2023 తెలంగాణ కాంగ్రెస్కు రోలర్ కోస్టర్ రైడ్. ఎక్కడో దిగువ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏడాది చివరికి వచ్చే సరికి ఎంతో ఎత్తుకు చేరిపోయిది. అన్ని ప్రయత్నాలు చేసి..చివరికి విజయాన్ని అందుకుంది. అలాంటి అద్బుతమైన విజయంతో 2024లో కి అడుగు పెట్టిన తెలంగాణ కాంగ్రెస్కు 2024 ఆ స్థాయిలో హుషారు ఇవ్వలేదు. కారణాలు ఏమైనా.. ఆ రోలర్ కోస్టర్ రైడ్ కొనసాగుతోంది. ఈ ఏడాది గుర్తుపెట్టుకోవాల్సినంత గొప్ప విజయాలు.. కుంగిపోవాల్సినంత పరాజయాలు అయితే కాంగ్రెస్ పార్టీకి రాలేదని చెప్పుకోవచ్చు.
2023 తరహాలోనే 2024ని కూడా ఓ అద్భుతమైన సంవత్సరంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కనీసం పన్నెండు నుంచి పదిహేను స్థానాలు గెల్చుకోవవడానికి ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి కూడా రాదని ఆయన గట్టిగా చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ ను నియంత్రించడానికి బీఆర్ఎస్ తనను తాను ఆత్మహత్య చేసుకుని అయినా బీజే్పీకి మద్దతిస్తుందని అనుమానించారు. అయితే దానికి సరైన విరుగుడు మాత్రం కనిపెట్టలేకపోయారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది పార్లమెంట్ సీట్లకే పరిమితమయింది. ఇది రేవంత్ రెడ్డి పలుకుబడి హైకమాండ్ వద్ద అమాంతం పెంచకుండా అడ్డు పడింది.
ఆ ఫలితాల ప్రభావం ఇంకా కాంగ్రెస్ పార్టీపై ఉంది. మంత్రివర్గంలో మిగిలిపోయిన ఆరు ఖాళీల్ని భర్తీ చేసుకోవడానికి హైకమాండ్ అనుమతి ఇవ్వడం లేదు. పీసీసీ చీఫ్ పదవిని మోయడం తన వల్ల కాదని తాను చెప్పిన వారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టి మహేష్ గౌడ్ కు ఇప్పించుకున్నారు. మంత్రివర్గ విస్తరణకు మాత్రం అనుమతి తెచ్చుకోలేకపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిస్థితి ఎలా ఉందో కానీ బయటకు మాత్రం పూర్తి స్థాయి ఐక్యత చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసే పనులకు మంత్రులు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.
2024 కాంగ్రెస్ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఐక్యత చూపించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. 2025లో స్థానిక ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ కు వచ్చే ఏడాది మరింత కీలకం కానుంది.