మన దేశంలో మధ్యతరగతి ప్రజలు అల్ప సంతోషులు. ఎంత అంటే ఒక్క లీటర్ పెట్రోల్ మీద ప్రభుత్వాలు అరవై రూపాయల పన్నులు వేస్తున్నా.. ప్రశ్నించకుండా కట్టేసి బతుకుబండి లాగించేస్తున్నారు. ఆ అరవై రూపాయల టాక్స్ వల్ల అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా.. భరిస్తున్నాడు. ఎందుకంటే తిరగబడి సమయం వృధా చేసుకుంటే కడుపు కాలిపోతుంది. అందుకే సంపాదించిన దాంట్లో పన్నులకు పోను మిగిలిన దాంతోనే సర్దుకుంటున్నాడు. ఇలాంటి పన్నుల్లో ఓ పది పైసలు తగ్గించినా సంతృప్తిపోతాడు మధ్యతరగతి జీవి.
జీఎస్టీ వచ్చిన తర్వాత ప్రజల నుంచి పన్నుల బాదుడు ఎక్కువైపోయింది. గతంలో అన్ని పన్నులతో సహా అనే బిల్లులు వచ్చేవి. ఇప్పుడు జీఎస్టీ వేరుగా వేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మార్పీలకు జీఎస్టీలు ఎగస్ట్రా అవుతున్నాయి. ఈ భారం అంతకంతకూ పెరిగిపోతోంది. నెలకు దేశ ప్రజల నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల వరకూ జీఎస్టీ రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇంకా పెంచుకోవడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఆదాయపు పన్ను కట్టే వాళ్లు అయితే.. అటు సంపాదనకు పన్ను కట్టి.. ఇటు ఖర్చులకూ పన్నులు కట్టి ఖర్చయిపోతున్నారు కానీ.. తమ భవిష్యత్ కు భద్రత కల్పించుకోవడానికి తంటాలు పడుతున్నారు.
కొత్త ఏడాదిలో ప్రజలు కోరుకుంటున్నది.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నది ఈ పన్ను పోటు నుంచి కాస్తంత ఉపశమనం. వేతన జీవులు కనీసం పది లక్షల వరకూ అయినా పన్ను లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. లేకపోతే నిరాశా నిస్ప్రహలు ఆవరించే అవకాశం ఉంది. పది లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని కేంద్రం లీకులు ఇస్తోంది.కానీ గత పదేళ్లుగా ఇలాంటి లీకులు వస్తున్నాయి…కానీ అసలు బడ్జెట్లో ఏమీ ఉండటం లేదు. ఈ సారైనా లీకులిచ్చినట్లుగా నిజం చేస్తారా ?