చిన్న వయసులోనే తన మధురమయిన గొంతు, ఉత్తేజకరమయిన పాటలతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన గాయని మధుప్రియ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చేయి. ఆమె శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించింది. వారి వివాహానికి ఆమె తల్లి తండ్రులు అంగీకరించకపోయినప్పటికీ వారిని ఎదిరించి గత ఏడాది అక్టోబరు30న పెళ్లి చేసుకొంది. పెళ్ళయిన ఐదు నెలలనే ఇరువురి మధ్య చాలా గొడవలు జరిగాయి. కొన్ని రోజుల క్రితమే ఆమె అతనిని విడిచి పెట్టి తన తల్లి తండ్రుల వద్దకు వెళ్లి పోయింది. నిన్న రాత్రి ఆమె తన తల్లితండ్రులతో కలిసి హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో తన భర్త తనను కట్నం కోసం వేదిస్తున్నాడంటూ శ్రీకాంత్ పై పిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై సెక్షన్స్: 498ఏ, 506,323 క్రింద కేసు నమోదు చేసారు. తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని, అసభ్య పదజాలంతో తనను, తన తల్లి తండ్రులను దూషిస్తుంటాడని, తన తల్లితండ్రుల వద్ద ఉన్న తన ఆస్తిని తీసుకు రమ్మని కొడుతుంటాడని ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాకపోయినప్పటికీ తల్లితండ్రుల అనుమతి లేకుండా చేసుకోవడం చాలా పొరపాటని, అందుకు తను మూల్యం చెల్లిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె భర్త శ్రీకాంత్ కూడా పోలీసులకు ఆమెపై పిర్యాదు చేసాడు. నిన్న రాత్రి మాట్లాడుకొందామని ఆమె తల్లితండ్రులు ఇంటికి పిలిచి తనను తీవ్రంగా కొట్టారని పిర్యాదు చేసారు. తీవ్ర గాయాల పాలయిన శ్రీకాంత్ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొన్నాడు. కానీ ఆసుపత్రి సిబ్బందికి తెలియజేయకుండానే ఆయన ఈరోజు తెల్లవారు జామున ఇంటికి వెళ్ళిపోయాడు.
వారివురుని సాక్షి మీడియా ఇంటర్వ్యూ చేసినపుడు మధుప్రియ తన భర్త తనను వేధిస్తున్నాడని, తనను నిత్యం తిట్టికొడుతూ ఉంటాడని చెప్పగా దానిని ఆమె భర్త శ్రీకాంత్ ఖండించాడు. ఆమె తల్లితండ్రులే తన పట్ల చాలా చులకనగా వ్యవహరించేవారని, అయినప్పటికీ ఏనాడు వారి గురించి అమర్యాదగా మాట్లాడలేదని చెప్పాడు. తన భార్య చేస్తున్న ఆరోపణలను అంగీకరించానప్పటికీ ఆమె మళ్ళీ తనతో కాపురం చేయడానికి వచ్చేందుకు ఇష్టపడితే మళ్ళీ అటువంటి పొరపాట్లు చేయనని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తానని చెప్పాడు.
ప్రజలు తన భార్యను మాత్రమే గుర్తించి తనను ఆమె భర్తగా మాత్రమే చూస్తుండటం, మధుప్రియ తన పాటల కార్యక్రమాల కోసం బయట తిరుగుతుండటం వంటి కారణాల వలన బహుశః అతని ‘మేల్ ఇగో’ దెబ్బ తినడంతో అది కోపంగా, క్రమంగా అసహనంగా మారి ఘర్షణకు దారి తీసి ఉండవచ్చును. ఇద్దరిదీ ఇంకా చిన్న వయసు కావడం చేత ఈ సమస్య పరిష్కరించుకోలేకపోవడంతో దానిని చాలా వేగంగా పెంచి పెద్ద చేసుకొన్నారు. ఇరువురి తల్లి తండ్రుల మధ్య కూడా ఇంతవరకు సరయిన సంబంధాలు నెలకొనకపోవడంతో వారు కూడా తమ పిల్లలనే వెనకేసుకువచ్చేరు తప్ప పిల్లల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడంతో చివరికి అందరూ రోడ్డున పడ్డారు. ఇప్పటికయినా వారి పెద్దలు కలిసి మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకొంటే మధుప్రియ, శ్రీకాంత్ వైవాహిక జీవితం మళ్ళీ గాడిన పడుతుంది.