తమ పత్రిక అధినేత జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయినందుకు, పాలకపక్షానికి చెందిన చంద్రబాబునాయుడు మీద వీలైనంత వరకు విషం చిమ్మడం ఒక్కటే లక్ష్యంగా సాక్షి దినపత్రిక భావిస్తున్నదా? సాక్షి రాతల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద నిర్ణయాల మీద అడ్డగోలుగా చెలరేగిపోతూ ఉండడం సర్వవేళలా గమనిస్తూ ఉన్న సంగతే. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు కూడా! వాళ్లు పత్రిక పెట్టుకున్నదే అందుకు అని సరిపెట్టుకుంటున్న వారు కూడా అనేకులు ఈ పత్రికలు ఆ రాతల్ని చదివి ఆనందిస్తుంటారు. ఆ పత్రికలో చంద్రబాబు మీద విమర్శలు వస్తే.. అవన్నీ జగన్ మాటలుగా జనం పరిగణిస్తున్నారే తప్ప.. అందులో పూర్తి వాస్తవాలు ఉంటాయని భావించడం లేదు. అలాంటి పరిస్థితిని సాక్షి రాతలే సృష్టిస్తున్నాయని తాజా రాతల్ని గమనిస్తే అర్థమవుతోంది.
సాధారణంగా ఒక నీతి ఉంటుంది. దాస్తే దాగే విషయాలు దాచినా పర్లేదు. దాచినా దాగని విషయాలను దాచకపోవడమే మంచిదని అంతా అంటుంటారు. కానీ ఆ సూత్రాన్ని కూడా పాటించకుండా… సాక్షి దినపత్రిక తమ రాతల్లో.. వాస్తవాలు చెప్పడం కంటె చంద్రబాబు మీద నిందలు వేయడమే తమకు ముఖ్యం అని చాటుకుంటున్నది. తాజాగా ఓ యువన్యాయవాది ఆత్మహత్యా ప్రయత్నానికి సంబంధించి ప్రచురించిన వార్త చదివితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.
‘చంద్రబాబును నమ్మి మోసపోయా’ అనే శీర్షికతో సాక్షి ఓ వార్తను ప్రముఖంగా ప్రస్తావించింది. తిరుపతిలోని యువ న్యాయవాది మాసుం ఇండియా (30) అనే వ్యక్తి ‘బాబు వస్తే జాబు వస్తుందనే తెదేపా హామీలు నమ్మి, రెండేళ్లు గడుస్తున్నా తమ కుటుంబంలో ఎవ్వరికీ ఒక్క ఉద్యోగమైన రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లుగా ఆ వార్త ఉంది. వార్త ఆద్యంతమూ చంద్రబాబు మీద నిందలతోనే నింపేశారు. లేఖలోని కథనం అంటూ కూడా.. బాబుపై నిందలనే ప్రస్తావించారు. అయితే వార్తలోనే లేఖ ఫోటోకూడా ప్రచురించారు.
తమాషా ఏంటంటే.. లేఖలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చాలా స్పష్టంగా.. ”బాబు వస్తే జాబు వస్తుందని, నరేంద్రమోడీ వస్తే నల్లధనం తెప్పిస్తామని ప్రజలను నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు” అంటూ ప్రారంభించారు. అయితే సాక్షి వార్తలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మీద సమానంగా ఆరోపణలు ఉండడాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. తిట్లన్నీ చంద్రబాబుమీదికే నెట్టే ప్రయత్నం చేసారు. సాక్షి వారికి అలాంటి కోరిక ఉంటే , కనీసం ఆ లేఖ ఫోటోనైనా ప్రచురించకుండా ఉండాల్సింది. దాన్ని ప్రచురిచండం వలన కేంద్రం మీద నిందల్ని తొక్కిపట్టి, చంద్రబాబు మీద నిందల్ని మాత్రం హైలైట్ చేయడానికి సాక్షి తాపత్రయ పడుతున్నదని, వార్తలను వక్రీకరించి ప్రజలకు అందిస్తున్నదని అందరూ గుర్తించే అవకాశం ఉంది.
సాక్షిని జగన్ చేతిలో కరపత్రిక అని వైరిపక్షాలు ఆరోపిస్తున్నాయంటే.. ఇలాంటి ఘటనలే అందుకు కారణం అవుతుంటాయి. స్వామిని మించిన స్వామిభక్తిని ప్రదర్శిస్తూ.. పత్రికలో రాతలు రాస్తూ.. సాక్షి పత్రికే జగన్ ఇలాంటి డ్యామేజీ చేస్తున్నదని పలువురు భావిస్తున్నారు.