వైరస్ జర్నలిస్టుల్నీ చుట్టుముడుతోంది. ముంబైలో ఒక్క రోజే 30 మందికిపైగా జర్నలిస్టులకు పాజిటివ్‌గా తేలింది. చెన్నైలో ఈ రోజు ఓ తమిళ టీవీ చానల్ సిబ్బంది 23 మందికి పాజిటివ్ గా తేలడంతో…. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించి… చానల్ లైవ్ ప్రసారాలను నిలిపివేశారు. ఢిల్లీ సర్కార్ జర్నలిస్టులు అందరికీ కరోనా టెస్టులు చేస్తామని ప్రకటించింది. ముంబైలో ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ ద్వారా మిగిలిన వారికి వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించారు. తమిళనాడులో మాత్రం.. సత్యం టీవీ అనే ఇరవై నాలుగు గంటల న్యూస్ చానల్లో పని చేసే ఓ సబ్ ఎడిటర్ తండ్రి ఎస్ఐ. ఆయన ద్వారా సబ్ ఎడిటర్ కు వచ్చింది.
సబ్ ఎడిటర్ కు కరోనా బయటపడటంతో..టీవీ చానల్లో పని చేసే వారందరికీ టెస్టులు నిర్వహించారు. రెండు రోజుల తర్వాత వచ్చిన టెస్టుల్లో 23 మంది సబ్ ఎడిటర్లు, ఇతర స్టాఫ్ కు పాజిటివ్ గా తేలడంతో అందర్నీ ఐసోలేషన్ కు తరలించారు. మిగిలిన స్టాఫ్ ను క్వారంటైన్ కు తరలించారు. దీంతో ఆ చానల్ ప్రసారాలను నిలిపివేయాల్సి వచ్చింది. జర్నలిస్టులు… కరోనా కవరేజీ కోసం ఫీల్డ్ లో విపరీతంగా తిరుగుతున్నారు. సరైన మాస్కులు.. శానిటైజర్లు కూడా ఉపయోగించకపోతూండటంతో… అందరికీ వైరస్ ముప్పు పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే.. అన్ని చోట్లా.. జర్నలిస్టులకు టెస్టులు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సర్కార్ ఈ మేరకు.. జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు చేయిస్తామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా ఒక్క కేసు బయటపడినా… అది ఆ మీడియా సంస్థ రోజువారీ కార్యకలాపాలకే తీవ్ర విఘాతం కలిగిస్తుంది.