ఈ అర్థరాత్రి నుంచి దేశం మొత్తం మూడు వారాల పాటు లాక్డౌన్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని.. ఇల్లు విడిచి బయటకు రావడం నిషేధమని..మోడీ స్పష్టం చేశారు. కరోనాను నిరోధించడానికి ఇంతకు మించిన మార్గం లేదన్నారు. కరోనా సోకిన వ్యక్తి సాధారణంగానే ఉంటాడని.. అతనిలో లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ లోపు ఇతరులకు.. వైరస్ను అంటించే ప్రమాదం ఉందన్నారు. దాన్ని నిరోధించాలంటే… లాక్డౌన్ తప్పదని పేర్కొన్నారు. ఈ ఇరవై ఒక్క రోజులు మనకు చాలా కీలకమని .. ఇది ఓ రకంగా కర్ఫ్యూ లాంటిదేనని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ ఇరవై ఒక్క రోజుల్ని మనం సమర్థంగా డీల్ చేయలేకపోతే.. ఇరవై ఒక్క ఏళ్లు వెనుకబడిపోతామని మోడీ హెచ్చరించారు. కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని.. మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్ా.. ముందుగానే మేలుకుని చర్యలు తీసుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో.. అత్యవసర సేవలు మినహా అన్నీ ఆగిపోనున్నాయి. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తాయని స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగానికి తక్షణం రూ. పదిహేను వేల కోట్లను మోడీ ప్రకటించారు.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు రాపిడ్గా పెరుగుతున్నాయి. ఇప్పటికి సంఖ్య 519కి చేరింది. గతంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ద్వారా ఇతరులకు సోకాయని..వారి ద్వారా శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రభుత్వానికి నిర్ణయానికి వచ్చింది. ఈ వ్యాప్తిని నిలిపివేయాలంటే.. ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ చేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.