ప్రపంచం అంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఆ ప్రపంచంలో ఓ భాగం అయిన తెలుగు రాష్ట్రాలకూ కొత్త ఏడాదే. కానీ ఈ ఏడాది ఎప్పట్లాగే గడిపేద్దామన్నంత వెసులుబాటు ఈ రెండు రాష్ట్రాల పాలకులకు లేదు. మా సమర్థతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని గట్టెక్కడానికి ఈ ఏడాదే అత్యంత కీలకం అని ప్రజలు కూడా నమ్ముతున్నారు.
ఏపీలో అనేక సమస్యలకు ఈ ఏడాదే పరిష్కార పునాదులు పడాలి !
ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని గాడినా పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి ఆయనకు ప్రజలు అన్ని ఆయుధాలు ఇచ్చారు. కాలం కూడా కలసి వచ్చింది . కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యాశకు పోకపోయినా కావాల్సినంత సహకారం అందే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా జగన్ లాంటి వ్యక్తులు చిరాకు పెట్టకుండా ఏకపక్షంగా బలం ఇచ్చారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పనులు చేపట్టాల్సి ఉంది. వ్యక్తిగతంగా మేళ్లు చేయడం కాదు.. అందరికీ మేలు జరిగేలా చేయాలి. అలా జరగాలంటే రాజధాని పూర్తవ్వాలి.. పోలవరం పూర్తి కావాలి. చంద్రబాబు కొత్తగా బకనచర్ల ప్రాజెక్టును అనుకుంటున్నారు. వీటన్నింటినీ ఈ ఏడాది పట్టాలెక్కించారు. పూర్తి చేయడం సాధ్యం కాదు. కానీ కాలంతో పోటీ పడి పరుగులు పెట్టించాలి. అప్పుడే చంద్రబాబు తన సామర్థ్యానికి తగ్గట్లుగా ప్రతిభ చూపించారని ప్రజలు అనుకుంటారు. అంతే కాదు ఇది రాష్ట్రానికి కూడా అత్యవసరం.
తనదైన ముద్ర కోసం సాహసం చేస్తున్న రేవంత్
ఏపీతో పోలిస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాలపరీక్ష అంత కఠినమైనది కాదు. ఆయనకు మెట్రో సిటీ హైదరాబాద్ అండగా ఉంది. కానీ రేవంత్ అలాంటి కంఫర్ట్ జోన్ లో ఉండటానికి ఇష్టపడే సీఎం కాదు. అందుకే ఆయన పదవి చేపట్టినప్పటి నుండి హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీ, ఏఐ వర్శిటీ అటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ ఆయన అమలు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసింది ఇప్పుడు అమలు చేయలేకపోతున్నామని వాదిస్తే ప్రజలు ఒప్పుకోరు. ఈ విషయం ఆయనకు తెలియనిది కాదు. ఈ హామీలను అమలు చేస్తూ తన ముద్ర వేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలి. పూర్తి చేయలేకపోవచ్చు కానీ.. పూర్తవుతాయన్న నమ్మకాన్ని ఈ ఏడాది కల్పించాల్సి ఉంటుంది.
చంద్రబాబుకు సవాళ్లెక్కువ – ప్రతిబంధకాలు తక్కువ – రేవంత్‌కు రివర్స్
చంద్రబాబుకు ప్రతిపక్షం లేదు. ఎవరైనా తోక జాడిస్తే కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే వైసీపీ బయటకు రాలేకపోతోంది. కానీ ఆయన చక్కదిద్దాల్సిన పనులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ కు ఈ పరిస్థితి రివర్స్ ఉంది. బలమైన ప్రతిపక్ష పార్టీలు ఆయనకు ఎప్పటికప్పుడు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించి ముందడుగు వేయాల్సి ఉంది.