దేశంలో కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. ప్రపంచంలో ఇంత వరకూ ఎవరూ చూపనంత సమానత్వం చూపిస్తోంది. ధనిక..పేద…అధికార..అనధికార అనే తేడా లేదు. టోల్ గేట్ల దగ్గర.. మేము అధికార పార్టీ అని చెప్పి.. దాడి చేసేవాళ్ల దగ్గర్నుంచి మేం ప్రెస్ అని కరోనాను లైట్ తీసుకున్న వారి వరకూ.. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేసిన వారిని సైతం.. వైరస్ పట్టేసింది. రాజకీయ నేతలు.. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఇలా.. అందర్నీ వెంటాడుతోంది.. వేటాడుతోంది. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సోకింది. ఆరోగ్య మంత్రి ఓఎస్డీకి సోకింది. 123 మంది జర్నలిస్టులకే టెస్టులు చేస్తే అందులో 23 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకూ 70 మంది జర్నలిస్టులు పాజిటివ్ బారిన పడ్డారు. వైద్యుల సంగతి చెప్పనవసరం లేదు. వైరస్ బారిన పడిన పోలీసులు కూడా.. వందకుపైగానే ఉంది.
తెలంగాణలో మాత్రమే కాదు.. ఏపీలో కూడా అంతే. ధర్మవరం ఎమ్మెల్యే గన్మెన్ కరోనా సోకి చనిపోయాడు. ఆయన ఆ లక్షణాల్ని బయట పెట్టుకోవడంతో సూపర్ స్ప్రెడర్గా మారాడు. ఇంకా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనూ అదే పరిస్థితి. మొన్నటివరకు రోజుకు 9 వేలుగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు దాదాపు 12 వేలకు చేరింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయ్. రోజురోజుకు కేసుల లెక్క పెరుగుతుండటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కేసులు ఇప్పటికే లక్ష దాటాయి దేశంలోని మొత్తం కేసుల్లో 30 శాతం మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. ఢిల్లీలో కరోనా క్యాపిటల్గానూ మారింది. ఇక తమిళనాడులోనూ రోజుకు రెండు వేల కేసులు నమోదవుతున్నాయి.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా విజృంభణ ఒక్క సారిగా పెరిగిపోయింది. మద్యం దుకాణాలను ప్రారంభించినప్పుడే.. రెండు నెలల లాక్ డౌన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరయిందన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఆ తర్వాత వరుసగా సడలింపులు ఇస్తూ పోతూండటంతో.. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు కంట్రోల్ చేయలేని పరిస్థితికి చేరిందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. బహుశా అందుకే ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉంటున్నాయేమో..?