ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష సమావేశం కొద్ది సేపటి క్రితం విశాఖపట్నంలో మొదలయింది. దానికి భాజపా రాష్ట్ర మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, పార్టీ ఎమ్మెల్యేలు పెన్మత్స విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ హాజరయ్యారు. మళ్ళీ రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో తమ పార్టీ అనుసరించాల్సిన విధానం గురించి వారు చర్చిస్తునట్లు తెలుస్తోంది.
శాసనసభలో భాజపాకి మొత్తం నలుగురే సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు కనుక వారిద్దరూ కూడా తెదేపా ప్రభుత్వ విధానమే తమ విధానం అన్నట్లుగా సభలో వ్యవహరించవలసి ఉంటుంది తప్ప అందుకు భిన్నంగా వ్యవహరించలేరు. వారిద్దరూ నిలదీయలేనప్పుడు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షంతో గొంతు కలిపి దేనిపైనా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేరు. ఒకవేళ విమర్శిస్తే సభలో ఉన్న నలుగురు భాజపా సభ్యుల మధ్యనే భిన్నాభిప్రాయాలున్నాయనే తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది.
అలాగని తెదేపాకు వంతపాడటమూ కష్టమే. ఎందుకంటే సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ వంటివారు తెదేపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నపుడు, భాజపా సభ్యులు ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తే వారు కూడా ఆ అవినీతిలో భాగస్వాములనే అనుమానాలు ప్రజలలో రేకెత్తించినట్లవుతుంది. కనుక శాసనసభలో తెదేపా-వైకాపాల మధ్య జరిగే భీకర యుద్ధాన్ని భాజపా సభ్యులు మౌనంగా గమనిస్తూ కాలక్షేపం చేయడం తప్ప మరేమీ చేయలేరు. మరి అటువంటప్పుడు శాసనసభలో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడానికి ఏముంటుందో?