కొత్త ఆశలతో నూతన సంవత్సరం వచ్చేసింది. గత ఏడాది అందించిన జ్ఞాపకాలతో 2024కు స్వాగతం పలిగింది చిత్రసీమ. గత ఏడాది మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోల సినిమాలు తెరపైకి రాలేదు. అయితే ఈ ఏడాది ఆ లోటు తీర్చేయబోతున్నారు. వీరితో పాటు గత ఏడాది విజయాలు అందుకున్న హీరోలు మరింత ఉత్సాహంతో దూసుకుపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కొన్ని సినిమాలు ఇప్పటికే సెట్స్ పై వున్నాయి, ఇంకొన్ని వెళ్ళడాని సిద్ధంగా వున్నాయి. 2024లో హీరోల డైరీలో ఎలా ఉండబోతుందనే వివరాల్లోకి వెళితే..
గత ఏడాది గ్యాప్ ఇచ్చిన హీరోల్లో మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున..ఆ గ్యాప్ ని 2024 ప్రారంభంలోనే భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. మహేష్ బాబు గుంటూరుకారం సంక్రాంతి బరిలో జనవరి 12న రావడానికి రెడీగా వుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సినిమాల్లో పెద్ద ఎట్రాక్షన్. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నారు మహేష్. ఇప్పటికే రాజమౌళి కథపై వర్క్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే సహజంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పడుతుంది. గుంటూరుకారం తర్వాత మహేష్ డైరీ అంతా రాజమౌళి సినిమాతోనే సరిపోతుంది.
జనవరి 13న సైంధవ్ సినిమాతో వస్తున్నారు వెంకటేష్. ఇది వెంకీకి 75 చిత్రం. ‘HIT’ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే టీజర్ కొంత ఆసక్తిని రేపింది. ఈ సినిమా తర్వాత వెంకీ చేయబోయే కొత్త సినిమా ఇంకా ఖరారు కాలేదు కానీ.. ఆయన కోసం చాలా మంది దర్శకులు వున్నారు. తరుణ్ భాస్కర్ ఓ కథని రెడీ చేశారు. అలానే రానా నాయుడు వెబ్ సిరిస్ పార్ట్ 2 కూడా ఈ ఏడాదే షూటింగ్ జరిగే ఛాన్స్ వుంది.
నాగార్జున ‘నా సామిరంగ’ జనవరి 14న థియేర్లలోకి వస్తుంది. ఈ సినిమాతో విజయ్ బిన్నికి దర్శకత్వం అవకాశం ఇచ్చారు. ప్రచార చిత్రాల్లో పండగకళ కనిపిపిస్తోంది. ఆస్కార్ గెలుచుకున్న తర్వాత ఎంఎం కీరవాణి మ్యూజిక్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రం తర్వాత నాగ్ చేయబోయే కొత్త సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ధమాకా రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని వినిపిస్తోంది. అలాగే తమిళ దర్శకుడు అనిల్‌తో ఓ సినిమా వుంటుంద ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ధనుష్ – శేఖర్ కమ్ముల కలయికలో రూపొందనున్న సినిమాలో నాగ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు వినికిడి. నా సామిరంగ విడుదల తర్వాత నాగ్ కొత్త సినిమా ప్రకటన రావచ్చు.
సంక్రాంతి తర్వాత వేసవి సినిమాల సందడి ఎన్టీఆర్ మొదలుపెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న భారీ చిత్రం ‘దేవర’ రెండు భాగాలుగా విడుదలౌతుంది. తొలి భాగం ఏప్రిల్ 5న రానుంది. ఈ సినిమా తర్వాత తారక్ కు చాలా పెద్ద లైనప్ వుంది. ‘వార్ 2’షూటింగ్ ఈ ఏడాదే జరుగుతుంది. ఇది తారక్ తొలి బాలీవుడ్ చిత్రం. హృతిక్ రోషన్, తారక్ కలసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న కొత్త సినిమా వేసవిలో మొదలయ్యే ఆకాశం వుంది. మొత్తానికి మూడు భారీ సినిమాలతో 2024 అంతా బిజీగా గడుపుతున్నారు ఎన్టీఆర్.
2023లో ‘బ్రో’ సినిమాతో అభిమానులని పలకరించారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా ఆయన అభిమానుల ఆకలి అనుకున్నంత తీర్చలేకపోయింది. ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘హరి హర వీరమల్లు’ ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు సెట్స్ పై ఉంచారు పవన్. ఓజీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ కి డేట్స్ కేటాయించివుంటే సినిమా వేసవిలో సందడి చేసేది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా చాలా క్రియాశీలకంగా వున్నారు. దీంతో ఓజీ అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే సందేహం వుంది. అటు 2024, పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా చాలా కీలకం కానుంది. ఏపీలో జరగబోయే ఎన్నికలు పూర్తయిన తర్వాతే పవన్ మళ్ళీ సినిమాలపై ద్రుష్టి పెట్టే అవకాశం వుందని తెలుస్తోంది.
సలార్ తో మరో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రభాస్ 2024 డైరీ కూడా ఖాళీ లేకుండా నిండిపోయింది. ‘కల్కి 2898 ఎ.డి’ తో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధంగా వున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలోవైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటివలే దర్శకుడు మరో మూడు నెలల్లో ట్రైలర్ రావచ్చని హింట్ ఇచ్చారు. ఇక ప్రభాస్ – మారుతి కలయికలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ యేడాదే ఈ సినిమా రావచ్చని చెబుతున్నారు. దీంతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ‘స్పిరిట్’ చేయబోతున్నారు ప్రభాస్.
ఆగస్ట్ లో అల్లు అర్జున్ సందడి చేయబోతున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పార్ట్ 1 కంటే భారీగా ‘పుష్ప రూల్’ ని చిత్రీకరిస్తున్నారు సుకుమార్. ఆగస్టు 15న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో వుంటుంది. ఈ చిత్రం త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా కాబోతుంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్’ తో బిజీగా వున్నారు రామ్ చరణ్. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే కొత్త సినిమా ఖరారైయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనుకు జరుగుతున్నాయి. మార్చ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.
చిరు-బాలయ్య అదే జోరు: 2023లో అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ తమ జోరు చూపించారు. విజయాలు అందుకోవడంతో పాటు సినిమాలు తీసుకురావడంలో కూడా టాప్ గేర్ లో వెళ్లారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ తో సందడి చేస్తే.. బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో అలరించారు. 2024లో కూడా వారిలో అదే జోరు కనిపిస్తుంది. ప్రస్తుతం విశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ అడ్వంచర్ ని చేస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రానికి విశ్వంభర అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు బాలకృష్ణ. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు ఏడాది ప్రధమార్ధంలోనే షూటింగ్ పూర్తి చేసేయాలనే ప్లాన్ తో పని చేస్తోంది చిత్ర యూనిట్. దీని తర్వాత బాలయ్య కొత్త సినిమా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఏపీలో ఎన్నికల తర్వాత మళ్ళీ కొత్త సినిమాలపై ద్రుష్టి పెట్టనున్నారు బాలయ్య.
సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే రవితేజ 2024లో కూడా ఆ స్పీడ్ ని కొనసాగించబోతున్నారని ఆయన సినిమాలని అంగీకరించే తీరు చూస్తుంటే అర్ధమౌతుంది. గత ఏడాది రెండు సినిమాలు తీసుకొచ్చిన ఆయన ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘ఈగల్’ని దించారు. గోపీచంద్ మలినేనితో ఆయన చేయబోయే సినిమా క్యాన్సిల్ అయ్యింది. వెంటనే హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయారు. ఇదొక రీమేక్. వీలైనంత తర్వాత గా పూర్తి చేసి సినిమాని విడుదల చేయడానికి రెడీగా వున్నారు రవితేజ. ఈ సినిమాల తర్వాత ప్రన్నస కుమార్, శ్రీకాంత్ విస్సా లాంటి రచయితలు ఆయనతో సినిమా చేయడానికి కథలతో సిద్ధంగా వున్నారు. ఈ ఏడాదే రవితేజ నుంచి మరో మూడు సినిమా ప్రకటనలు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.
‘భీమా’ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులని అలరించబోతున్న గోపీచంద్.. శ్రీవైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం కూడా ఈ ఏడాదే రాబోతుంది. ఈ చిత్రానికి ‘విశ్వం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
గత ఏడాది రెండు సినిమాలతో సందడి చేసిన నాని.. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో వచ్చే అవకాశం వుంది. దిని తర్వాత శైలేష్ కొలనుతో హిట్ 3 చేయబోతున్నారు.
ఈ ఏడాది విజయ్ దేవరకొండ సినిమా ఆర్డర్ ఆసక్తికరంగా వుంది. గీత గోవిందం’ లాంటి హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ చేస్తున్నారు విజయ్. ఈ సినిమా మార్చిలో థియేటర్లలోకి రానుంది. దీంతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నారు. అలాగే టాక్సీవాలా తో విజయ్ కి విజయాన్ని ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ తో రాయలసీమ నేపధ్యంలో ఓ పిరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నారు.
నాగచైతన్య తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం కోసం చాలా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు చైతు. ఇది పూర్తయ్యే వరకూ మరో సినిమాని చేయకూడదుని నిర్ణయించుకున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ తో హిందీలో అరంగేట్రం చేసిన వరుణ్ తేజ్.. ఫెబ్రవరి 16 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దిని తర్వాత మట్కా సినిమా చేస్తున్నారు. ఇది వరుణ్ కు మొదటి పాన్ ఇండియా చిత్రం.
అడివి శేష్ చేతిలో గూఢచారి 2, డాకాయిట్ లాంటి రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు వున్నాయి. ఈ రెండూ ఇదే ఏడాది వచ్చే అవకాశం వుంది. నిఖిల్ స్వయంభూ, ఇండియన్ హౌస్ చిత్రాలతో బిజీగా వున్నారు. సుధీర్ బాబు నుంచి హరోం హర, మానాన్న సూపర్ స్టార్ చిత్రాలు ఈ ఏడాదిలోనే రాబోతున్నాయి.