన మరో మంచి సినిమా పృద్వీ రాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’. గొప్ప పెర్ఫార్మెన్స్, ఫిల్మ్ మేకింగ్ తో ఆడియన్స్ ని కదిలిచింది. ఈ సినిమాకి కూడా అవార్డులు రావడం గ్యారెంటీ. టివినో థామస్ చేసిన ‘ఏఆర్ఎం’ తెలుగు ఆడియన్స్ ఆకట్టుకోవడం విఫలమైయింది. మోహన్ లాల్ మెగాఫోన్ పట్టుకున్న ‘బరోజ్’ పిల్లల సినిమా. మోహన్ లాల్ నుంచి ఇదొక కొత్త రకం సినిమానే గానే తెలుగు ఆడియన్స్ పెద్దగా ద్రుష్టి పెట్టలేదు.
కేజీఎఫ్, కాంతార ఇచ్చిన స్ఫూర్తితో కన్నడ సినిమా తెలుగు మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఈ ఏడాది ఒక్క కన్నడ సినిమాకి కూడా తెలుగులో మెరవలేదు. మార్టిన్ డిజాస్టర్ అయ్యింది. ప్రశాంత్ నీల్ కథతో వచ్చిన భగీర మెప్పించలేకపోయింది. వెరైటీ సినిమాలు తీసే ఉపేంద్ర నుంచి ‘యూఐ’ వచ్చింది. బేసిక్ గా ఆయన సినిమాలకి పదేళ్ళ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ వస్తుటుంది. యూఐ విషయంలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. ఏదో సర్రియల్ గా ప్రయత్నించారు కానీ అది ఆడియన్స్ కి పట్టలేదు. డిసెంబర్ చివరి వారంలో కిచ్చా సుదీప్ మ్యాక్స్ తో వచ్చాడు. ఇది ఖైదీ టైపు సింగిల్ నైట్ లో జరిగే సినిమా. సెకండ్ హాఫ్ బెటర్ గా వుంటే రిజల్ట్ ఇంకా బావుండేది.