భాజపా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఈరోజు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా తన బాధ్యతని నిర్వర్తించడంలో విఫలం అవుతోందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ప్రతిపక్ష బెంచీలో కూర్చోబెట్టారని, కనుక తెదేపా తమకు మిత్రపక్షమయినా, తాను ప్రతిపక్ష పాత్ర పోషించవలసివస్తోందని చెప్పారు. ఈరోజు ఆయన నిజంగానే ప్రతిపక్షపాత్ర పోషించారు. శ్రీకాకుళం జిల్లాలో ట్రైమెక్స్ సాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ చేస్తున్న అక్రమ ఇసుక మైనింగ్ గురించి ఆయన ఈరోజు ప్రశ్నోత్తర సమయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజా పద్దుల కమిటీకి చైర్మెన్ భూమా నాగిరెడ్డి నేతృత్వంలో దానిలో సభ్యులుగా విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ శర్మ తదితరులు అందరూ కలిసి అక్రమ మైనింగ్ జరుగుతున్న ఆ ప్రాంతానికి నిన్న వెళ్లి పరిశీలించివచ్చేరు.
దాని గురించి ఈరోజు శాసనసభలో విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ “నిన్న మేమందరం అక్కడికి వెళ్లినప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో ఇసుకను త్రవ్వేస్తుండటం చూసి, “దానికి అనుమతి ఉందా?” అని అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్ ని మేము ప్రశ్నించినపుడు వారు చెప్పిన సమాధానం విని మేమందరం షాకయ్యాము. ఈ వ్యవహారంలో చాలా మంది పెద్దలున్నారని వారు చెప్పారు. ఇది 2006 నుండి జరుగుతోంది కనుక అక్కడ ఇసుక త్రవ్వుకోవడానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా అది తప్పు కాదన్నట్లుగా వారు మాట్లాడటం విని షాక్ అయ్యేము.”
“ట్రైమెక్స్ సాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ప్రభుత్వం పరిమిత అనుమతులు మంజూరు చేసింది. కానీ అక్కడ ఈస్ట్ వెస్ట్ మైనింగ్స్ అనే సంస్థ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తునట్లు మేము గుర్తించాము. ఆ సంస్థ పేరిటే ప్రభుత్వానికి బిల్లు చెల్లింపులు కూడా జరుగుతున్నా ఎవరికీ అనుమానం కలుగక పోవడం ఎవరూ నిలదీయకపోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఆ సంస్థకు కేటాయించిన ప్రదేశంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇసుక త్రవ్వేసుకొంటుంటే, స్థానిక అధికారులు, మైనింగ్, పర్యావరణ, విజిలెన్స్ అధికారులు అందరూ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు.”
“ట్రైమెక్స్ సాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సముద్రపు ఇసుక నుండి ఆరు రకాల విలువయిన ఖనిజాలను వెలికి తీసి వైణి విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకొంటోంది. ఈ ఏడాదిలో ఇంతవరకు సుమారు 9700 టన్నుల విలువయిన ఖనిజాన్ని ఎగుమతి చేసి రూ.12, 000 కోట్ల లాభాలు ఆర్జించిందని తేలింది. కానీ ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించేది కేవలం 2శాతం రాయల్టీ మాత్రమే చెల్లిస్తోంది. అంతకంటే ఎక్కువ మొత్తం భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు చేసినప్పుడే ప్రభుత్వానికి సమకూరుతోంది.”
“రాష్ట్రానికి చెందిన సంపదను అక్రమంగా దోచుకొని అటువంటి సంస్థలను అడ్డుపెట్టుకొని కొందరు పెద్దలు దోచుకొంటుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోవడం సరికాదు. కనుక తక్షణమే దీనిపై ఒక కమిటీని వేసి విచారణ జరిపించి ఆ సంస్థ వెనుక ఉన్న పెద్దమనుషులను శిక్షించి వారు దోచుకొన్న డబ్బును తిరిగి కక్కించాలి. ఇసుకలో నుండి ఖనిజాలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూనుకొంటే మంచిది. అందుకోసం కేంద్రానికి లేఖ వ్రాసినట్లయితే తగిన సహాయసహకారాలు, అనుమతులు అన్నీ లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇటువంటి అక్రమాలకూ అడ్డుకట్ట వేసి దానిని ఆదాయవనరుగా మార్చుకొంటే ఈ ఆర్ధికసమస్యల నుంచి కూడా బయటపడవచ్చును కదా?” అని విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు.