అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ‘పుష్ప 2’ సినిమా 2024లో టాలీవుడ్ సంచలనమయ్యేది. ఆ సినిమా సాధించిన విజయం అభిమానులకు గొప్ప జ్ఞాపకంగా నిలిచేది. కానీ ఒకే ఒక్క రాత్రిలో మొత్తం మారిపోయింది. దురదృష్టవశాత్తూ జరిగిన ఓ ఘటన సినిమాకి బదులు హీరోని సంచలనంగా మార్చింది. ‘పుష్ప-2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ కి వెళ్లారు అల్లు అర్జున్. ఆయన్ని చూడానికి జనాలు పెద్ద ఎత్తున ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అల్లు అర్జున్ ఏ 11గా చేర్చారు.
మొదట్లో ఇది ఓ మామూలు కేసుగానే కనిపించింది. సంధ్య థియేటర్ సిబ్బందిలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏ 11గా వున్న అల్లు అర్జున్ వరకూ రావడం ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారో ఒక్కసారిగా సంచలనంగా మారింది. బన్నీని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి 2గంటల పాటు విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్ ఓ సస్పెన్స్ డ్రామాని తలపించింది.
* బన్నీ అరెస్ట్ కు ముందు ఏం జరిగింది ?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్రతని అల్లు అర్జున్ కానీ అతని టీంకి సరిగ్గా గుర్తించలేదనే వాస్తవం. మొదట ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం పేరుతో ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత బన్నీతో ఓ వీడియో చేయించి వదిలారు. ఈ గ్యాప్ లో జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు.. ఈ ఘటనలో మానవత కోణం లోపించింది. యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన పరామర్శని ఆలస్యం చేస్తూ వచ్చారు. చికిత్స పొందుతున్న బాబు అల్లు అర్జున్ అభిమాని. లీగల్ గా ఏమైనా సమస్యలు వస్తాయేమో అని అలోచించుకున్నారు కానీ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శిస్తే బావుంటుందనే స్పృహ లేకుండాపోవడం బాధాకరం. సాయం ప్రకటిస్తే చాలు అనుకునే ధోరణి కనిపించింది.
* ప్రత్యర్ధులకు అస్త్రాలు ఇచ్చిన అల్లు అర్జున్:
పుష్ప 2 విడుదలై అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకొని ఓపెనింగ్స్ ఆదరగొట్టింది. ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి ఓ మీడియా మీట్ ని పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ వ్యవహార శైలి వింతగా తోచింది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేరునే మర్చిపోయారు. అల్లు అర్జున్ మాటలు బిఆర్ఎస్ లీడర్ కేటీఆర్ తన రాజకీయ మైలేజ్ కోసం వాడుకున్నారు. పదేపదే అల్లు అర్జున్ మాటలని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలు చేశారు. ఇంతా జరుగుతున్నా ”పొరపాటున మర్చిపోయాను. దయచేసి ఎవరూ దీన్ని రాజకీయం చేయొద్దు’అనే క్లారిటీ అల్లు అర్జున్ నుంచి రాలేదు. ఈ రకంగా ఈ కేసుని రాజకీయ చేసే అవకాశం అల్లు అర్జునే ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమైయ్యాయి.
* అరెస్ట్ తర్వాత ఏం జరిగింది ?
అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలను సంతోషపెట్టింది. బన్నీ అరెస్ట్ ని రాజకీయ లబ్ది కోసం వాడేసాయి ప్రతిపక్ష పార్టీలు. తన పేరు మర్చిపోయినందుకు రేవంత్ రెడ్డి కక్ష తో అరెస్ట్ చేయించారని కేటీఆర్ పాట పాడారు. రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలని కప్పించుకునేందు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సినిమా స్టార్ ని అరెస్ట్ చేయించారని ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై దాడి చేశాయి. ప్రభుత్వంపై ఇన్ని విమర్శలు వస్తే ఒక ముఖ్యమంత్రి కచ్చితంగా సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి కూడా అదే చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసులోని పూర్వాపరాలని సామాన్యులందరికీ అర్ధమయ్యేలా కాస్త ఘాటైన భాషలోనే వివరించారు. ‘టికెట్ రేట్లు పెంచమంటే పెంచాము. ఒక ప్రాణం పోయింది వూరుకోమంటే.. సహించాలా?’ అంటూ చాలా తీవ్రస్థాయిలో మాట్లాడారు.
* సింపతీ అటు.. ఇటు:
ఈ కేసులో సింపతీ చాలా వింతగా అటు ఇటు షిఫ్ట్ అయ్యింది. మొదటి దీన్ని ఒక దుర్ఘటనగా చూశారు. అల్లు అర్జున్ రియాక్షన్ లేట్ అవ్వడంతో ఇప్పటివరకూ స్పందించకపోవడం అన్యాయం అని మాట్లాడుకున్నారు. బన్నీని అరెస్ట్ చేయడంతో ఒక్కసారి సింపతీ అంతా బన్నీ వైపు వచ్చింది. పాపం.. అరెస్ట్ చేయకపోవాల్సిందనే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా బన్నీని పరామర్శించడంతో సింపతీ మరింతగా పండింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రేవంత్ సర్కార్ చట్టంప్రకారమే ముందుకు వెళ్తుందనే భావన అందరిలో కలిగింది.
* గాయాన్ని పెద్దది చేసిన అల్లు అర్జున్:
సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం అల్లు అర్జున్ ని కలవర పెట్టింది. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడారని వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఇది తొందరపాటు చర్యగానే భావించాలి. ప్రెస్ మీట్ పెట్టి బన్నీ చెప్పిన బలమైన పాయింట్లు ఏమీ లేవు. పైగా చాలా పేలవంగా మాట్లాడారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే.. దాని వెనుక ఎంత గ్రౌండ్ వర్క్ వుంటుంది? ఏ ఆధారాలతో అలాంటి ప్రసంగం చేసి వుంటారు? ప్రభుత్వం దగ్గర వున్న సాక్ష్యాలు ఏమిటి? ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అలోచించాల్సింది. ఏకంగా ఒక రాష్ట్ర అసెంబ్లీని ఢీ కొన్నట్లు ఓ ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ తప్పుడు ఆరోపణలు అన్నారు బన్నీ. ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కి కౌంటర్ ఇవ్వడం ఎంత సీరియస్ ఇష్యూనో బన్నీకి తర్వాత ఉదయమే తెలిసొచ్చింది. కోర్టులో చూపించాల్సిన ఆధారాలని ఏకంగా మీడియా ముందే ప్రవేశ పెట్టారు పోలీసు అధికారులు. బన్నీ మాటలని, ఆ తొక్కిసలాట వీడియోలని బేరేజు వేసుకుంటే.. బన్నీ మాటలు బలంగా అనిపించలేదు. ఒక రకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూని ఇంకా పెద్దది చేసుకున్నట్లే కనిపించింది.
* సినీ పరిశ్రమ పరిస్థితి ఏమిటి ?
అల్లు అర్జున్ వివాదాన్ని కారణంగా చూపుతూ సినీ పరిశ్రమకు రేవంత్ సర్కార్ వ్యతిరేకమనే ప్రచారం జరిపారు ప్రత్యర్ధులు. ఐతే ఈ మొత్తం విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి, సినీ పెద్దల సమవేశం జరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ సృష్టించాలన్నది తమ సంకల్పమని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం వుంటుందని చెప్పారు.
* పవన్ కళ్యాణ్.. లాస్ట్ పంచ్ :
అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వాతావరణం వుందో అందరికీ తెలుసు. బన్నీ అరెస్ట్ తర్వాత కుటుంబ పెద్దగా చిరంజీవి ఆ రోజు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. దీంతో రెండు కుటుంబాల మధ్య సఖ్యతకి ఎలాంటి బీటలు వారలేదనే సంకేతాలు ఇచ్చారు. అటు బన్నీ రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి ఇంటికి లంచ్ కి వెళ్ళారు. కానీ బన్నీ ఇష్యూలో ఎవరూ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ .. ఈ మొత్తం వివాదంపై తాజాగా తన మనసులో మాటలు చెప్పారు. ఈ మొత్తం ఇష్యూలో రేవంత్ రెడ్డి సర్కార్ పని తీరుని మెచ్చుకున్నారు. అదే సందర్భంలో కేవలం బన్నీని ఒంటరి చేసినట్లుగా అనిపించిందని అన్నారు. ఏదేమైనా రేవతి కుటుంబానికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు అభినందించదగ్గవి. ఆయన రాజకీయ నేత అయినప్పటకీ సినిమా మనిషి. ఆయన మాటలు ఇటు పరిశ్రమ అటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొనేలా చేశాయి.
* అల్లు అర్జున్ కిం కర్తవ్యం ?
ఈ ఏడాది అల్లు అర్జున్ కి పుష్ప 2 లాంటి అఖండ విజయం వచ్చింది. అయితే ఈ విజయం కంటే విజయంతో పాటు వచ్చిన విషాదం లాంటి వివాదం ఓ పీడకలగా మిగిలింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ అగ్ర కథానాయకుడు అరెస్ట్ అయి జైలుకి వెళ్ళడం గతంలో ఎన్నడూ జరగలేదు. కొందరు ఆయన ఇంటిపై రాళ్ళు రువ్వారు. దీన్ని అందరూ ఖండించారు. ఓ దురదృష్ట ఘటన కారణంగా ఇలాంటి ఓ అవాంచిత పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు బన్నీ చట్టం ప్రకారమే ఈ కేసుని ఎదుర్కోవాలి. జనవరి 3న ఆయన బెయిల్ పై కోర్టు తీర్పు వెలువరిస్తుంది. ఈ కేసులో చిక్కుముళ్ళున్నీ వీడి రానున్న కొత్త ఏడాది అల్లు అర్జున్ కి ఓ కొత్త ఆరంభం అవుతుందేమో చూడాలి.